మొన్నటి సోమవారం.. వేకువజాము నుంచే ఉరుములు.. మెరుపులు.. ఈదురుగాలులతో భారీ వర్షం. మధ్యలో భారీ శబ్దాలు.. అకస్మాత్తుగా ఇళ్ల మధ్యలో ఉన్న ఓ చెట్టు నుంచి మంటలు.. ఆ రోజు మనమంతా చాలా భయాందోళనకు గురయ్యాం కదా.. వర్షాకాలంలో పిడుగు పాటుకు గురై మనుషులు, మూగజీవాలు ప్రాణాలు కోల్పోతుంటాయి. చెట్లు కాలిపోతుంటాయి. మరి.. పిడుగులు పడితే మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదు.? అసలు.. ఈ పిడుగులేమిటి? వాటి కథేంటి?
ఏయూక్యాంపస్(విశాఖ తూర్పు): పిడుగును అర్థం చేసుకోవాలంటే ముందుగా ఉరుము.. మెరుపు గురించి తెలుసుకోవాలి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు నీటి ఆవిరిపైపైకి ప్రయాణించి.. మేఘాలుగా మారతాయని మనకు తెలుసు. ఇవి కొన్ని వేల అడుగుల ఎత్తు వరకూ వివిధ స్థాయిల్లో ఉంటాయి. సూర్యకిరణాల వల్ల మేఘాల పైభాగంలో కొన్ని ధనావేశిత కణాలు ఏర్పడుతుంటాయి. ఇతర కణాల కంటే తేలికగా ఉండటం వల్ల ఇవి మేఘాల పైభాగంలో పోగుబడితే.. బరువైన రుణావేశిత కణాలు దిగువకు వస్తుంటాయి. మామూలుగానైతే.. వ్యతిరేక ఆవేశాలు ఉన్న కణాలు పరస్పరం ఆకర్షితమై ఒక దగ్గరకు చేరాలి కానీ.. మేఘాల దిగువన గాలి కదిలే వేగానికి లేదా ఇతర కారణాల వల్ల రెండింటి మధ్య అంతరం కొనసాగుతుంటుంది. ఈ క్రమంలోనే మేఘాల దిగువన ఉన్న రుణాత్మక కణాలు(ఎలక్ట్రాన్లు) దగ్గరలో ఉన్న వస్తువు వైపు ప్రయాణిస్తాయి.
మరోవైపు భూమి ఉపరితలంపై ఉండే పొడవాటి నిర్మాణాల (విద్యుత్ స్తంభాలు, ఎత్తైన భవనాలు వంటివి) నుంచి ధనావేశిత కణాలు పైపైకి వెళుతుంటాయి. వేడిగా ఉండే ఈ కణాలు రుణావేశిత కణాలను కలిసినప్పుడు అప్పటి వరకు మేఘాల్లో గుమికూడిన ఎలక్ట్రాన్లు మొత్తం ఒక్కసారిగా విడుదలవుతాయి. ఈ విద్యుత్తే పిడుగు పాటు. ఈ సమయంలో ఉత్పత్తి అయ్యే వేడి కారణంగా చుట్టూ ఉన్న గాలి స్వల్ప సమయంలో వేడెక్కుతుంది. వ్యాకోచిస్తుంది. అంతలోనే చల్లగా మారిపోతుంది కూడా. అకస్మాత్తుగా జరిగే ఈ మార్పులే శబ్దంగా అంటే ఉరుముగా మనకు వినిపిస్తుంది.
మేఘాల నుంచి పడే పిడుగుల్లో కోట్ల వోల్టుల విద్యుత్ ఉంటుంది. ఇవి చెట్లను, జీవులను కాల్చిబూడిద చేసేటంత శక్తిని కలిగి ఉంటాయి. సముద్రం కంటే నేలపైనే అధికంగా పిడుగులు పడుతుంటాయి. పిడుగులు మూడు రకాలుగా ఉంటాయి. మెదటిది హీట్ లైట్నింగ్, రెండోది డ్రై లైట్నింగ్. వీటి కారణంగా అడవుల్లో మంటలు చెలరేగుతాయి. మూడోది బాల్ లైట్నింగ్‌గా వ్యవహరిస్తారు. ఫొటోగ్రఫీతో పిడుగు ఏ రకానికి చెందినది అనేది గుర్తించడం సాధ్యపడుతుంది. తొలిసారిగా 1847లో థామస్ మోరిస్ ఈస్టర్లీ అనే వ్యక్తి వీటిని గుర్తించాడు. (క్లిక్: మాములుగా లేదు మరి.. షిప్ లోపల ఓ లుక్కేయండి..)
జాగ్రత్తలు తప్పనిసరి
► ఉరుములు, మెరుపులు వస్తున్న సమయంలో భవనాలు, ఇంట్లో ఉండటం ఎంతో మంచిది. మూడు.. అంతకంటే ఎక్కువ చక్రాలు ఉన్న వాహనాల్లో ప్రయాణిస్తే వాటిలోనే ఉండిపోవాలి.
► పొలాల్లో పనిచేసే రైతులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి.
► నేల పొడిగా ఉన్న ప్రాంతంలో ఆశ్రయం పాందాలి.
► చెట్ల కిందకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లరాదు. చెట్లు పిడుగును ఆకర్షించే గుణాన్ని కలిగి ఉంటాయి.
► ఇంట్లో టీవీ, రిఫ్రిజిరేటర్, ఏసీ వంటివి ఆపేయాలి. లేని పక్షంలో పిడుగు పడినప్పుడు అధిక విద్యుత్ ప్రసరించి అవి దెబ్బతినే అవకాశం ఉంటుంది.
► నీళ్లలో ఉంటే వెంటనే బయటపడాలి. నీరు మంచి విద్యుత్ వాహకమన్నది తెలిసిన విషయమే.
► ఉరుములతో కూడిన వర్షం పడుతుందనే సమాచారం ఉన్నప్పుడు బయటకు వెళ్లకపోవడమే మంచిది.
► స్మార్ట్‌ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు వాడరాదు.
► ప్రతి మెరుపుకూ పిడుగు పడదు కానీ.. సురక్షిత ప్రాంతంలో ఉంటే అక్కడి నుంచి వెంటనే మరో చోటుకు వెళ్లొద్దు.
► గుంపులుగా ఉండటం కంటే..విడిపోయి దూర దూరంగా ఉండటం మంచిది.
► పిడుగులు పడుతున్న సందర్భంలో నీటి కుళాయిల వినియోగం, స్నానం చేయడం, గిన్నెలు కడగడం వంటివి నిలిపివేయాలి. పైపులు, పాత్రల నుంచి అధిక విద్యుత్ ప్రవహించే అవకాశం ఉంది.
► పిడుగు బారిన పడిన వారిని ముట్టుకోవడం వలన ఎటువంటి నష్టం జరగదు. వారికి వెంటనే ప్రథమ చికిత్స అందించాలి.
క్యుములోనింబస్ మేఘాలు ప్రమాదం
క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడిన ప్రదేశంలో పిడుగులు పడే అవకాశాలు అధికంగా ఉంటాయి. సాధారణ మేఘాలకు వర్టికల్ వేగం సెకనుకు సెంటీమీటరుగా ఉంటే, క్యుములోనింబస్ మేఘాలకు వర్టికల్ స్పీడ్ సెకను మీటర్లుగా ఉంటుంది. (క్లిక్: మామిడి తాండ్ర.. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది..)
ఉష్ణమండల ప్రాంతాల్లో అధికం
ఉష్ణ మండల ప్రాంతాల్లో అధికంగా పిడుగులు పడే అవకాశం ఉంటుంది. డాప్లర్ రాడార్ సహాయంతో పిడుగులను ముందస్తుగా గుర్తించి, ప్రజలను అప్రమత్తం చేయడం సాధ్యపడుతుంది. ప్రాణనష్టాన్ని నివారించే సాంకేతికత నేడు అందుబాటులో ఉంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తోంది.
– ఆచార్య ఓ.ఎస్.ఆర్.యు భానుకుమార్, వాతావరణశాస్త్ర విభాగం, ఏయూ
Comments
Please login to add a commentAdd a comment