సుజాత, ఏలూరి వీరయ్య, మృతదేహలు
బుధవారం మూడుచోట్ల పిడుగులు పడ్డాయి. ముగ్గురిని బలిగొన్నాయి. తిరుమలాయపాలెం మండలంలో ఇద్దరు, కూసుమంచి మండలంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కూసుమంచిలో మహిళ...
సాక్షి, కూసుమంచి: కూసుమంచికి చెందిన గంజి నాగేశ్వరరావు, రెండెకరాల భూమిని కౌలు చేస్తు న్నాడు. అతని భార్య సుజాత(35), రోజులాగా నే బుదవారం చేనుకు వెళ్లింది. వర్షం వస్తుం డడంతో వేప చెట్టు కిందకు వెళ్లింది. కొద్దిసేపటికి సరిగ్గా అక్కడే పిడుగు ప డింది. అక్కడిక్కడే మృతిచెందింది. చు ట్టుపక్కల రైతులు వచ్చారు. ఇంటి వద్దనున్న ఆమె భర్తకు చెప్పారు. వీరికి కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఎదుళ్లచెరువు క్రాస్ రోడ్డులో రైతు...
తిరుమలాయపాలెం: ఓ రైతు ప్రాణాలను పిడుగు బలిగొంది. మండలంలోని పిండిప్రోలు పంచాయతీ పాపాయిగూడెం గ్రామ రైతు ఏలూరి వీరయ్య(72), బుధవారం ఉదయం తన గేదెలను మేపేందుకు చేల వద్దకు వెళ్లాడు. సాయంత్రం 4.00 గంటల సమయంలో ఒక్కసారిగా కారుమబ్బులు కమ్ముకున్నాయి. ఉరుములు, మెరుపులతో వర్షం మొదలైంది. వేప చెట్టు కిందనున్న బండపై కూర్చున్నాడు. అతనితోపాటు మరో రైతు రామనబోయిన శ్రీను కూడా అక్కడకు వచ్చాడు. కొద్దిసేపటి తరువాత, విద్యుత్ మోటార్‌పై పట్టా కప్పేందుకని రామనబోయిన శ్రీను లేచాడు. కొన్ని అడుగుల దూరం వెళ్లాడో లేదో... కళ్లు బైర్లు కమ్మేలా, చెవులు చిల్లులు పడేలా పెద్ద మెరుపు, భీకర శబ్దంతో వేప చెట్టు సమీపంలో పిడుగు పడింది.
శ్రీను తన రెండు చెవులను గట్టిగా మూసుకున్నాడు. అసలేం జరిగిందో కొన్ని క్షణాల వరకు అతనికి అర్థమవలేదు. ఆ తరువాత తేరుకున్నాడు. చెట్టు కిందనున్న వీరయ్య వైపు చూశాడు. దగ్గరగా వెళ్లాడు. ఆయన శరీరంపై చొక్కా, పంచె కాలిపోయి కనిపించాయి. అచేతనంగా పడిపోయిన వీరయ్య వద్దకు వెళ్లాడు. చేతులు, కాళ్లు రుద్దాడు. శ్వాస ఆడడం లేదు. వీరయ్య ప్రాణాలు పోయాయి. పాపాయిగూడెం గ్రామంలోకి వెళ్లి విషయం చెప్పాడు. అందరూ వచ్చారు. వీరయ్య మృతదేహంపై పడి కుటుంబీకులు భోరున విలపించారు. వీరయ్యకు భార్య బుచ్చమ్మ, కుమారులు శ్రీనివాసరావు, సిద్ధార్థ ఉన్నారు. మరో కుమారుడు కృష్ణ, కొన్నేళ్ల క్రితం మృతిచెందాడు. ప్రమాద స్థలాన్ని ఎస్‌ఐ సర్వయ్య పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తెట్టెలపాడులో రైతు...
తిరుమలాయపాలెం: మండలంలోని తెట్టెలపాడు గ్రామంలో పిడుగుపాటుతో రైతు మృతిచెందాడు. ఈ గ్రామ రైతు పుసులూరి లక్ష్మీనారాయణ(55), గేదెలను మేపేందుకు బుధవారం బీడు భూమికి వెళ్లాడు. సాయంత్రం ఉరుములు, మెరుపులతో వర్షం మొదలవడంతో చెట్టు కిందకు వెళ్లాడు. సరిగ్గా ఆ చెట్టు పైనే పిడుగు పడింది. అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. సాయంత్రం వరకు లక్ష్మినారాయణ ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు బీడు భూముల వద్దకు వెళ్లారు. అక్కడ ఓ చెట్టు కింద విగతుడిగా లక్ష్మినారాయణ కనిపించాడు. బోరున విలపిస్తూ, మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. ఆయనకు భార్య నర్సమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసును ఎస్‌ఐ సర్వయ్య దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment