
సన్‌రైజర్స్‌కు వరుసగా రెండో ఓటమి
7 వికెట్లతో నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్
మిచెల్ స్టార్క్‌కు 5 వికెట్లు
సన్‌రైజర్స్ ‘విధ్వంసక’ బ్యాటింగ్ బృందం మరోసారి నిరాశపర్చింది. సొంతగడ్డపై ఓటమి తర్వాత వైజాగ్ చేరిన రైజర్స్ ఆట మాత్రం మారలేదు. బ్యాటింగ్ వైఫల్యంతో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైంది. అనికేత్ వర్మ సిక్సర్లతో జోరు ప్రదర్శించినా అది సరిపోలేదు. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ అలవోకగా విజయతీరం చేరింది. తొలి వికెట్‌కు 55 బంతుల్లోనే 81 పరుగులు వచ్చాక లక్ష్యం సునాయాసమైపోయింది. ఫలితంగా ఢిల్లీ ఖాతాలో వరుసగా రెండో విజయం చేరగా, హైదరాబాద్ వరుసగా రెండో ఓటమిని చవిచూసింది.
సాక్షి, విశాఖపట్నం: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో పరాజయాన్ని ఎదుర్కొంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 18.4 ఓవర్లలో 163 పరుగులకే ఆలౌటైంది. అనికేత్ వర్మ (41 బంతుల్లో 74; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... హెన్రిచ్ క్లాసెన్ (19 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మిచెల్ స్టార్క్ (5/35) ఐదు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీయగా, కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఢిల్లీ 16 ఓవర్లలో 3 వికెట్లకు 166 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఫాఫ్ డుప్లెసిస్ (27 బంతుల్లో 50; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేయగా... జేక్ ఫ్రేజర్ (32 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), అభిషేక్ పొరేల్ (18 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ ఆడిన సన్‌రైజర్స్ లెగ్‌స్పిన్నర్ జీషాన్ అన్సారీకే మూడు వికెట్లు దక్కాయి.
కీలక భాగస్వామ్యం...
స్టార్క్ వేసిన తొలి ఓవర్లో ట్రవిస్ హెడ్ (12 బంతుల్లో 22; 4 ఫోర్లు) రెండు ఫోర్లు కొట్టి జోరుగా మొదలుపెట్టినా, దురదృష్టవశాత్తూ అదే ఓవర్లో అభిషేక్ శర్మ (1) రనౌటయ్యాడు. హెడ్ బంతిని ఆడి సింగిల్ కోసం ప్రయత్నించగా నెమ్మదిగా స్పందించిన అభిషేక్ క్రీజ్‌కు చేరుకునేలోగా నిగమ్ విసిరిన త్రో వికెట్లను పడగొట్టింది.
ఇషాన్ కిషన్ (2) ఈ మ్యాచ్‌లోనూ విఫలం కాగా, ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య గ్రౌండ్‌లోకి వచ్చిన ‘లోకల్ బాయ్’ నితీశ్ కుమార్ రెడ్డి (0) తీవ్రంగా నిరాశపర్చాడు. స్టార్క్ బౌలింగ్‌లో తాను ఎదుర్కొన్న రెండో బంతినే భారీ షాట్ ఆడబోయి గాల్లోకి లేపగా అక్షర్ పటేల్ చేతికి చిక్కాడు. స్టార్క్ తర్వాతి హెడ్ కూడా అవుట్ కావడంతో రైజర్స్ స్కోరు 4.1 ఓవర్లలో 37/4 వద్ద నిలిచింది. ఈ దశలో అనికేత్, క్లాసెన్ కలిసి జట్టును ఆదుకున్నారు. అప్పటికీ నాలుగు వికెట్లు కోల్పోయినా... వీరిద్దరు దూకుడు మాత్రం తగ్గించకుండా ఓవర్‌కు 11 రన్‌రేట్‌తో పరుగులు రాబట్టారు.
6 పరుగుల వద్ద పొరేల్ క్యాచ్ వదిలేయడంతో అనికేత్‌కు లైఫ్ లభించింది. స్టార్క్ ఓవర్లో క్లాసెన్ వరుసగా 6, 4 కొట్టగా, నిగమ్ ఓవర్లో అనికేత్ వరుసగా 4, 6 బాదాడు. ఆ తర్వాత అక్షర్ ఓవర్లో అనికేత్ వరుసగా రెండు భారీ సిక్స్‌లు బాదాడు. ఈ జోడీ 42 బంతుల్లో 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా, నిగమ్ అద్భుత క్యాచ్‌తో క్లాసెన్ వెనుదిరిగాడు. 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అనికేత్ మరింత చెలరేగిపోతూ అక్షర్ ఓవర్లో వరుసగా 4, 6, 6 బాదడం విశేషం. అయితే ఇతర బ్యాటర్లంతా విఫలం కావడంతో మరో 8 బంతులు మిగిలి ఉండగానే జట్టు ఇన్నింగ్స్ ముగిసింది.
ఆరంభం నుంచే దూకుడు...
ఛేదనలో ఢిల్లీకి ఏ దశలోనూ ఇబ్బంది ఎదురుకాలేదు. ఓపెనర్లు జేక్ ఫ్రేజర్, డుప్లెసిస్ ధాటిగా ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టారు. దాంతో పవర్‌ప్లే ముగిసేసరికి ఢిల్లీ 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52 పరుగులు చేసింది. ఈ క్రమంలో జేక్ ఫ్రేజర్ తనకు వచ్చిన రెండు ‘లైఫ్’లను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. 26 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న డుప్లెసిస్... 40 ఏళ్లు దాటిన తర్వాత ఐపీఎల్‌లో హాఫ్ సెంచరీ అరుదైన ఆటగాళ్లు గిల్‌క్రిస్ట్, గేల్, ద్రవిడ్ సరసన నిలిచాడు.

అన్సారీ వేసిన 10వ ఓవర్ ఆసక్తికరంగా సాగింది. తొలి బంతికి అతను డుప్లెసిస్‌ను అవుట్ చేయగా, రెండో బంతికి పొరేల్ సింగిల్ తీశాడు. తర్వాతి మూడు బంతుల్లో వరుసగా 4, 4, 6 బాదిన జేక్ ఫ్రేజర్ చివరి బంతికి అవుటయ్యాడు. షమీ వేసిన తర్వాతి ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన కేఎల్ రాహుల్ (5 బంతుల్లో 15; 2 ఫోర్లు, 1 సిక్స్)ను కూడా అన్సారీనే వెనక్కి పంపించాడు. 52 బంతుల్లో 49 పరుగులు చేయాల్సిన ఈ స్థితిలో పొరేల్, స్టబ్స్ (14 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు) ఇక ఆలస్యం చేయలేదు. ఫటాఫట్‌గా 28 బంతుల్లోనే అభేద్యంగా 51 పరుగులు జత చేసి మ్యాచ్‌ను ముగించారు.
ఆకట్టుకున్న అన్సారీ
సన్‌రైజర్స్ జట్టు తరఫున ఈ మ్యాచ్‌లో 25 ఏళ్ల లెగ్‌స్పిన్నర్ జీషాన్ అన్సారీ ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో స్వస్థలం. 5 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో బరిలోకి దిగిన అతను ఐపీఎల్‌కు ముందు యూపీ తరఫున ఒకే ఒక టి20 మ్యాచ్ ఆడాడు. 2016 అండర్–19 వరల్డ్ కప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టులో రిషభ్
పంత్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, సర్ఫరాజ్‌లతో పాటు అన్సారీ కూడా సభ్యుడిగా ఉన్నాడు. గత ఏడాది యూపీ టి20 లీగ్‌లో మీరట్ మావెరిక్స్ తరఫున ఆడి అత్యధిక వికెట్లు (24) తీయడంతో అందరి దృష్టిలో పడ్డాడు. ‘గూగ్లీ’ అతని ప్రధాన బలం. వేలంలో సన్‌రైజర్స్ జట్టు విప్‌రాజ్ నిగమ్‌తో పాటు అన్సారీ కోసం పోటీ పడింది. నిగమ్‌ను ఢిల్లీ సొంతం చేసుకోగానే అన్సారీని రైజర్స్ ఎంచుకుంది.
స్కోరు వివరాలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (రనౌట్) 1; హెడ్ (సి) కేఎల్ రాహుల్ (బి) స్టార్క్ 22; ఇషాన్ కిషన్ (సి) స్టబ్స్ (బి) స్టార్క్ 2; నితీశ్ కుమార్ రెడ్డి (సి) అక్షర్ పటేల్ (బి) స్టార్క్ 0; అనికేత్ (సి) జేక్ ఫ్రేజర్ (బి) కుల్దీప్ 74; క్లాసెన్ (సి) నిగమ్ (బి) మోహిత్ 32; మనోహర్ (సి) డుప్లెసిస్ (బి) కుల్దీప్ 4; కమిన్స్ (సి) జేక్ ఫ్రేజర్ (బి) కుల్దీప్ 2; ముల్డర్ (సి) డుప్లెసిస్ (బి) స్టార్క్ 9; హర్షల్ పటేల్ (సి) అక్షర్ పటేల్ (బి) స్టార్క్ 5; షమీ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (18.4 ఓవర్లలో ఆలౌట్) 163.
వికెట్ల పతనం: 1–11, 2–20, 3–25, 4–37, 5–114, 6–119, 7–123, 8–148, 9–162, 10–163.
బౌలింగ్: మిచెల్ స్టార్క్ 3.4–0–35–5, ముకేశ్ కుమార్ 2–0–17–0, అక్షర్ పటేల్ 4–0–43–0, విప్‌రాజ్ నిగమ్ 2–0–21–0, మోహిత్ శర్మ 3–0–25–1, కుల్దీప్ యాదవ్ 4–0–22–3.
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: జేక్ ఫ్రేజర్ (సి అండ్ బి) అన్సారి 38; డుప్లెసిస్ (సి) ముల్డర్ (బి) అన్సారి 50; పొరేల్ (నాటౌట్) 34; కేఎల్ రాహుల్ (బి) అన్సారి 15; స్టబ్స్ (నాటౌట్) 21; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (16 ఓవర్లలో 3 వికెట్లకు) 166.
వికెట్ల పతనం: 1–81, 2–96, 3–115.
బౌలింగ్: మొహమ్మద్ షమీ 3–0–31–0, అభిషేక్ శర్మ 3–0–27–0, ప్యాట్ కమిన్స్ 2–0–27–0, హర్షల్ పటేల్ 3–0–17–0, జీషాన్ అన్సారి 4–0–42–3, వియాన్ ముల్డర్ 1–0–16–0.