పిడుగు సమయంలో మెరుపు దృశ్యాలు
శ్రీకాకుళం న్యూకాలనీ: వేసవిలో ఉష్ణోగ్రతలు తారస్థాయికి చేరుతున్నాయి. వాతావరణంలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉరుములతో కూడిన వర్షం, పిడుగులు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు, నిర్వహణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా పిడుగులు పడే సమయంలో సెల్‌ఫోన్‌ను వినియోగించే వారు ప్రమాదాల బారిన పడుతున్నారు. వర్షం వచ్చే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడుతుంటాయి. పిడుగుపాటు వల్ల విడుదలయ్యే పెద్ద పెద్ద ధ్వనులు, వెలుతురుతోపాటు విద్యుత్‌శక్తి విడుదల అవుతుంది. అసలు పిడుగు ఎలా పడుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంపై కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పిడుగు పాటు బారి నుంచి తప్పించుకోచవ్చనని నిపుణులు చెబుతున్నారు.
మెరుపు, ఉరుము, పిడుగు అంటే..?
పిడుగు అంటే ఆకాశంలో సహజసిద్ధంగా ఉత్పన్నమయ్యే విద్యుదాపాతం. మేఘాలు ఢీకొన్నప్పుడు వెలువడే కాంతిని మెరుపు అని, శబ్ధాన్ని ఉరుము అని, ఉత్పన్నమయ్యే విద్యుత్‌ను పిడుగుగా పిలుస్తారు. మేఘాల్లో అతిశీతల రేణువులు విద్యుదావేశాలను జనింపచేస్తాయి. మేఘాల దిగువభాగంలోని రుణవిద్యుత్ ఆవేశాలు భూమిపై ధన విద్యుదావేశాన్ని ప్రేరేపిస్తాయి. ఈ రెండు విద్యుదావేశాలు అనుసంధానమైనప్పుడు విద్యుత్ శక్తి ఉత్పన్నమవుతుంది. దీన్నే పిడుగు అంటారు. పైన వైశాల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, మేఘాల్లోని విద్యుదావేశాలు ప్రవాహాన్ని ఆకర్షిస్తుంటాయి. వేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడితే ఎంతో ఉపశమనం కలుగుతుంది. ఆ సమయంలో పొలం పనుల్లోను ఇతర అవసరాలకో బయటకు వెళ్లినప్పుడు ఈ పిడుగుబారిన పడే ప్రమాదం ఉంది.
ఒక్క పిడుగులో..
ఒక్క పిడుగులో ఒక పట్టణ అవసరాలకు ఆరునెలల పాటు విద్యుత్‌ను అందించగలిగే శక్తి ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. విరుద్ధ ఆవేశాలు ఉన్న మేఘాలు మద్ధ రాపిడి జరిగినప్పుడు మెరుపులు, ఉరుములు ఏర్పడతాయి. ఆ సమయంలో మేఘాల్లో రాపిడితో జనించే ఉష్ణం 50వేల డిగ్రీల ఫారెన్ గ్రేడ్ వరకు ఉంటుందని అంచనా. ఈ వేడి అనువులన్నీ కలిసి, ఒక నాళం మాదిరిగా ఏర్పడి భూమిమీద ఉన్న పాజిటివ్ ఎనర్జీతో కలిస్తే పిడుగు అవుతుంది. ఒక మిల్లీ సెకను కాలంలో మెరుపులతో కూడిన పిడుగు 20 ఆంపియర్ల విద్యుత్ ప్రవాహాన్ని ఏర్పరుస్తుంది. మేఘాలు ఢీకొన్నప్పుడు జనించే విద్యుత్ తరంగాలు సన్నని మార్గంలో భూమిమీదకు చేరేందుకు వాహకాలను వెతుకుతుంటాయి. ఎత్తైన చెట్లు, ఇనుప స్తంభాలు, ధ్వజ స్తంభాలు, ఎత్తైన భవనాలు కూడా వాహకాలుగా మారే అవకాశం ఉంది.
క్యుములో నింబస్ మేఘాలతో ప్రమాదం
వాతావరణలో వెంటవెంటనే జరిగే మార్పులతోనే పిడుగులు పడుతుంటాయి. అడవుల శాతం తగ్గిపోవడం, ఉన్న చెట్లను ఇష్టారాజ్యంగా నరికివేడయంతో వాతావరణం వేడేక్కిపోతోంది. పడిన వర్షం ఆవిరిగా మారి మేఘాల్లోకి చేరడం, మళ్లీ మేఘావృతమై వర్షాలు పడతుండటం జరుగుతుంది. ఈ సమయంలో పిడుగులు ఎక్కువగా పడుతుంటాయి. క్యుములో నింబస్ మేఘాలు ఇందుకు సహకరిస్తుంటాయి.
లైట్నింగ్ కండక్టర్ ఏర్పాటు చేసుకోవాలి..
పిడుగుపాటు నుంచి తప్పించుకునేందుకు ఎత్తైన ప్రదేశం నుంచి నేరుగా భూమిలోకి లైట్నింగ్ కండక్టర్‌ను ఏర్పాటు చేసుకోవాలి. దీన్ని ఏర్పాటు చేసుకోవడం పట్ల పిడుగులో ఉన్న విద్యుదావేశం భూమిలోకి ఆకర్షించుకుంటుంది. ఎత్తైన టవర్స్ ఏర్పాటు చేసినప్పుడు ఇలాంటి జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.
ప్రథమ చికిత్స ఇలా..
♦ పిడుగుపాటుతోపాటు అస్వస్థతకు గురైన వారిని వెంటనే గాలి, వెలుతురు తగిలే విశాలమైన ప్రాంతంలో ఉంచాలి.
♦ తడి దుస్తులు తొలగించి, పొడివి వేయాలి.
♦ తిన్నగా పడుకోబెట్టి, రెండుకాళ్లు పైకి ఎత్తి ఉంచాలి. తలను ఒకవైపు తిప్పిపెట్టాలి.
♦ ఆ సమయంలో నోటి ద్వారా నీరు, ఇతర ఎలాంటి ఆహారాన్ని అందించకూడదు.
♦ వెంటనే అందుబాటులో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యసేవలు అందించారు.
అప్రమత్తతే శ్రీరామ రక్ష..
♦ మెరుపు, ఉరుము వచ్చే సమయంలో చెవులు గట్టిగా మూసుకోవాలి. పిడుగు శబ్ధంతో వినికిడి శక్తి కోల్పోయే ప్రమాదం తగ్గుతుంది.
♦ ఉరుములు, మెరుపులు సమయంలో సురక్షిత ప్రాంతానికి వెళ్లే అవకాశం లేకపోతే.. నేలమీదకు పూర్తిగా కిందకు వంగాలి. నేలపై పడుకోకూడదు. నేలపై కూర్చున్నప్పడు పాదాలు ముందుభాగం మాత్రమే నేలను తాకాలి. శరీరంలోని మరే ఇతర భాగం నేలను తాకకుండా చూసుకోవాలి.
♦ పాదాల మడమల ముందు ఒకదానికొకటి తాకేలా ఉండాలి. అలా చేయడం వల్ల పిడుగు పడే సమయంలో నేలపై పడి దాని విద్యుత్‌శక్తి ఒక పాదం నుంచి శరీరంలోకి ప్రవహించినా వెంటనే అది రెండో పాదం నుంచి తిరిగి భూమిలోకి ప్రవేశిస్తుంది. శరీరంలోకి విద్యుత్ ప్రవహించే అవకాశాలు తగ్గుతాయి.
♦ ఇండ్లకు విద్యుత్ కరెంట్ ఎర్త్ చేపించాలి.
♦ మేఘాలు దట్టంగా కమ్ముకున్నప్పుడు.. పిడుగులు పడతాయనే ఆలోచనకు రావాలి.
♦ కళ్లు మూసుకోవడం వల్ల ప్రసారకాంతి నుంచి తప్పించుకోచ్చు.
♦ భూమిపై ఉన్న ఎలాంటి లోహాలను తాకకూడదు.
♦ పొలాల్లో ఆరుబయట ఉన్నప్పుడు చెట్టు కిందకు వెళ్లకూడదు. ఎత్తైన చెట్లు, స్తంభాలు పిడుగులను ఆకర్షిస్తాయి.
ఏం చేయకూడదు..?
♦ వర్షం కురిసేటప్పుడు చెట్ల కిందన నిలబడరాదు.
♦ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వస్తే రైతులు పొలాల్లో ఉండకూడదు.
♦ మెరుపు కనిపించిన తర్వాత సమయాన్ని లెక్కిస్తే 30 సెకన్లు లేదా అంతకంటే తక్కువలోపు ఉరుము వినిపిస్తే.. మనకు పది కిలోమీటర్ల దూరంలోపు పిడుగు పడే అవకాశం ఉందని అర్థం చేసుకోవచ్చు.
♦ మెరుపు కనిపించిన తర్వాత 30 నిమిషాలపాటు బయటకు వెళ్లే ప్రయత్నం చేయకూడదు.
♦ గొడుగులపై లోహపు బోట్లు, చేతుల్లో సెల్‌ఫోన్లు లేకుండా చూసుకోవాలి.
♦ ముఖ్యంగా సెల్‌ఫోన్లను స్విచ్చాఫ్ చేసుకోవాలి. ఒకవేళ ఇవి ఉంటే రేడియేషన్ తరంగాలకు గురై ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది.
♦ వర్షం పడే సమయంలో విద్యుత్ తీగల కింద, ట్రాన్స్‌ఫార్మర్ల సమీపంలో ఉండకూడదు.
♦ కొండలు వాగులు, చెరువులకు నీరు ప్రాంతానికి దూరంగా ఉండాలి.
♦ ఇనుము(ఐరన్) ఉండే ప్రాంతాలలో ఉండకూడదు.
♦ ఉరుములు, మెరుపుల సమయంలో చెప్పులు లేకుండా బయటకు వెళ్లరాదు.
♦ గుండె సంబంధిత వ్యాదులు ఉన్నవారు ఉరుములు, మెరుపులకు భయాందోళనలకు గురయ్యే అవకాశం ఉంది. ధైర్యంగా ఉండాలి.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా జిల్లాలోని వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఏప్రిల్, మే నెలల్లో పిడుగులు పడే అవకాశం ఉంది. వాతావరణశాఖ అధికారులు కూడా అదే విషయాన్ని చెబుతున్నారు. విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతోపాటు క్యుములో నింబస్ మేఘాల కారణంగా పిడుగులు పడే అవకాశం ఉంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. వర్షం వస్తుందని ముందస్తుగా తెలుస్తుంది. సాధ్యమైనంతవరకు బయటకు వెళ్లకుండా ఉంటే ప్రమాదం నుంచి తప్పించుకున్నట్టే.– జి.వెంకటేశ్వరరావు,ఫిజిక్స్ సీనియర్ అధ్యాపకులు
Comments
Please login to add a commentAdd a comment