నేలరాలిన ఆశలు
► అన్నదాతకు కడగండ్లు మిగిల్చిన వడగండ్లు
► అకాల వర్షంతో పండ్ల తోటలకు అపార నష్టం
► చేతికొచ్చే దశలో నేలపాలైన పంటలు
► ప్రభుత్వం ఆదుకోవాలంటున్న రైతులు
ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ నెలల తరబడి కాపాడుకుంటూ వస్తున్న పంట గంటలో నేలపాలైంది. అసలే అప్పుల ఊబిలో ఉన్న అన్నదాతల్ని అకాలవర్షం మరింత నష్టాలపాల్జేసింది. పంట చేతికొచ్చే దశలో శుక్ర, శనివారాల్లో కురిసిన వాన రైతుకు కడగండ్లు మిగిల్చింది. జొన్న, నువ్వులు, వరి, మినుము పంటలు దెబ్బతిన్నాయి. మామిడి, నిమ్మ, మిర్చి తోటల్లో కాయలు నేలరాలాయి. వడగండ్ల ధాటికి కోతదశలో ఉన్న పుచ్చ కాయలు పగిలిపోయాయి. ఊహించని పరిణామంతో దిక్కుతోచని రైతులు ప్రభుత్వమే తమకు సాయం చేసి ఆదుకోవాలని విన్నవిస్తున్నారు.
పామూరు/మార్టూరు: పర్చూరు నియోజకవర్గంలో శనివారం మధ్యాహ్నం కురిసిన అకాల వర్షం పండ్ల తోటలకు తీవ్ర నష్టం చేకూర్చింది. మార్టూరు మండలం బబ్బేపల్లి, ద్రోణాదుల గ్రామాల్లో వడగండ్ల వాన కురిసింది. మామిడి, బొప్పాయి, అరటి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మార్టూరు మండలం బొబ్బేపల్లిలో గేదెలు మేపేందుకు వెళ్లిన మహిళ, ఇంకొల్లులో పొలం పనికి వెళ్లిన రైతు పిడుగుపాటుకు మృతి చెందారు. కోలలపూడి గ్రామంలో 200 ఎకరాల్లో ఎకరాల్లో మామిడి తోటలు సాగులో ఉన్నాయి. పంట చేతికొచ్చే సమయంలో గాలి, వాన బీభత్సానికి పిందెలతో సహా కాయలు రాలిపడ్డాయి. బొప్పాయి, మునగ చెట్లు నేలవాలాయి.
పామూరు మండలంలో..: పామూరు మండలంలోని బొట్లగూడూరు, బలిజపాలెం, మీరాపురం, తూర్పు కట్టకిందపల్లె, మోపాడు కొండారెడ్డిపల్లె, తూమాటివారిపాలెం గ్రామాలతోపాటు మోపాడు రిజర్వాయర్ ప్రాంతంలోని సాగుభూముల్లో శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య వడగండ్ల వర్షం కురిసింది. దీంతో నిమ్మ, పుచ్చ, మిరప, జొన్న, నువ్వులు, వరి, మినుము పంటలు దిబ్బతినగా సుమారు రూ.4.70 కోట్ల నష్టం వాటిల్లింది. ఎక్కువగా బొట్లగూడూరు ప్రాంతంలో జొన్న, మిర్చి, బలిజపాలెం, తూమాటివారిపాలెం గ్రామాల పరిధిలో సన్ననిమ్మ, పుచ్చ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రెండు మూడు రోజుల్లో కోయనున్న పుచ్చ, మరో వారం పది రోజుల్లో కోతలు పూర్తికానున్న జొన్న పైర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల కల్లాల్లో వడ్లు కూడా తడిసిపోయాయి.
పంట నష్టం పరిశీలన..: వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను గురువారం స్థానిక తహశీల్దార్ మెర్సీకుమారి, ఏడీఎ చల్లా సుబ్బరాయుడు, ఉద్యాన శాఖాధికారిణి ఎస్.దీప్తి, మోపాడు రిజర్వాయర్ చైర్మన్ ఎ.ప్రభాకర్‌చౌదరి పరిశీలించారు. నష్టం వివరాలు రైతులను అడిగి తెలుసుకున్నారు.
► బలిజపాలెం, తూమాటివారిపాలెం, బొట్లగూడూరు గ్రామాలలో సుమారు 55 మంది రైతులకు సంబంధించి 160 ఎకరాలలో నిమ్మతోటలు దెబ్బతినగా సుమారు రు.80 లక్షల నష్టం వాటిల్లింది.
► బొట్లగూడూరు, తూమాటివారిపాలెం, మీరాపురం గ్రామాల్లో 25 ఎకరాలలో పుచ్చపైరు దెబ్బతినగా రు.30 లక్షలమేర నష్టం వాటిల్లింది.
► బొట్లగూడూరు, తూమాటివారిపాలెం గ్రామాలలో 35 ఎకరాల్లో మిరప పంట దెబ్బతినగా రు. 40 లక్షల మేర నష్టం వాటిల్లింది.
► బొట్లగూడూరు, మోపాడు కొండారెడ్డిపల్లె గ్రామాల్లో 450 మంది రైతులకు సంబంధించి 1800 ఎకరాల్లో జొన్నపంట దెబ్బతింది. రు.3 కోట్లమేర నష్టం వాటిల్లింది.
► 50 ఎకరాల్లో దెబ్బతిన్న నువ్వు పంటకు రు.7 లక్షలు, వరిపంటకు రు.3.50 లక్షలు, పదెకరాల్లో మినుము పంటకు రు.లక్షమేర నష్టం వాటిల్లినట్టు అంచనా వేశామని వ్యవసాయ, ఉద్యానవన శాఖాధికారులు తెలిపారు.
చేతికొచ్చే పంట నేలపాలైంది: చేతికొచ్చిన మిర్చిపంట నేలపాలయింది. మిర్చికోసం ఎకరాకు రు.1.25 లక్షల దాకా పెట్టుబడి అయింది. ఈ ఏడాది దిగుబడి కూడా బాగానే ఉంది. పంట చేతికొచ్చే సమయంలో వడగండ్ల వాన నిలువునా ముంచింది. –కోటపాటి వెంకటేశ్వర్లు, మిర్చిరైతు(బొట్లగూడూరు)
జొన్న పూర్తిగా దెబ్బతింది..: బొట్లగూడూరు, మోపాడు రిజర్వాయర్ పరిధిలో దాదాపు రెండు వేల ఎకరాల్లో జొన్నపైరు పూర్తిగా పాడయిపోయింది. ఎకరాకు రు.7 వేల నుంచి 8 వేల దాకా కనీస పెట్టుబడి వచ్చింది. ఎకరాకు ప్రస్తుతం 12 క్వింటాళ్ల దాకా దిగుబడి వచ్చే అవకాశం ఉంది. క్వింటా ధర ప్రస్తుతం రు.2 వేల దాకా ఉంది. ప్రభుత్వం రైతులకు పంట నష్టం చెల్లించి ఆదుకోవాలి. – కోటపాటి మాలకొండరాయుడు, జొన్నరైతు (బొట్లగూడూరు)
ప్రభుత్వం ఆదుకోవాలి...: ఎకరాకు రు.35 వేల దాకా పెట్టుబడి పెట్టి పుచ్చ సాగుచేశా. ఎకరాకు 15 టన్నుల చొప్పున దిగుబడి వచ్చే అవకాశముంది. చేతికొచ్చిన పుచ్చ పంటను టన్ను రు.8 వేల వంతున అమ్మకానికి పెట్టాం. మరో రెండు రోజుల్లో వచ్చి కాయలు కోసుకుపోయేవారు ఇప్పటి దాకా కాపాడుకున్న పంట గంటలో నేలపాలైంది. ప్రభుత్వం ఆదుకోవాలి. –ఎర్రగొల్ల బాబు, పుచ్చరైతు (బలిజపాలెం)
జీవనాధారం కోల్పోయాం..: నిమ్మతోట, కూరగాయల పెంపకంతో జీవిస్తున్నాం. ఎకరా నిమ్మకు కనీసం రు.30 వేలదాకా పెట్టుబడి అయింది. అకాల వడగండ్లతో ఒక్కో చెట్టుకు రు.500 విలువ చేసే కాయలు పెద్దవి, పిందెలు రాలిపోవడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.
– మాటూరి మహాలక్ష్మణరావు, నిమ్మరైతు (బలిజపాలెం)