క్రికెట్ ఆడిన మైదానం ఇదే, (ఇన్‌సెట్‌లో) రోదిస్తున్న బంధువులు
చిట్టి చిట్టి పాదాలతో నా గుండెలపై గెంతుతుంటే పులకరించిపోయానే.. ఆట వచ్చినా రాకున్నా ఒకరికి మించి ఒకరు ఆడేందుకు పోటీ పడుతుంటే వారి పట్టుదల చూసి సంబరపడ్డానే.. చిచ్చర పిడుగుల్లా ఆటలో చెలరేగుతుంటే వారి ప్రతిభ చూసి ముసిముసిగా నవ్వుకున్నానే.. భగవంతుడా..! మాయదారి పిడుగు ఇక్కడే పడాలా. నిండా 20 ఏళ్లు కూడా నిండలేదు కదయ్యా.. నా ఎదలోతులను చీల్చినా భరించేదాన్నే.. నా చెంత ఆడుకునే బిడ్డలను నిలువునా చిదిమేశావు.. ఆటాడేందుకు నాపై నిలిపిన ఈ రాళ్లు.. మళ్లీ బిడ్డల పాదాల చప్పుడు ఎక్కడ అంటూ ప్రశ్నిస్తుంటే పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఎలా ఆపుకోవాలి. బిడ్డల తల్లిదండ్రుల గర్భశోకానికి ఏమని సమాధానం చెప్పాలి. వారి గుండెల్లో బాధాగ్నిని ఏ వర్షపు చుక్క ఓదార్చాలి.– మైదానం ఆత్మఘోష
అమరావతి, గురజాల: కూలీనాలీ చేసుకుని పొట్టపోసుకునే తమ బిడ్డలతో విధి ఆటాడుకుందని ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. గురజాల మండలం సమాధానం పేటలో పిడుగుపడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మేరాజోత్ దేవానాయక్, భూలక్ష్మిల కుమారుడు మనోహర్ నాయక్ నాయనమ్మ సైదమ్మ వద్ద ఉండి చదువుకుంటాడు. తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చి వెళ్లిపోయాడు. బోజావత్ హనుమంతు నాయక్, కోటమ్మల కుమారుడు శ్రీహరి నాయక్ చిన్నబ్బాయి. కుమారుడి మృతితో ఆ తల్లిదండ్రులు విలవిలలాడుతున్నారు. మూడవత్ సేవా నాయక్, అంజలి భాయ్ దంపతులకు కుమారుడు పవన్ నాయక్. వేసవి సెలవులు కావడంతో అమ్మమ్మ ఇంటికి వచ్చి విగతజీవిగా మారాడు.
Comments
Please login to add a commentAdd a comment