Crop destroyed
-
టమాట ధర ఢమాల్ : 7500 కిలోల టమాటాను తగులబెట్టిన రైతు
నిన్నటి దాకా సెంచరీ దాటేసి మంట మండించిన టమాటా ధర ఒక్కసారిగా పడిపోయింది. 50 రూపాయలకు 5 కిలోల చొప్పున విక్రయిస్తున్నా డిమాండ్ లేని పరిస్థితి. ఈనేపథ్యంలో టమాట దిగుబడి బాగా వచ్చినా మార్కెట్లో సరియైన ధర లభించక పంటను తగుల బెట్టుకుంటున్నాడు రైతన్న.శివ్వంపేట(నర్సాపూర్): టమాటాకు మార్కెట్లో ధర లేకపోవడంతో ఒక రైతు పంటను తగులబెట్టాడు. మండల పరిధి నవాబుపేట గ్రామానికి చెందిన రవిగౌడ్ నాలుగు ఎకరాల్లో టమాటా పంటను సాగు చేస్తున్నాడు. ప్రస్తు తం పొలం నుంచి పంటను సేకరించి మార్కె ట్‌కు తరలిస్తే.. ఒక్కొక్క బాక్స్‌కు రూ.50 మించి ధర రావడం లేదు. రవాణాకు ఒక్కో బాక్స్‌కు రూ.30 పోగా రూ.20 వస్తున్నాయని, కూలీల డబ్బులు సైతం చేతికి అందడం లేదని రైతు వాపోయాడు. దీంతో గురువారం రెండు ఎకరాల్లోని 7500 కిలోల టమాటా పంటను తొలగించి తగులబెట్టాడు. ఇదే గ్రామంలో 25 మంది రైతులు సుమారు 60 నుంచి 70 ఎకరాల్లో పంట సాగు చేస్తున్నారు. గిట్టుబాటు ధర లేకపోవడంతో వీరంతా తీవ్రంగా నష్టపోవలసిన పరిస్థితి నెలకొంది. -
66 హెక్టార్లలోనే నష్టమంట!
పెథాయ్... జిల్లాలో ఈ తుఫాన్ రైతాంగం నడ్డివిరిచింది. పంట కోతకోసి పొలాల్లోనే కుప్పలుండగా భారీ వర్షాలు కురిశాయి. ఎంతగా రక్షించుకుందామన్నా... కిందనుంచి నీరు చేరింది. చివరకు జిల్లాలో 74వేల హెక్టార్లకు పైబడి పంట కుప్పల్లోకి నీరుచేరినట్టు ప్రాథమికంగా నిర్థారణైంది. కానీ ఇంతలో ఏమైందో ఏమో... దానిని పరిగణనలోకి తీసుకోలేదు. పైగా 74వేల హెక్టార్లలో నష్టపోయిన ఇతర పంటల్ని 66వేలకు కుదించేశారు. దీనివల్ల ఎవరు నష్టపోవాలో ఏమో.. విజయనగరం ఫోర్ట్: కష్టాల్లో ఉన్న రైతులను అన్ని విధిలా ఆదుకుంటామని చెప్పే పాలకులు చేతల్లో దానిని ఆచరించడం లేదు. రైతుకు అందించే సాయం విషయంలోనే ఎంతో కొంత కోత విధించే యోచనతో ప్రస్తుత సర్కారున్నట్టు అర్థమవుతోంది. పె«థాయ్ తుఫాన్‌వల్ల జరిగిన పంట నష్టం అంచనా విషయంలో ఈ ఆరోపణలు రుజువవుతున్నాయి. పంట నష్టం జరిగినదానికీ, అధికారులు లెక్కల్లో చూపుతున్నదానికీ ఎక్కడా పొంతన కుదరడం లేదు. దీనిని బట్టి రైతులపై ఈ సర్కార్‌కు ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో స్పష్టమవుతోంది. జిల్లాలో కొద్ది రోజుల క్రితం సంభవించిన పెథాయ్ తుఫాన్ కారణంగా జిల్లాలో వివిధ పం టలకు పెద్ద సంఖ్యలో నష్టం వాటిల్లింది. అయితే పంట ప్రాధమిక అంచనాలో అధికారులు గుర్తించి న నష్టం విస్తీర్ణం తుది నివేదిక సమయానికి తగ్గి పోవడమే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఇంతలో ఎంత వ్యత్యాసం తుఫాన్ సమయంలో మొక్కజొన్న 520 హెక్టార్లలో నష్టం వాటిల్లినట్టు అంచనా వేశారు. తాజా తుది నివేదికలో 64 హెక్టార్లలో మాత్రమే మొక్కజొన్నకు నష్టం వాటిల్లినట్టు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. చెరుకు పంట 12 హెక్టార్ల వరకు నష్టం జరిగినట్టు ప్రాధమికంగా అంచనా వేసి, తుది నివేదికలో 1.4 హెక్టార్లుగానే పేర్కొన్నారు. పరిగణనలో లేని వరి పంట నష్టం వేలాది హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లింది. కోతకోసం పొలాల్లోనే కుప్పలు వేయగా వాటికిందకు భారీగా నీరు చేరింది. దీనివల్ల ధాన్యం రంగు మారడమే గాకుండా... కొంతవరకూ కుప్పలు కుళ్లి ఎందుకూ పనికిరాకుండా పోయాయి. కా నీ దానిని అధికారులు పరిగణనలోకి తీసుకోలే దు. తుఫాన్ కారణంగా జిల్లాలో పనలపై ఉన్న వరి పంట 14,788 హెక్టార్లలో నీట మునిగింది. కుప్పల రూపంలో 59,150 హెక్టార్లలో నీటమునిగింది. పంట నీటమునగడం వల్ల ధాన్యం రంగు మారి నష్టపోయామని రైతులు గగ్గోలు పెడుతున్నారు. కానీ వరి పంటకు సంబంధించి పంట నష్టం జరిగినట్టు పరిగణనలోకి తీసుకోలేదు. వరి పంటకు నష్టం వాటిల్లినప్పటికీ రైతులకు పరిహారం అందే అవకాశం లేదు. రూ. కోట్టలో నష్టం జరిగితే రూ. లక్షల్లో పరిహారం పెథాయ్ తుఫాన్ వల్ల వరి పంటకు 74,438 హెక్టార్లులో నష్టం వాటిల్లింది. దీని విలువ సుమారు రూ.10 కోట్ల వరకు ఉంటుంది. మొక్కజొన్నకు 520 హెక్టార్లలో నష్టం వాటిల్లగా, దాని విలువ రూ.65 లక్షల వరకు ఉంటుంది. చెరుకు పంట 12 హెక్టార్లలో నష్టం వాటిల్లగా, దాని విలువ రూ. 2లక్షలు వరకు ఉంటుంది. కాని పరిహారం కోసం వ్యవసాయ అధికారులు మొక్కజొన్న, చెరుకు పంటలకు సంబంధించి 66.3 హెక్టార్లలో నష్టం జరిగినట్టు గుర్తించారు. దీనికి రూ.8.18 లక్షలు మాత్రమే పరిహారానికి వ్యవసాయ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. కోసిన పంట పరిగణనలోకి రాదు వరి పంట కోసిన తర్వాత పంట నష్టం అంచనాలోకి పరిగణలోనికి తీసుకోం. రంగు మారి న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సిఫార్సు చేస్తాం. – జి.ఎస్.ఎన్.లీలావతి, వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ వ్యవసాయ అధికారులు గుర్తించిన పంట నష్టం వివరాలు (హెక్టార్లలో) మండలం పంట నష్టం గుర్ల మొక్కజొన్న 1.4 పూసపాటిరేగ మొక్కజొన్న 48 చీపురుపల్లి మొక్కజొన్న 15.5 చీపురుపల్లి చెరకు 1.4 వర్షపు నీటిలో వరి చేను కుప్పలు(ఫైల్) -
ఉరుములు.. మెరుపులు
సిరిసిల్ల : రైతు గుండెలో ఉరుములు. మెరుపులు మెరిశాయి. ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా కురిసిన రాళ్లవాన అన్నదాతను తీవ్రంగా దిగాలు పర్చింది. ముస్తాబాద్, తంగళ్లపల్లి మండలాల్లో ఉరుములతో కూడిన జోరువాన పడింది. అక్కడక్కడ రాళ్లు పడ్డాయి. సిరిసిల్ల పట్టణంలోనూ మేఘావృతమై చిన్నపాటి వర్షం కురిసింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం వరి పొట్టదశలో ఉండగా.. పక్షంరోజుల్లో పంట చేతికందుతుంది. ఈదశలో చెడగొట్టువానలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. రాళ్ల వానలు పడితే పొలాలు పూర్తిగా దెబ్బతిని పంట చేతికి రాదు. పొట్టదశలో ఉన్న పంటుల, నీరుతాగే దశలో ఉన్న పంట రాళ్ల దెబ్బలకు పాడయ్యే ప్రమాదం ఉంది. మామిడి రైతులకువడగండ్లు, ఈదురుగాలుల భయం పట్టింది. ఏడాదికి ఒక్కసారే వచ్చే మామిడి కాయలు ఈదురు గాలులతో నేలరాలుతాయనే భయంలో ఉన్నారు. ఆరుగాలం శ్రమించిన అన్నదాతలను అకాల వర్షాలు వణికిస్తున్నాయి. ఆదివారం పగలు రాళ్లవానతో, ఉరుములతో అదరగొట్టిన వరుణుడు సాయంత్రానికి చల్లబడ్డాడు. మళ్లీ వాతావరణంలో మార్పు వచ్చింది. రైతులకు చెడగొట్టు వానల భయం పట్టుకుంది. శనివారం సాయంత్రం బోయినపల్లి, ఇల్లంతకుంట తదితర మండలాల్లో కురిసిన వడగండ్ల వానతో వందలాది ఎకరాల్లో వరి దెబ్బతిన్నదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా మామడితోటలూ ధ్వంసమయ్యాయని, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే పంట నష్టం అంచనా వేయొచ్చని అంటున్నారు. బోయినపల్లిలో 125 హెక్టార్లలో దెబ్బతిన్న వరి బోయినపల్లి(చొప్పదండి): మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందాన ఉంది మండలంలోని రైతుల పరిస్థితి. ఒకవైపు సాగు నీరులేక వేల ఎకరాల్లో వరి పంట ఎండిపోయే దశకు చేరుకుంది. దీనికితోడు శనివారం కురిసిన వడగళ్ల వానతో వందల ఎకరాల్లో పంట దెబ్బతింది. సుమారు 125 హెక్టార్లలో పంట దెబ్బ తిన్నదని వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. కొదురుపాకలో మొక్కజొన్న నేలవాలింది. విలాసాగర్, నర్సింగాపూర్, జగ్గారావుపల్లి, తడగొండ గ్రామాల్లో వడగళ్ల ధాటికి పొట్టదశలో ఉన్న వరి పైరు వంగి పోయింది. ఆదివారం విలాసాగర్, కొదురుపాక, నర్సింగాపూర్, జగ్గారావుపల్లి, వరదవెల్లి గ్రామాల్లో ఎంపీపీ సత్తినేని మాధవ్, జెడ్పీటీసీ కొనుకటి లచ్చిరెడ్డి, ఏఈ వంశీకృష్ణతో కలిసి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అన్ని గ్రామాల్లో వ్యవసాయ అధికారులు సర్వే చేసి పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. అకాల వర్షంతో ఆపార నష్టం ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల) : వెంకటాపూర్, పదిర, హరిదాసునగర్, దుమాల, అక్కపల్లి, అల్మాస్పూర్, పోతిరెడ్డిపల్లి గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన రాళ్లవాన కురిసింది. పెద్దసైజు మంచురాళ్లతో వర్షం పడడంతో మామిడికాయలు రాలిపోయాయి. వరిపంట దెబ్బతింది. ఈసారి మామిడి కాయలు విరబుయ్యగా ఆకాల వర్షం దెబ్బతీయడంతో రైతులు ఆవేదకు లోనయ్యారు అక్కపల్లిలో పెద్దసైజులో ఉన్నరాళ్లతో మూడుగంటలపాటు ఏకధాటిగా కురవడంతో జనం బయటకు రాకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. రహదారుపై చెట్లు కూలిపడ్డాయి. అక్కపల్లి, పోతిరెడ్డిపల్లిలో రెండు ఇళ్లపై రేకులు లేచిపోయాయి. ముస్తాబాద్(సిరిసిల్ల) : మోహినికుంట, పోత్గల్, బందనకల్, తెర్లుమద్ది గ్రామాల్లో వడగండ్ల వానతో మామిడితోటలు ధ్వంసమయ్యాయి. సుమారు 45 ఎకరాల్లోని మామిడితోటలకు నష్టం జరిగిందని రైతులు తెలిపారు. గూడెం, పోత్గల్, ముస్తాబాద్‌లో కురిసిన వడగండ్లకు వరి పంట దెబ్బతింది. భూగర్భ జలాలు అడుగంటిన సమయంలో ఎంతోశ్రమకోర్చి వరి పంటను కాపాడుకున్న రైతన్న.. పంట చివరి దశకు చేరగా వడగండలకు దెబ్బతినడంతో కకావికలమయ్యాడు. దబ్బెడ నారాయణ, రాజయ్య, బండి ప్రశాంత్, గూడెం గ్రామంలో యాద భూమలింగం, బట్టు దేవయ్య, మల్లేశం, తిరుపతి, బాలయ్య, రాములు, లక్ష్మణ్‌కు చెందిన వరిపంట దెబ్బతింది. పోత్గల్‌లో స్వర్ణకారుడు సజ్జనం పురుషోత్తం రేకుల షెడ్డు ఈదురుగాలుల ధాటికి ధ్వంసమైంది. ఆయన కుటుంబం వీధిన పడింది. కోనరావుపేట : వెంకట్రావుపేట, మామిడిపల్లి, కోనరావుపేట, కనగర్తి, నిజామాబాద్ తదితర గ్రామాల్లో ఆదివారం సాయంత్రం వడగళ్లవాన కురిసింది. వందల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. కోనరావుపేటకు చెందిన గంగసాని రాజు మామిడితోట ధ్వంసమైంది. పంటలు నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. -
బాధిత రైతాంగాన్ని ఆదుకుంటాం
దిలావర్పూర్(నిర్మల్) : ఇటీవల కురిసిన వడగళ్ల వానకు పంటలు దెబ్బతినగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటామని రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని గుండంపల్లి, సముందర్‌పల్లి, కాండ్లి గ్రామాల్లో దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత సోమవారం కురిసిన వడగళ్లవానతో జిల్లాలో అనేక ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయన్నారు. బాధిత రైతాంగానికి పరిహారం అందించనున్నట్లు తెలిపారు. అధికారులు దెబ్బతిన్న పంటలు పరిశీలిస్తున్నారని, రైతులు ఆందోళన చెందవద్దన్నారు. ఏడీఏ కోటేశ్వరరావు, ఏవో స్రవంతి జరిగిన నష్టాన్ని మంత్రికి వివరించారు. అలాగే సముందర్‌పల్లి అనుంబంధ గ్రామమైన కాండ్లీలో జరిగిన ఓ పేద యువతి వివాహానికి మంత్రి హాజరయ్యారు. నూతన వధూవరులు ఈశ్వరి–రాందాస్‌లను ఆశీర్వదించారు. పేదింటి యువతులకు కల్యాణలక్ష్మి ఓ వరమన్నారు. నిర్మల్ ఏఎంసీ చైర్మన్ కె.దేవేందర్‌రెడ్డి, ఆర్డీవో ప్రసూనాంబా, తహసీల్దార్ నర్సయ్య, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ కోడె రాజేశ్వర్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి, ఎఫ్ఎస్సీఎస్ మాజీ చైర్మన్ శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్ ధనె నర్సయ్య, అడెల్లి దేవస్థాన కమిటీ డైరెక్టర్ ధనె రవి తదితరులున్నారు. దెబ్బతిన్న పంటలు పరిశీలించిన కలెక్టర్ భైంసా(ముథోల్) : మండలంలోని హజ్గుల్, దేగాం, ఇలేగాం గ్రామాల్లో ఇటీవల కురిసిన వడగళ్ల వానకు దెబ్బతిన్న మొక్కజొన్న, జొన్న, శనగ తదితర పంటలను ఆదివారం కలెక్టర్ ప్రశాంతి పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి పంటనష్టం వివరాలు తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. బాధిత రైతులకు పరిహారం అందేలా చూస్తామన్నారు. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రాథమిక స్థాయిలో నివేదిక ప్రభుత్వానికి అందించామన్నారు. త్వరలోనే పూర్తి స్థాయి వివరాలతో నివేదిక పంపి పరిహారం అందేలా చూస్తామన్నారు. ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి మాట్లాడుతూ.. బాధిత రైతులకు పూర్తిస్థాయిలో పరిహారం ఇప్పించాలన్నారు. వడగళ్లతో భైంసా డివిజన్లో ఇళ్లు కూలిపోయాయని, విద్యుత్ స్తంభాలు విరిగి ప్రమాదాలు జరిగాయన్నారు. బాధితులను ఆదుకోవాలన్నారు. బాసర మండలం బిద్రెల్లిలో గొర్రెల కాపరి ఈరన్న మృతి చెందాడని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. వడగళ్ల వర్షంతో కలిగిన నష్టాన్ని ఇదివరకే సీఎం కేసీఆర్, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి వివరించానని ఎమ్మెల్యే తెలిపారు. -
అకాల వర్షం.. రబీ పంటలకు నష్టం
బజార్హత్నూర్(బోథ్) : జిల్లాలో మూడు రోజు లుగా రాత్రి సమయాల్లో కురుస్తున్న రాళ్ల వర్షానికి రబీ పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పటికే 40 శాతం శనగ పంటను కోసం మెదలుగా చేనులో ఆరబెట్టారు. ఉరుములు, మెరుపులతో గాలి బీ భత్సం, రాళ్ల వర్షంతో మెదల్లు కొట్టుకుపోవడం, తడిసిపోవడం జరిగింది. గింజలు నల్లబారి మెలకెత్తుతున్నాయి. మిగతా 60 శాతం పంట కోత దశలో ఉండడంతో రాళ్ల వర్షానికి నేలరాలాయి. గింజ నాణ్యత కోల్పోతే గిట్టుబా టు ధరలు రాక మళ్లీ నష్టపోయే పరిస్థితి వ స్తుం దని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోథ్, బజార్హత్నూర్, నేరడిగొండ, ఇచ్చోడ, గుడిహత్నూర్, తాంసి, తలమడుగు, భీంపూర్, సిరికొం డ మండలాల్లో 86 వేల ఎకరాల్లో రబీలో శనగ, కంది, మొక్కజొన్న, జొన్న, ధనియాలు, పెసరి, మినుము, గోధమ పంటలు సాగు చేశారు. శనగ పంట దెబ్బతింది.. నాకున్న ఆరెకరాల్లో నాలుగెకరాలు శనగ, రెండెకరాల్లో కంది పంట వేసాను. శనగ పంట కోత దశలో ఉండడంతో రూ.4వేలు ఖర్చు చేసి కూలీలతో మెదల్లు వేసి ఆరబెట్టాను. మూడు రోజులుగా అకాల వర్షానికి మెదల్లు తడవడంతో ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. నాలుగెకరాల శనగ పంట దెబ్బతింది. గింజరంగు మారేపరిస్థితి ఉంది. ప్రభుత్వం ఆదుకోవాలి. – రైతు డుబ్బుల ముత్తన్నయాదవ్, బజార్హత్నూర్ ప్రభుత్వం ఆదుకోవాలి మండలంలో శనగ, కంది, మొక్కజొన్న, జొన్న, ధనియాలు, పెసరి, మినుము, గోధుమ పంటలు సాగు చేశారు. మూడు రోజులుగా రాళ్ల వర్షానికి పంటలకు నష్టం వాటిల్లుతోంది. గింజలు మొలకెత్తి, రంగుమారి నాణ్యత కోల్పోతున్నాయి. పంట దిగుబడిలో దెబ్బతినే పరిస్థితి ఉంది. ప్రభుత్వమే ఆదుకోవాలి. రబీ పంటలకు గింజ నాణ్యతతో సంబంధం లేకుండా గిట్టుబాటు ధరలు కల్పించాలి. – రైతు కొడిమెల కాశీరాం, దేగామ -
2లక్షల ఎకరాల్లో పంట నష్టం
మరిపెడలో 8.2 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు హైదరాబాద్: అకాల వర్షం 2 లక్షల ఎకరాల పంటను నాశనం చేసింది. గత వారం రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు రైతన్న కుదేలయ్యాడు. వడగళ్లతో అనేకచోట్ల పంట ధ్వంసమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మండలాల్లోని 889 గ్రామాల్లో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రకటించారు. 1.09 లక్షల ఎకరాల్లో వరి, మొక్కజొన్న, సజ్జ, నువ్వులు, జొన్న పంటలకు నష్టం వాటిల్లగా, సుమారు 91వేల ఎకరాల్లో పండ్లతోటలు, ఇతర పంటలకు నష్టం జరిగింది. ఆయా జిల్లాల్లో వ్యవసాయ, రెవెన్యూ యంత్రాంగాలు పంటనష్టాన్ని పూర్తిస్థాయిలో అంచనావేసే పనిలో ఉన్నాయి. వరి, మామిడికే అధిక నష్టం: అకాల వర్షాల కారణంగా ఆహార పంటల్లో వరి, ఉద్యాన పంటల్లో మామిడికే తీవ్రమైన నష్టం వాటిల్లింది. వరికి 74,382 ఎకరాల్లో, మామిడికి 73,236 ఎకరాల్లో నష్టం జరిగింది. అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 38,507 ఎకరాల్లో, నల్లగొండ జిల్లాలో 33,207 ఎకరాల్లో నష్టం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో 19,227 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఉద్యాన పంట ల్లోనూ కరీంనగర్ జిల్లానే అధికంగా నష్టపోయింది. అక్కడ అన్ని ఉద్యాన పంటలు కలిపి 53,859 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. వరంగల్ జిల్లాలో 8,455 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. ఆదిలాబాద్ జిల్లాలో 6,411 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. మరో ఐదు రోజులు తేలికపాటి వర్షాలు మరో ఐదు రోజులపాటు తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ఇన్చార్జి డెరైక్టర్ సీతారాం ‘సాక్షి’కి చెప్పారు. అయితే వడగళ్ల వానలు ఉండబోవని ఆయన పేర్కొన్నారు. గత 24 గంటల్లో వరంగల్ జిల్లా మరిపెడలో అత్యధికంగా 8.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.