నెల్లూరులోని మైపాడుగేట్ వద్ద జాఫర్‌సాహెబ్ కాలువ దుస్థితి
వానకాలం ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతోంది. ప్రస్తుతం చెదురుమదురు జల్లులు మాత్రమే కురుస్తున్నాయి. అయితే వానలు పూర్తిస్థాయిలో కురవడం ప్రారంభమయితే మురుగు కాలువలు పొంగిపొర్లుతాయి. చెత్తాచెదారాలు ఎక్కడికక్కడ పేరుకుపోయి నీటి వనరులు కలుషితమవుతాయి. ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా వ్యాధులు అంతుచూస్తాయి.
నెల్లూరు(బారకాసు): వర్షాకాలం ప్రారంభంలోనే తొలకరితో మొదలయ్యే వ్యాధులు ఓ పట్టాన అంతు చిక్కవు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల విషయంలో వీటిని కట్టడి చేయడం సామాన్య విషయం కాదు. వర్షాలు పూర్గిగా పడక ముందే డయేరియా బాధితులు ఆస్పత్రులకు రావడం ప్రారంభమైంది. అయితే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధులు దరికి చేరవని వైద్య నిపుణుల పేర్కొంటున్నారు.
డ్రైనేజీ వ్యవస్థ వల్లే వ్యాధులు
నగరంలో అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజ్ వ్యవస్థ వల్ల అతిసార వంటి వ్యాధులు ప్రబలుతున్న విషయం తెలిసిందే. మంచినీటి పైపులైన్లలో లీకులు ఏర్పడి తాగునీరు కలుషితవుతోంది. అనంతరం ఆ నీటిని తాగిన ప్రజలు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రుల పాలవుతున్నారు. కాగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని శనివారం కలెక్టర్ ముత్యాలరాజు సమావేశం నిర్వహించి జిల్లా వైద్యారోగ్య, పంచాయితీరాజ్ శాఖల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా 12 సంచార వాహనాలు ఏర్పాటు చేశారు.
సీజనల్ వ్యాధులకు కారణాలివే
ఈ కొలైన్, సాల్మోనెల్లా, రోటా వైరస్ అనే వేల రకాల వైరస్‌లు, బ్యాక్టీరియా నీరు, ఆహారంలో కలిసినప్పుడు అతిసార, డయేరియా వ్యాధులు సోకుతాయి.
కొన్ని రకాల వైరస్‌ల కారణంగా నీళ్ల విరోచనాలతో పాటు, రక్త విరోచనాలు కూడా అయ్యే అవకాశాలున్నాయి.
గాలిలో తేమ ఎక్కువగా ఉండటం, వర్షంలో తడవడం వల్ల జలుబుతో పాటు వైరల్ ఫీవర్‌లు కూడా నమోదయ్యే అవకాశం ఉంది.
అతిసార వ్యాధికి కారణాలు
కలుషిత నీరు, ఆహారం.లక్షణాలురోజులో 10 నుంచి 20 సార్లు నీళ్ల విరేచనాలతో పాటు వాంతులు అవుతుంటాయి. కలుషిత నీటి వల్ల వచ్చే ఈ వ్యాధి రోగి కుటుంబ సభ్యులతో పాటు ఆ ప్రాంతంలో అధిక సంఖ్యలో ఒకేసారి సోకుతుంది. రోగి త్వరగా డీహైడ్రేషన్‌కు గురై షాక్‌లోకి వెళ్లిపోతారు. ఈ వ్యాధి చిన్నారులు, మధుమేహ రోగులు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కళ్లు లోతుకు పోవడం, నీరసించిపోవడం, చురుకుదనం తగ్గి, మాట్లాడలేక పోవడం, చివరికి మూత్రం కూడా తగ్గి ఆ ప్రభావం కిడ్నీలపై పడుతుంది. అతిసారకు గురైన వారిని సాధ్యమైనంత త్వరగా ఆస్పత్రికి తీసుకువెళ్లాలి
డయేరియా వ్యాధికి కారణాలు
కలుషిత నీరు, కలుషిత ఆహారం, నిల్వ ఉన్న ఆహారం తీసుకోవడం
లక్షణాలు
నీళ్ల విరేచనాలు అవుతాయి. రోజులో నాలుగు నుంచి ఐదుసార్లు విరోచనం అయితే డయేరియాగా భావించాలి.
చికిత్స
ఎక్కువ సార్లు విరేచనాలు అవడం వల్ల శరీరంలోని నీరు, లవణాలు, పొటాషియం, గ్లూకోజ్ తగ్గిపోయి రోగి షాక్‌లోకి వెళ్లిపోతాడు. బీపీ పడిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రెండు మూడు సార్లు నీళ్ల విరేచనాలు అయినప్పుడు తక్షణమే వైద్యుని వద్దకు వెళ్లి చికిత్స పొందడం మంచిది.
రక్త విరేచనాలు
కలుషిత ఆహారం వల్ల వస్తాయి. తీవ్రమైన కడుపునొప్పితో రక్త విరేచనాలు అవుతుంటాయి. రక్తంతో కూడిన విరేచనం అవడం వల్ల ఇతర వ్యాధులని ప్రజలు అపోహ పడుతుంటారు. వీరి మలాన్ని పరీక్ష చేసి వ్యాధి కారకాన్ని గుర్తించాలి.
జాగ్రత్తలు
డయేరియా సోకిన రోగికి మామూలు వ్యక్తులు, చిన్నపిల్లలు దూరంగా ఉండాలి. లేకుంటే వారికి కూడా సోకే అవకాశం ఉంటుంది.
రోగిని పట్టుకున్నప్పుడు చేతులను సబ్బుతో కడుక్కోవడం ద్వారా వ్యాధి సోకకుండా 90 శాతం అరికట్టవచ్చు
వ్యాధి సోకిన రోగికి కొబ్బరినీళ్లు, మజ్జిగ, బార్లీనీళ్లు, ఓఆర్‌ఎస్ ద్రావణం ఇవ్వాలి.
విరేచనాలు అవుతున్నప్పుడు పాలు, పండ్లు, ఆకుకూరలు ఇవ్వకూడదు.
వేయించిన బ్రెడ్, లైట్ టీ, దోరగా పండిన అరటి పండు, అన్నం, పప్పు తీసుకోవచ్చు.
విరేచనం తర్వాత తప్పనిసరిగా సుబ్బుతో చేతులు కడుక్కోవాలి.
విరేచనాలు అవుతున్నప్పుడు ఒక లీటర్ నీటిలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్‌ను కలిపి 3 నుంచి 4 గంటల వ్యవధిలో మొత్తం తాగాలి.
Comments
Please login to add a commentAdd a comment