Top Working In Mango: Chittoor District Farmers Rejuvenation Of Old Mango Trees - Sakshi

పాత చెట్టులో కొత్త పండు.. ఔను ఇప్పుడు ఇదే ట్రెండ్‌!

Aug 24 2022 8:11 PM | Updated on Dec 8 2022 12:52 PM

Top Working in Mango: Chittoor District Farmers Rejuvenation of Old Mango Trees - Sakshi

పాత చెట్టులో కొత్త పండు ఏంటి అనుకుంటున్నారా? ఔను ఇప్పుడు ఇదే ట్రెండ్‌. ‘విత్తు ఏదేస్తే అదే చెట్టు వస్తుంది’ అనే సామెతకు కాలం చెల్లిపోయింది. ఇప్పుడు విత్తొకటి.. చెట్టొకటి... పండు ఇంకొకటి అనే స్థాయికి చేరిపోయింది నవీన వ్యవసాయం. కొన్నేళ్ల నాటి మామిడి చెట్లు కొత్త రకం పండ్లు ఎలా ఇస్తాయి? అనే సందేహాన్ని నివృత్తి చేస్తూ, కొమ్మ అంటు పద్ధతి ఇప్పుడు సత్ఫలితాలిస్తోంది. దీని ద్వారా పాత చెట్టు అయినప్పటికీ కొమ్మకొమ్మకో కొత్త వెరైటీ పండించుకోవచ్చు. ఇది సాధ్యమని నిరూపిస్తున్నారు చిత్తూరు జిల్లా రైతులు. ఆ టాప్‌ వర్కింగ్‌ విధానంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.  


పలమనేరు:
ఎప్పుడో మన తాతలు నాటిన అప్పటి రకం మామిడి చెట్టుకు అదే రకం కాయలు వస్తున్నాయనే చింత వద్దు. అదే పాత చెట్టులో మనకు కావాల్సిన కొత్త రకం మామిడి పండు వస్తుంది. మామిడి సాగులో ఇప్పుడు కొమ్మ అంటు(టాప్‌ వర్కింగ్‌) పద్ధతి ట్రెండింగ్‌గా మారింది. ఒక రకానికి చెందిన మామిడి చెట్టులో పలు రకాల మామిడికాయలను పండించవచ్చు. దీంతో ఈ కొమ్మ అంటు పద్ధతిపై జిల్లాలోని మామిడి రైతులు మక్కువ చూపుతున్నారు. నాటురకం చెట్లు, పాత తోటల్లో దిగుబడి తగ్గి నష్టాలతో సతమతమవుతున్న మామిడి రైతులకు ఇదో వరంలా మారింది. మోడు బారిన పాత మామిడి చెట్లలో ఈ విధానం ద్వారా మేలైన మామిడి రకాలను సృష్టిస్తూ ఆశాజనకమైన ఫలితాలను రాబట్టుకోవచ్చు. 


టాప్‌వర్కింగ్‌ ఎలా చేస్తారంటే.. 

జిల్లాలో ఎక్కువగా పల్ప్‌(గుజ్జు) కోసం తోతాపురి రకం మామిడి కొంటారు. దీన్ని జ్యూస్‌ ఫ్యాక్టరీలకు విక్రయించడం వల్ల గ్యారంటీ మార్కెటింగ్‌ ఉంటుంది. మరికొందరు రైతులు మార్కెట్‌లో మంచి ధర పలికే రకాలైన బేనిషా, ఖాదర్, బయ్యగానిపల్లి, మల్లిక లాంటి రకాలను టాప్‌వర్కింగ్‌ ద్వారా మార్పు చేసుకున్నారు. ఏటా టాప్‌ వర్కింగ్‌ జూలై, ఆగస్టు నెలల్లో జరుగుతూనే ఉంటుంది. పాతతోటల్లో చెట్లు రోగాలు సోకి దిగుబడులు లేకుండా ఉంటాయి. ఇలాంటి రైతులకు టాప్‌ వర్కింగ్, గ్రాఫ్టింగ్‌ లాంటి అంటు పద్ధతులు ప్రత్యామ్నాయంగా మారాయి.


వెరైటీ మార్చుకోవాలనుకునే రైతులు మంచి దిగుబడినిస్తున్న బేనిషా చెట్టును(మదర్‌ప్లాంట్‌) ఎంపికచేసుకోవాలి. తోటలోని అనవసరమైన రకాల చెట్టు కొమ్మలను 4 అడుగుల ఎత్తులో రంపంతో కోసేస్తారు. నెల రోజుల తర్వాత కట్‌ చేసిన కొమ్మలు చిగురిస్తాయి. వాటిల్లో దృడంగా ఉన్నవాటిని ఎంపిక చేసుకొని మిగిలినవాటిని తీసేయాలి. ఆ తర్వాత మనం ఎంపిక చేసుకున్న మదర్‌ ప్లాంట్‌ నుంచి చిగుర్లను కట్‌చేసి తడి గుడ్డలో జాగ్రత్తగా ఉంచి సిద్ధం చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న మామిడి చెట్లలో కట్‌ చేసిన చిగురు వద్ద సేకరించిన మేలు రకం చిగురును అంటు కట్టి ప్లాస్టిక్‌ ట్యాగ్‌ను చుట్టాలి.


చెట్టులో మనమేదైతే మొక్కలను అంటు కడతామో అవే చిగురిస్తాయి. ఆపై మనం అంటుగట్టిన కాయలు మొదటి సంవత్సరం కాకుండా రెండో ఏడాదినుంచి కోతకొస్తాయి. ఇలా 30 ఏళ్ల వయసున్న పాత మామిడితోటలను పరిశీలిస్తే ఎకరానికి సగటున 50 వృక్షాలుంటాయి. ఒక్కో చెట్టుకు 20 అంట్లు కట్టాల్సి ఉంటుంది. ఆ లెక్కన 1000 అంట్లు అవుతాయి. ఒక్కో అంటుకు రూ.5 లెక్కన రూ.5వేలు అవుతుంది.  


చిగురుదశలోనే అంటు కట్టాలి  

ఏటా జూలై, ఆగస్టులోనే టాప్‌ వర్కింగ్‌ చేసుకోవాలి. ఆపై మామిడి చిగురిస్తుంది. సెప్టెంబరు నెల వరకు అంటుకట్టేందుకు అనుకూలంగా ఉంటుంది. సీజన్‌లో తెలంగాణాలోని ఖమ్మం, మన రాష్ట్రంలోని కృష్ణా జిల్లాల నుంచి చేయి తిరిగిన అంటుకట్టే కూలీలు స్థానికంగా అందుబాటులో ఉంటారు. వారే తోటలవద్దకొచ్చి ఈ పనులు చేస్తుంటారు. ప్రస్తుతం జిల్లాలోని పలు ప్రాంతాల్లోని తోటల్లో టాప్‌వర్కింగ్‌ జోరుగా సాగుతోంది. (క్లిక్‌: బొప్పాయి ప్యాకింగ్‌.. వెరీ స్పెషల్‌!)


కొమ్మకో వెరైటీ 

టాప్‌ వర్కింగ్‌ పద్ధతిలో మనం కోరుకున్న రకాలను పెంచుకోవచ్చు. మోడు బారిన చెట్ల నుంచి నాణ్యమైన కాయలను ఉత్పత్తి చేసుకోవచ్చు. పాతతోటల స్థానంలో కాల వ్యవధి లేకుండా త్వరగా కొత్త పంట వస్తుంది. భారీగా పెరిగిన చెట్లు కట్‌ చేస్తే, చిన్నగా కోతలకు అనుకూలమవుతాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ధర కలిగిన రకాలను వాటిలో పండించుకోవచ్చు.కొమ్మకో వెరైటీ చొప్పున ఒకే చెట్టులో పది రకాలను పెంచవచ్చు.  
– డా.కోటేశ్వరావు, హార్టికల్చర్‌ ఏడీ, పలమనేరు


మంచి రకాలను పెంచుకోవచ్చు 

ఎప్పుడో మన తాతల కాలంలో పాత రకాలైన మామిడి చెట్లు నాటుంటారు. వాటి వల్ల ప్రస్తుతం మనకు సరైన దిగుబడిలేక ఆశించిన ధరలేక బాధపడుతుంటాము. అలాంటి పరిస్థితుల్లో ఈ టాప్‌ వర్కింగ్‌ విధానం ద్వారా మేలైన మామిడిని రకాలను ఉత్పత్తి చేసుకోవచ్చు. నేను ఇదే విధానం ద్వారా అంటు కట్టించాను. ఇప్పుడు నాతోట మేలైన తోతాపురి రకంగా మారి ఉత్పత్తి పెరిగింది. నికర ఆదాయాన్ని పొందుతున్నా. మామడి రైతులు ఈ విధానాన్ని అనుసరిస్తే మంచింది.  
– సుబ్రమణ్యం నాయుడు, మామిడి రైతు, రామాపురం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement