గాలివాన బీభత్సం
జిల్లాలో మంగళవారం గాలివాన బీభత్సం సృష్టించింది. వడగండ్లు కడగండ్లు తెచ్చాయి. బడుగులపై పిడుగులు కురిసాయి. పంటలు దెబ్బతిన్నాయి. డక్కిలి మండలంలో పిడుగుపాటుకు ఇద్దరు బలయ్యారు. ఒకరు తీవ్రంగా, ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. మర్రిపాడు మండలంలోని పెద్దమాచనూరులో పిడుగుపడటంతో కావులూరి శ్రీనివాసులు పొలంలో చెరుకు పైరు దగ్ధమైంది. డీసీపల్లిలో వడగళ్ల వాన కురిసింది. కలువాయి మండలంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. రాపూరు, చేజర్ల మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఆత్మకూరు మండలంలో పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు నేల కూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
డక్కిలి(వెంకటరిగి): డక్కిలి మండలంలో మంగళవారం ఉరుములుతో కూడిన గాలివాన బీభత్సం సృష్టించింది. పిడుగుపాటుకు గురై వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మండలంలోని కమ్మపల్లి సమీపంలోని నిమ్మతోటలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న సంక్రాంతి నిర్మలమ్మ(38), పోకూరు వెంకటేశ్వర్లు పిడుగుపాటుకు గురై తీవ్రంగా గాయపడ్డారు. వీరిని గ్రామస్తులు హూటాహుటిన వెంకటగిరిలోనే ఓ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా నిర్మలమ్మ మార్గమధ్యంలో మృతి చెందింది. తీవ్రంగా గాయపడ్డ వెంకటేశ్వర్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అలాగే సైదాపురం మండలం లింగనపాళెం ఎస్టీ కాలనీకి చెందిన వేటగిరి రమణయ్య(45) సంగనపల్లి చెరువులో గొర్రెలు కాస్తుండగా పిడుగుపాటుకు గురై మృతిచెందాడు.
ఆయన కొన్ని రోజుల నుంచి మార్లగుంటలోని బంధువుల ఇంట్లో ఉంటూ అక్కడే గొర్రెలను మేపుకుంటూ ఉన్నాడు. అలాగే దగ్గవోలు గ్రామానికి చెందిన తోట కోటేశ్వరరెడ్డికి చెందిన రెండు ఎడ్లు పిడుగుపాటుకు గురై అక్కడక్కడే మృతిచెందాయి. అలాగే కమ్మపల్లిలో ఓ లేగ దూడ మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. లింగసముద్రం గ్రామానికి పునుగోటి నాగరాజుకి చెందిన రేకుల షెడ్డు కూలిపోయింది. విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేక పోవడంతో ప్రమాదం తప్పింది. మోపూరురోడ్డు సెంటర్‌కు చెందిన పలువురి పంటపొలాల్లో పిడుగుపడి కంచెలు దగ్ధమైనట్లు గ్రామస్తులు తెలిపారు. కమ్మపల్లిలో ఓ వృద్ధుడు, బాలుడు కూడా ఉరుములు మెరుపులకు స్వల్పంగా గాయపడినట్లు తెలిసింది.
వరి పంటకు అపార నష్టం
డక్కిలి మండలంలో కురిసిన వడగళ్ల వాన, గాలులకు పలు చోట్ల వరిపంట తీవ్రంగా దెబ్బతింది. ప్రధానంగా లింగసముద్రం, సంగనపల్లి తదితర చోట్ల వరిపంట గాలులకు నేలవాలింది. దీంతో రైతులకు అపారనష్టం సంభవించింది. చేతికొచ్చే పంట తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఆత్మకూరు మండలంలో.
ఆత్మకూరురూరల్ : ఆత్మకూరు మండలం, పట్టణంలో మంగళవారం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పలు గ్రామాల్లో విద్యుత్ తీగలు తెగిపడడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
కలువాయి, రాపూరు మండలాల్లో..
కలువాయి/రాపూరు : కలువాయి మండలంలో ఈదురుగాలుల దాటికి మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. కొన్ని చెట్లు నేలకూలాయి. అలాగే రాపూరులో ఉరుములు, మెరుపులతో కూడి ఓ మోస్తారు వర్షం కురిసింది.
గ్రామాల్లో వడగళ్ల వాన
దుత్తలూరు : మండలంలోని పలు గ్రామాలలో మంగళవారం వడగళ్లతో కూడిన గాలివాన కురిసింది. లక్ష్మీపురం, కమ్మవారిపాళెం, ఏరుకొల్లు తదితర గ్రామాల్లో వడగళ్ల వాన కురిసింది. కమ్మవారిపాళెం గ్రామంలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పూరిపాక చెల్లాచెదురైంది. లక్ష్మీపురంలో చెట్లు విరిగిపడ్డాయి. పైకప్పు రేకులు విరిగి పడ్డాయి.
పండ్ల తోటల రైతులకు నష్టం
బాలాయపల్లి : ప్రకృతి పండ్ల తోట రైతులపై కన్నెర్ర చేసింది. మంగళవారం సాయంత్రం వీచిన పెనుగాలులకు మల్లిమాల, నిండలి గ్రామాల్లో మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి. వెంగమాంబపురం గ్రామంలో పెనుగాలులకు ఓ ఇంటి రేకులు లేచి పగిలిపోయాయి.
పిడుగుపడి చెరుకుతోట దగ్ధం
మర్రిపాడు(ఆత్మకూరు): మర్రిపాడు మండలంలోని పెద్దమాచనూరు గ్రామంలో మంగళవారం సాయంత్రం పిడుగుపడడంతో గ్రామానికి చెందిన కావులూరి శ్రీనివాసులు పొలంలోని చెరుకు పంట దగ్ధమైంది. ఏడు ఎకరాల్లో చెరుకు పంట, డ్రిప్ సామగ్రి దగ్ధం కావడంతో సుమారు రూ.5 లక్షల మేర నష్టం సంభవించిందని బాధితులు వాపోయారు. అలాగే డీసీపల్లి, మర్రిపాడు గ్రామాల్లో అధికంగా నష్టం వాటిల్లింది. విద్యుత్ తీగలు ఎక్కడిక్కడ తెగి పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వర్షంతోపాటు వడగళ్లు కూడా పడ్డాయి. గాలుల దాటికి బ్యారెన్ల పైకప్పులు లేచిపోవడంతో బ్యారెన్లలో ఉన్న పొగాకు తడిచిపోయింది.
చేజర్లలో భారీ వర్షం
చేజర్ల : మండలంలోని చేజర్ల, మడపల్లి, బోడిపాడు తిమ్మాయపాళెం, ఉలవపల్లి, చిత్తలూరు తదితర ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. కోతకు వచ్చిన పంట నేలవాలింది. అకస్మాత్తుగా కురిసిన వర్షానికి కల్లాల్లో ఉన్న ధాన్యం తడిచిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. బోడిపాడు, మడపల్లి ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి.