‘పిడుగుల’ వర్షం
కరీంనగర్ జిల్లాలో నలుగురు, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మంలో ఒక్కొక్కరు మృతి
సాక్షి నెట్‌వర్క్: ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. ఆదిలాబాద్ జిల్లా కోటపల్లి మండలంలో వడగళ్ల వర్షం కురిసింది. మల్లంపేట, కోటపల్లి, షేట్‌పల్లి, కొండంపేట, బొప్పారం నాగంపేటల్లో మామిడి కాయలు రాలిపోయాయి. సుమారు వంద మేకలు చనిపోయాయి. చెన్నూరు మండలంలో వరి, మిర్చి పంటలకు నష్టం వాటిల్లింది. బెజూర్ మండలం పాపన్‌పేట్‌కి చెందిన సుధాకర్(24) సోమవారం రాత్రి పిడుగుపాటుకు చనిపోయూడు. కరీంనగర్ జిల్లా లో మంగళవారం వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. 18 మండలాల్లో కురిసిన వర్షానికి మామిడి, వరి పంటలకు తీవ్ర నష్టం జరిగింది.
విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు, భారీ వృక్షాలు నేలకూలారుు. వీణవంక మండలంలో రూ.18 లక్షల ఆస్తినష్టం జరిగింది. వెల్గటూర్ మండలంలో 52 విద్యుత్ స్తంభాలు విరిగిపోయూరుు. 70 ఎకరాల్లో మామిడి, వరి పంటలు దెబ్బతిన్నారుు. పిడుగుపాట్లకు వేర్వేరు చోట్ల నలుగురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కోనరావుపేట మండలం నిజామాబాద్‌కు చెందిన కుడుకల ప్రశాంత్(23) పిడుగు పడి మరణించాడు. అతడి వద్దనున్న సెల్‌ఫోన్ పేలిపోయింది.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నందనం గ్రామానికి చెందిన బత్తిని అఖిల్ (19), కాటారం మండలకేంద్రానికి చెందిన వీరబోయిన తిరుపతి (22) పిడుగుపడి మరణించారు. తిరుపతికి ఇటీవలే వివాహ నిశ్చితార్థం జరిగింది. హుస్నాబాద్ మండలం అక్కన్నపేటకు చెందిన కాశబోయిన సమ్మయ్య(33) పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయాడు. వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, అకాల వర్షంతో రైతులకు తీరని నష్టం వాటిల్లింది. పిడుగుపాటుతో నెక్కొండ మండలం నాగారం గ్రామానికి చెందిన గొర్రెల కాపరి గాండ్ల మల్లయ్య మృతి చెందారు. ఖమ్మం జిల్లా మణుగూరు మండలంలో గాలిదూమారానికి చెట్టు కొమ్మలు మీదపడి సింగరేణి కార్మికుడు సంసాని వెంకటేశ్వరరావు(45) దుర్మరణం పాలయ్యాడు.