దిలావర్‌పూర్(నిర్మల్) : ఇటీవల కురిసిన వడగళ్ల వానకు పంటలు దెబ్బతినగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటామని రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని గుండంపల్లి, సముందర్‌పల్లి, కాండ్లి గ్రామాల్లో దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత సోమవారం కురిసిన వడగళ్లవానతో జిల్లాలో అనేక ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయన్నారు. బాధిత రైతాంగానికి పరిహారం అందించనున్నట్లు తెలిపారు. అధికారులు దెబ్బతిన్న పంటలు పరిశీలిస్తున్నారని, రైతులు ఆందోళన చెందవద్దన్నారు. ఏడీఏ కోటేశ్వరరావు, ఏవో స్రవంతి జరిగిన నష్టాన్ని మంత్రికి వివరించారు. అలాగే సముందర్‌పల్లి అనుంబంధ గ్రామమైన కాండ్లీలో జరిగిన ఓ పేద యువతి వివాహానికి మంత్రి హాజరయ్యారు. నూతన వధూవరులు ఈశ్వరి–రాందాస్‌లను ఆశీర్వదించారు. పేదింటి యువతులకు కల్యాణలక్ష్మి ఓ వరమన్నారు. నిర్మల్ ఏఎంసీ చైర్మన్ కె.దేవేందర్‌రెడ్డి, ఆర్డీవో ప్రసూనాంబా, తహసీల్దార్ నర్సయ్య, ఎఫ్‌ఎస్‌సీఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల కన్వీనర్ కోడె రాజేశ్వర్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి, ఎఫ్‌ఎస్‌సీఎస్ మాజీ చైర్మన్ శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్ ధనె నర్సయ్య, అడెల్లి దేవస్థాన కమిటీ డైరెక్టర్ ధనె రవి తదితరులున్నారు.
దెబ్బతిన్న పంటలు పరిశీలించిన కలెక్టర్
భైంసా(ముథోల్) : మండలంలోని హజ్గుల్, దేగాం, ఇలేగాం గ్రామాల్లో ఇటీవల కురిసిన వడగళ్ల వానకు దెబ్బతిన్న మొక్కజొన్న, జొన్న, శనగ తదితర పంటలను ఆదివారం కలెక్టర్ ప్రశాంతి పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి పంటనష్టం వివరాలు తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. బాధిత రైతులకు పరిహారం అందేలా చూస్తామన్నారు. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రాథమిక స్థాయిలో నివేదిక ప్రభుత్వానికి అందించామన్నారు. త్వరలోనే పూర్తి స్థాయి వివరాలతో నివేదిక పంపి పరిహారం అందేలా చూస్తామన్నారు. ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి మాట్లాడుతూ.. బాధిత రైతులకు పూర్తిస్థాయిలో పరిహారం ఇప్పించాలన్నారు. వడగళ్లతో భైంసా డివిజన్‌లో ఇళ్లు కూలిపోయాయని, విద్యుత్ స్తంభాలు విరిగి ప్రమాదాలు జరిగాయన్నారు. బాధితులను ఆదుకోవాలన్నారు. బాసర మండలం బిద్రెల్లిలో గొర్రెల కాపరి ఈరన్న మృతి చెందాడని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. వడగళ్ల వర్షంతో కలిగిన నష్టాన్ని ఇదివరకే సీఎం కేసీఆర్, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి వివరించానని ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment