పులివెందుల: పిడుగుపాటుకు కాలిపోతున్న చెట్టు (ఫైల్)
జిల్లాలో రెండేళ్లుగా భారీగా పిడుగులు పడుతున్నాయి. ఒకట్రెండు కాదు.. పదులు అంత కన్నా కాదు.. వందలు ఎంతమాత్రం కాదు.. వేల సంఖ్యలో పిడుగులు పడుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. అందులోనూ ఏడాదంతా కాదు.. కేవలం కొన్నినెలల వ్యవధిలోనే భారీగా పిడుగులు పడుతుండటం కొసమెరుపు. పిడుగుల వానతో ప్రాణనష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ రెండేళ్ల కాలంలో భారీగా పిడుగుల వర్షం కురిసిందనే చెప్పడానికి రాష్ట్ర విపత్తుల శాఖ రికార్డు చేసిన గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి.
సాక్షి, కడప : ప్రసుత్తం కురుస్తున్న వర్షాలకు పిడుగులు పడడం సర్వసాధారణంగా మారింది. ఆకాశంలో క్యూములోనింబస్ మేఘాలు విస్తృతస్థాయిలో ఆవరించి ఉండడం, భూమిపై భౌగోళిక పరిస్థితులతో వాతావరణం మారడం, వర్ష సూచనలు లేకుండా ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు పడుతున్నాయి. ఈక్రమంలో పదుల సంఖ్యలో ప్రాణనష్టం వాటిల్లుతోంది. దీంతో ప్రజలు వర్షమంటే బెంబేలెత్తుతున్నారు. వర్షాకాలంలో కన్నా ఇతర సీజన్లల్లో వాన కురిసే సమయంలోనే అధికంగా పిడుగులు పడుతున్నట్లు వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు.
రాష్ట్ర విపత్తుల శాఖ హెచ్చరిస్తున్నా..
రాష్ట్రంలో ప్రత్యేకంగా ఏర్పాటైన రాష్ట్ర విపత్తుల శాఖ పిడుగులపై ప్రత్యేక హెచ్చరికలు చేస్తోంది. ఆయా జిల్లాల్లోని ఫలానా మండలంలో పిడుగు పడుతుందని తెలియజేస్తోంది. ఈ సమాచారం నేరుగా మండల తహసీల్దార్‌తోపాటు ఇతర అధికారులకు అందుతుంది. తద్వారా మండలంలో విస్తృత ప్రచారాన్ని మీడియా ద్వారా కల్పిస్తున్నా, పొలాలు, దూర ప్రాంతాల్లో ఉన్నవారికి సమాచారం అందకపోవడంవల్ల పిడుగు పాటుకు గురై మరణిస్తున్నారు.
మృత్యువాత : జిల్లాలో ప్రతి ఏడాది పిడుగుపాటుకు గురై పదులసంఖ్యలో జనం మృత్యువాతపడుతున్నారు. ప్రధానంగా ఇంటి వద్ద ప్రమాదాలు తక్కువగా కనిపిస్తున్నా, ఊరి బయట అడవిలోనే పిడుగుపాటుకు ఎక్కువగా గురవుతున్నారు. 2018లో ఇప్పటివరకు అధికారిక లెక్కల ప్రకారం..నలుగురు పిడుగుపాటుకు గురై చనిపోయారు. అంతేకాకుండా పశువులు కూడా పిడుగుపాటుకు బలైపోతున్నాయి. ఇదిలాఉండగా పిడుగుపడి చనిపోతున్న వారు కొందరైతే, ఉరుముల శబ్దానికి భయపడి గుండె ఆగి మరణిస్తున్నా వారు ఉన్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
♦ పిడుగులు పడే సమయంలో కిటికీలు, తలుపులు మూయడం
♦ కిటికీలు, తలుపులు, అడ్డుగోడలు, ద్వారమండపాలు, గోడలకు దూరంగా ఉండటం
♦ ఉరుములు చివరి శబ్దం విన్న తర్వాత 30 నిమిషాల వరకు ఇళ్లలోనే ఉండాలి.
♦ బహిరంగ ప్రదేశాలలో ఉన్నట్లయితే సత్వరమే సురక్షిత ప్రాంతానికి వెళ్లడం
♦ ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు, మోటారు సైకిళ్లు తదితర వాటికి దూరంగా ఉండటం
♦ గాలివానలో వాహనాన్ని నడుపుతున్న సమయంలో మంచి రహదారి కోసం ప్రయత్నించడం, చెట్లు లేని, వరదలు రానీ ప్రాంతాలకు వెళ్లడం వేలాడుతున్న విద్యుత్‌లైన్లకు దూరంగా ఉండాలిపిడుగులు పడే సమయంలోచేయకూడని పనులు
♦ ఎలక్ట్రిక్ అనుసంధానం ఉన్న విద్యుత్ పరికరాలను వినియోగించరాదు. తాకరాదు
♦ పిడుగులు పడే సమయంలో సెల్‌ఫోన్లకు దూరంగా ఉండాలి.
♦ పిడుగులు పడే సమయంలో దుస్తులను ఉతకడం, పాత్రలను శుభ్రం చేయడం వంటి పనులు చేయరాదు.
♦ పిడుగు పడే సమయంలో చెట్ల కింద, చెట్ల సమీపంలో ఉండరాదు
♦ బహిరంగ ప్రదేశాలలో విడిగా ఉన్న షెడ్లు, ఇతర చిన్న నిర్మాణాల వద్ద ఉండరాదు.
♦ ఏప్రిల్ 2న చాపాడు మండలంలోని వెదురూరుకి చెందిన తల్లీకూతురు షేక్ ఖాసింబీ, అయేషాలు పొలంలో పనుల నిమిత్తం వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చేందుకు సిద్ధమవుతుండగా, ఒక్కసారిగా గాలివాన రావడం, పిడుగుపాటుతో అక్కడికక్కడే పొలం వద్దనే కుప్పకూలిపోయి చనిపోయారు.
♦ మే 13న వల్లూరు మండలం బీచువారిపల్లెలో పిడుగుపాటుకు రైతుకూలీ దస్తగిరమ్మ మృ త్యువాత పడగా, ముగ్గురు మహిళలకు గా యాలయ్యాయి. అదేరోజు బి.కోడూరు మండలం మేకవారిపల్లెలో పిడుగుపాటుకు వెంకటరమణారెడ్డి కూడా మృత్యువాతపడ్డాడు.
♦ మే 13న రైల్వేకోడూరు పరిధిలోని సి.కమ్మపల్లెలో పిడుగుపాటుకు ఒక గేదె మృతిచెందగా, సుండుపల్లె మండలంలోని మడుంపాడు సమీపంలోని గోపాలకృష్ణపురంలో రెండు గొర్రెలు, ఏడు మేకలు కూడా పిడుగుపాటుకు గురై మృతిచెందాయి.
♦ మే 29న కలసపాడు మండలం ముదిరెడ్డిపల్లెలో పిడుగుపాటుకు గురై నడిపి పీరాన్ సాహేబ్ (55) మృతిచెందారు. పశువులను మేపేందుకు సమీప అడవికి వెళ్లి తిరిగివస్తుండగా ఒక్కసారిగా పిడుగుపడి అక్కడికక్కడే మృతిచెందారు.
♦ ఇదీ గత రెండు నెలలుగా జిల్లాలో పిడుగుల వాన. వాన మొదలైందంటే చాలు ఉరుములు, మెరుపులు ఆపై భారీగా పిడుగులు పడుతున్నాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అసలు ఎప్పుడు లేని విధంగా ఇలా వేసవిలో పిడుగుల వాన ఏంటోనని హడలిపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment