ఒకప్పుడు చత్వారం అంటే నలభై ఏళ్లు దాటిన తర్వాత మొదలయ్యేది. హ్రస్వదృష్టి, దూరదృష్టి వంటి సమస్యలకు కళ్లద్దాలు వాడాల్సి వచ్చేది. ఇప్పుడు చిన్న వయసులోనే కంటి సమస్యలు మొదలవుతున్నాయి. నూటికి పదిమంది కళ్లద్దాల అవసరం ఉన్న రోజుల స్థానంలో నూటికి యాభై మందికి కళ్లజోళ్లు దేహంలో భాగమైపోతున్నాయి. పిల్లలకు ప్రైమరీ స్కూల్‌లో ఉండగానే కళ్లజోళ్లు వచ్చేస్తున్నాయి.
అప్పుడు తప్పించుకున్న పిల్లలకు కార్పొరేట్ ఇంటర్మీడియట్ విద్య కళ్లద్దాల అవసరాన్ని కల్పిస్తోంది. ఈ పరిస్థితికి ప్రధాన కారణం పోషకాహారలోపం, కంటికి వ్యాయామం లేకపోవడమే. సైట్ వచ్చిన తరువాత బాధపడడం కన్నా రాకుండా కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. సైట్ వచ్చిన వారికి, భవిష్యత్తులో సైట్ రాకుండా కళ్ళను కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తినవలసిన ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. కళ్లను కాపాడుకుందాం.
వ్యాయామం ఇలా..
వ్యాయామం శరీరానికి ఎంత అవసరమో కంటికి కూడా అంతే అవసరం. రోజూ కొద్ది సేపు కంటి వ్యాయామాలు చేయడం వలన కంటి చూపు వృద్ధి చెందుతుంది. పక్కనున్న ఫొటోను పరిశీలించండి.
1. తలను, మెడను నిటారుగా ఉంచి... కుడివైపుకు, ఎడమవైపుకు చూడాలి.
2. ఇంటి పై కప్పును, నేలను చూడాలి. ఇలా చేస్తున్నప్పుడు కనుగుడ్డు మాత్రమే కదలాలి. తలను పైకెత్తకూడదు, కిందకు దించకూడదు.
3. వలయాకారంగా క్లాక్‌వైజ్, యాంటీ క్లాక్‌వైజ్‌గా తిప్పాలి.
4. దూరంగా ఉన్న వస్తువు మీద పది సెకన్లపాటు దృష్టి కేంద్రీకరించాలి.
5. ఆ తర్వాత ఐ మూలగానూ, దానికి వ్యతిరేక దిశలోనూ చూడాలి.
6. ముక్కు కొనను చూడాలి. ఈ ప్రక్రియ మొత్తానికి రెండు నిమిషాలు కూడా పట్టదు. ఇలా రోజులో ఎన్నిసార్లయినా చేయవచ్చు. ముఖ్యంగా కంప్యూటర్ స్క్రీన్ ఎక్కువ సేపు చూసేవాళ్లు గంటకోసారి చేయవచ్చు.
వీటిని తిందాం!
మన శరీరంలో ఏదైనా అనారోగ్యం కలిగిందంటే దానికి ముఖ్య కారణం పోషకాల లోపం కూడా కారణం అవ్వచ్చు. అలాగే ఈ కంటి చూపుకు కూడా. కావలసినన్ని విటమిన్లు, పోషకాలు అందకపోతే కంటి చూపు మందగిస్తుంది. కాబట్టి కంటి చూపును మెరుగుపరిచే ఆహారాలను తెలుసుకుందాం. ఇవన్నీ మనకు సులువుగా దొరికేవే. మునగ ఆకులలో విటమిన్ – ఎ, కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. వీటి ఆకులను పప్పుతో కలిపి వండుకుని తింటే చాలా మంచిది. ఇతర ఆకుకూరల్లో పొన్నగంటి, మెంతికూర, తోటకూరలను వారంలో కనీసం రెండుసార్లయినా తీసుకోవాలి. విటమిన్ – సి ఎక్కువగా ఉండే నిమ్మ, నారింజ, ద్రాక్ష, స్ట్రాబెర్రీ బాగా తీసుకోవాలి. ఇవి కంటికి మాత్రమే కాదు చర్మానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. వీటితో పాటుగా చేపలు, గుడ్లు, బాదం పప్పు, పాలు, పాల ఉత్పత్తులు, క్యారెట్లు, చిలకడదుంపలు వీటన్నిటిలోను విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment