ముస్తాబాద్‌లో కురిసిన వడగండ్లు
సిరిసిల్ల : రైతు గుండెలో ఉరుములు. మెరుపులు మెరిశాయి. ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా కురిసిన రాళ్లవాన అన్నదాతను తీవ్రంగా దిగాలు పర్చింది. ముస్తాబాద్, తంగళ్లపల్లి మండలాల్లో ఉరుములతో కూడిన జోరువాన పడింది. అక్కడక్కడ రాళ్లు పడ్డాయి. సిరిసిల్ల పట్టణంలోనూ మేఘావృతమై చిన్నపాటి వర్షం కురిసింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం వరి పొట్టదశలో ఉండగా.. పక్షంరోజుల్లో పంట చేతికందుతుంది. ఈదశలో చెడగొట్టువానలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. రాళ్ల వానలు పడితే పొలాలు పూర్తిగా దెబ్బతిని పంట చేతికి రాదు. పొట్టదశలో ఉన్న పంటుల, నీరుతాగే దశలో ఉన్న పంట రాళ్ల దెబ్బలకు పాడయ్యే ప్రమాదం ఉంది. మామిడి రైతులకువడగండ్లు, ఈదురుగాలుల భయం పట్టింది. ఏడాదికి ఒక్కసారే వచ్చే మామిడి కాయలు ఈదురు గాలులతో నేలరాలుతాయనే భయంలో ఉన్నారు. ఆరుగాలం శ్రమించిన అన్నదాతలను అకాల వర్షాలు వణికిస్తున్నాయి. ఆదివారం పగలు రాళ్లవానతో, ఉరుములతో అదరగొట్టిన వరుణుడు సాయంత్రానికి చల్లబడ్డాడు. మళ్లీ వాతావరణంలో మార్పు వచ్చింది. రైతులకు చెడగొట్టు వానల భయం పట్టుకుంది. శనివారం సాయంత్రం బోయినపల్లి, ఇల్లంతకుంట తదితర మండలాల్లో కురిసిన వడగండ్ల వానతో వందలాది ఎకరాల్లో వరి దెబ్బతిన్నదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా మామడితోటలూ ధ్వంసమయ్యాయని, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే పంట నష్టం అంచనా వేయొచ్చని అంటున్నారు.
బోయినపల్లిలో 125 హెక్టార్లలో దెబ్బతిన్న వరి
బోయినపల్లి(చొప్పదండి): మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందాన ఉంది మండలంలోని రైతుల పరిస్థితి. ఒకవైపు సాగు నీరులేక వేల ఎకరాల్లో వరి పంట ఎండిపోయే దశకు చేరుకుంది. దీనికితోడు శనివారం కురిసిన వడగళ్ల వానతో వందల ఎకరాల్లో పంట దెబ్బతింది. సుమారు 125 హెక్టార్లలో పంట దెబ్బ తిన్నదని వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. కొదురుపాకలో మొక్కజొన్న నేలవాలింది. విలాసాగర్, నర్సింగాపూర్, జగ్గారావుపల్లి, తడగొండ గ్రామాల్లో వడగళ్ల ధాటికి పొట్టదశలో ఉన్న వరి పైరు వంగి పోయింది. ఆదివారం విలాసాగర్, కొదురుపాక, నర్సింగాపూర్, జగ్గారావుపల్లి, వరదవెల్లి గ్రామాల్లో ఎంపీపీ సత్తినేని మాధవ్, జెడ్పీటీసీ కొనుకటి లచ్చిరెడ్డి, ఏఈ వంశీకృష్ణతో కలిసి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అన్ని గ్రామాల్లో వ్యవసాయ అధికారులు సర్వే చేసి పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.
అకాల వర్షంతో ఆపార నష్టం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల) : వెంకటాపూర్, పదిర, హరిదాసునగర్, దుమాల, అక్కపల్లి, అల్మాస్‌పూర్, పోతిరెడ్డిపల్లి గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన రాళ్లవాన కురిసింది. పెద్దసైజు మంచురాళ్లతో వర్షం పడడంతో మామిడికాయలు రాలిపోయాయి. వరిపంట దెబ్బతింది. ఈసారి మామిడి కాయలు విరబుయ్యగా ఆకాల వర్షం దెబ్బతీయడంతో రైతులు ఆవేదకు లోనయ్యారు అక్కపల్లిలో పెద్దసైజులో ఉన్నరాళ్లతో మూడుగంటలపాటు ఏకధాటిగా కురవడంతో జనం బయటకు రాకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. రహదారుపై చెట్లు కూలిపడ్డాయి. అక్కపల్లి, పోతిరెడ్డిపల్లిలో రెండు ఇళ్లపై రేకులు లేచిపోయాయి.
ముస్తాబాద్(సిరిసిల్ల) : మోహినికుంట, పోత్గల్, బందనకల్, తెర్లుమద్ది గ్రామాల్లో వడగండ్ల వానతో మామిడితోటలు ధ్వంసమయ్యాయి. సుమారు 45 ఎకరాల్లోని మామిడితోటలకు నష్టం జరిగిందని రైతులు తెలిపారు. గూడెం, పోత్గల్, ముస్తాబాద్‌లో కురిసిన వడగండ్లకు వరి పంట దెబ్బతింది. భూగర్భ జలాలు అడుగంటిన సమయంలో ఎంతోశ్రమకోర్చి వరి పంటను కాపాడుకున్న రైతన్న.. పంట చివరి దశకు చేరగా వడగండలకు దెబ్బతినడంతో కకావికలమయ్యాడు. దబ్బెడ నారాయణ, రాజయ్య, బండి ప్రశాంత్, గూడెం గ్రామంలో యాద భూమలింగం, బట్టు దేవయ్య, మల్లేశం, తిరుపతి, బాలయ్య, రాములు, లక్ష్మణ్‌కు చెందిన వరిపంట దెబ్బతింది. పోత్గల్‌లో స్వర్ణకారుడు సజ్జనం పురుషోత్తం రేకుల షెడ్డు ఈదురుగాలుల ధాటికి ధ్వంసమైంది. ఆయన కుటుంబం వీధిన పడింది.
కోనరావుపేట : వెంకట్రావుపేట, మామిడిపల్లి, కోనరావుపేట, కనగర్తి, నిజామాబాద్ తదితర గ్రామాల్లో ఆదివారం సాయంత్రం వడగళ్లవాన కురిసింది. వందల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. కోనరావుపేటకు చెందిన గంగసాని రాజు మామిడితోట ధ్వంసమైంది. పంటలు నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment