పూల్‌సింగ్ మృతదేహం వద్ద రోదిస్తున్న భార్య స్వప్న(ఇన్‌సెట్) చిన్నారి మణికంఠ
టేకులపల్లి భద్రాద్రి జిల్లా: ఉరుము ఉరిమింది... పిడుగు పడింది.. యువకుడిని బలిగొంది. ఆ యువకుడి పక్కనే ఉన్న కుమారుడైన చిన్నారి మృత్యుంజయుడిగా నిలిచాడు. ఒకట్రెండు నిమిషాల ముందు అక్కడి నుంచి పక్కకు వెళ్లిన భార్య.. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు... మండలంలోని తడికలపూడి పంచాయతీ కోక్యాతండాకు చెందిన భూక్య పూల్‌సింగ్(30)కు కొన్నేళ్ల క్రితం స్వప్నతో వివాహమైంది.
వీరికి ముగ్గురు పిల్లలు కీర్తన (05), ప్రవణీత(3), చిన్ని మణికంఠ (01). డిగ్రీ వరకు చదివిన పూల్‌సింగ్, కొంతకాలం ఆర్మీలో కూడా పనిచేశాడు. కొద్ది రోజులపాటు కొత్తగూడెంలోని షాపులో చేశాడు. కొన్నాళ్లు ఆటో నడిపాడు. ప్రస్తుతం కూలి పనులు చేస్తున్నాడు. శుక్రవారం తన భార్య స్వప్న, కుమారుడు మణికంఠతో కలిసి ద్విచక్ర వాహనంపై కొత్తగూడెం వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగొస్తుండగా ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం మొదలైంది.
మార్గమధ్యలోగల సీతారాంపురం స్టేజీ సమీపంలో రోడ్డు పక్కన వాహనాన్ని ఆపాడు. ఆక్కడే ఉన్న చెట్టు కిందకు వెళ్లారు. మూత్ర విసర్జన కోసమని స్వప్న కొంత దూరం వెళ్లింది. ఏడాది వయసున్న చిన్ని మణికంఠను భర్త వద్దనే ఉంచింది. ఆమె అలా వెళ్లిందో.. లేదో... భారీ శబ్దంతో ఆ చెట్టు సమీపంలోనే పిడుగు పడింది. ఆ తాకిడికి పూల్‌సింగ్ అక్కడికక్కడే మృతిచెందాడు.
చిన్న మణికంఠ మాత్రం మృత్యుంజయుడిగా నిలిచాడు. వెంటనే స్వప్న పరుగెత్తుకుంటూ వచ్చేసరికి విగతుడిగా భర్త కనిపించాడు. మృతదేహంపై పడి గుండె అవిసేలా రోదించింది. పోలీసులు పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment