సంఘటన స్థలంలో వీర్రాజు మృతదేహం
కొయ్యూరు,జి.మాడుగుల,జీకేవీధి(పాడేరు), గొలుగొండ(నర్సీపట్నం): ఏజెన్సీలో గురువారం పిడుగులు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షం కురవడంతో పాటు పెద్ద శబ్దాలతో పిడుగులు పడ్డాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాం దోళనకు గురయ్యారు. పిడుగు పాటుతో కొయ్యూరు, జీకేవీధి మండలాలకు చెందిన ఇద్దరు దుర్మరణం చెందగా, జి.మాడుగుల, జీకే వీధి మండలాల్లో పశువులు మృత్యువాత పడ్డాయి.కొయ్యూరు మండలం చింతలపూడి పంచాయతీ గింజర్తికి చెందిన వల్లూరి వీర్రాజు(55) అనే వ్యక్తి రుణ బకాయి జమ చేసేందుకు గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటలో బ్యాంకుకు వెళ్లేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. కృష్ణదేవి పేటకు సమీపంలో పల్లవూరు దగ్గరకు వెళ్లే సరికి భారీ వర్షం పడింది. దీంతో సమీపంలో ఉన్న పాకలోకి వెళ్లేందుకు వాహనం స్టాండ్ వేస్తుండగానే అతనిపై పిడుగుపడింది. కుప్పకూలిపోయిన అతనిని గమనించిన స్థానికలు 108 వాహనానికి ఫోన్ చేశారు.
ఆ సిబ్బంది వచ్చి పరీక్షించి, అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. మృతునికి భార్య,పిల్లలున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. జీకే వీధి మండలం వంచుల చెరపల్లి గ్రామానికి చెందిన సీతమ్మ(42) అనే గిరిజన మహిళ వ్యవసాయ పనులకు వెళ్లింది. భారీ వర్షం కురవడంతో తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో పిడుగుపడింది. దీవంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఈమెను కుటుంబ సభ్యులు అంబులెన్స్ సాయంతో చింతపల్లి ఆస్పత్రికి తరలించే సమయానికి మృత్యువాత పడింది. పిడుగుపాటు వల్ల దామనాపల్లి గ్రామానికి చెందిన గెమ్మెలి బొజ్జన్నకు చెందిన రెండు దుక్కిటెద్దులు మృత్యువాత పడ్డాయి. జి.మాడుగుల మండలంలో పలు గ్రామాల్లో గురువారం పిడుగులు పడడంతో 11 పశువులు మృతి చెందగా, సిల్వర్ ఓక్ తోటలో చెట్లు ధ్వంసమయ్యాయి.మండలంలో నుర్మతి పంచాయతీ దానుడుకొండ గ్రామానికి చెందిన సాగేని పుల్లయ్య పశువులు గ్రామ సమీపంలో కొండకు మేతకు వెళ్లగా ఆ సమయంలో వర్షంతోపాటు పిడుగుపడడంతో ఏడు పశువులు మృత్యువాత పడ్డాయి. వంజరి పంచాయతీ కిముడుపల్లి గ్రామానికి చెందిన చెట్టి సింహాచలానికి చెందిన మూడు మేకలు, బోనంగి రాంబాబుకు చెందిన ఓ ఎద్దు పిడుగుపాటుకు మృతి చెందాయని బాధితులు తెలిపారు. జి.మాడుగుల–పాడేరు రోడ్డులో ఈదులబయలు గ్రామానికి చెందిన లువ్వాబు అప్పలస్వామికు చెందిన రహదారికి అతి సమీపంలో గల సిల్వర్ ఓక్, కాఫీ తోటల్లో పిడుగుపడటంతో సిల్వర్ ఓక్ చెట్లు ధ్వంసమయ్యాయి. పశువులను కోల్పయిన బాధితులను ఆదుకోవాలని ఆయా గ్రామస్తులు అధికారులను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment