పిడుగులు పడటంతో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు
Published Thu, Sep 12 2013 12:17 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
జిల్లాలో వేర్వేరు చోట్ల పిడుగులు పడటంతో బుధవారం నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు.. చేనులో పనులు చేస్తుండగానే జోరువాన, ఉరుములు, మెరుపులతో కూడిన శబ్దం రావడం, ఒక్కసారిగా
పిడుగు పడటంతో చేనులోనే విగతజీవులుగా మారారు..! సారంగాపూర్ మండలం జామ్‌లో దంపతులు
ఎనుగంటి బొర్రన్న(45)-ముత్తవ్వ(40), ఆదిలాబాద్ మండలం లాండసాంగ్వి గ్రామానికి చెందిన మ్యాకల కళ(38) ఆమె భర్త, కొడుకు చూస్తుండగానే కన్నుమూశారు.. జైనథ్ మండలం సావాపూర్ గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థి పాటిల్ గౌతమ్(22) తల్లి చూస్తుండగానే ప్రాణాలు వదిలారు..
సారంగాపూర్/ఆదిలాబాద్ రూరల్/జైనథ్ : సారంగాపూర్ మండలం జామ్ గ్రామానికి చెందిన ఎనుగంటి బొర్రన్న(45), ఆయన భార్య ముత్తవ్వలు బుధవారం సాయంత్రం తమ చేనులో పిడుగు పాటుకు గురై మృతిచెందారు. వీరితోపాటు వారు అపురూపంగా పెంచుకుంటున్న గొర్రె కూడా మృతిచెందింది. జామ్ గ్రామానికి చెందిన ముత్తన్న-సాయమ్మ దంపతులకు ఏకైక కుమారుడైన బొర్రన్నకు ఇరవై ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి సంతానం లేదు. అయినా తల్లిదండ్రులను చూసుకుంటూ అన్యోన్యంగా జీవిస్తున్నారు.
ఈ నేపథ్యంలో బుధవారం కూడా రోజూ మాదిరిగానే దంపతులిద్దరూ తమకున్న ఎకరం పత్తి చేనులో క లుపు తీయడానికి వెళ్లారు. సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురియడంతో వారితోపాటే గొర్రెను వెంట బెట్టుకుని చేను దగ్గరే ఉన్న చింతచెట్టు కిందకు వెళ్లారు. వర్షం జోరందుకోవడం.. పిడుగు పడటంతో బొర్రన్న, ముత్తవ్వ అక్కడికక్కడే చనిపోయారు. గొర్రె కూడా మృతిచెందింది. స్థానికుల సమాచారం మేరకు తహశీల్దార్ గంగాధర్, ఆర్‌ఐ పాండు, వీఆర్వో సురేందర్ సంఘటనా సందర్శించి వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం చేయించాలని ఏఎస్సై భూమన్నకు సూచించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గుండెలవిసేలా రోదించిన వృద్ధ దంపతులు
ముత్తన్న, సాయమ్మలకు ఒక్కడే కుమారుడు కావడం, వీరికి పిల్లలు లేకపోవడంతో ఇద్దరు వృద్ధ దంపతులు దిక్కులేని వారయ్యారు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో గుండెలవిసేలా రోదించారు. తమకు తలకొరివి పెట్టేవారెవరని రోదించిన తీరు గ్రామస్తులను కంట తడి పెట్టించింది. వృద్ధాప్యంలో ఆదుకుంటాడనుకున్న కొడుకు అర్ధాంతరంగా చనిపోవడం తో ‘దేవుడా నీకేం పాపం చేశాం.. వారికి పిల్లల ను ఇవ్వలేదు. ఇప్పుడు మేమెందుకు బతకాలి’ అంటూ రోదించిన తీరు కలచివేసింది.
భార్య మృతి.. భర్తకు గాయాలు..
ఆదిలాబాద్ మండలం లాండసాంగ్వి గ్రామానికి చెందిన మ్యాకల కళ, ఈమె భర్త స్వామి, వీరి కుమారుడు వినోద్, దూరపు బంధువు రాంసం సుశీల బుధవారం ఉదయం పత్తి చేను పనులకు వెళ్లారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కలుపు మొక్కలు విపరీతంగా పెరిగాయి. వీటిని మధ్యాహ్నం 2 గంటల వరకు ఏరివేశారు. అనంతరం అందరూ కలిసి మూడు గంటల వరకు భోజనం చేసి మళ్లీ పనుల్లో నిమగ్నమయ్యారు. నాలుగు గంటలకు వర్షం మొదలైంది.
ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తూ పిడుగు పడింది. దీంతో చేనులోనే కళ అక్కడికక్కడే మృతిచెందింది. స్వామి, సుశీలకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ సమయంలో వినోద్ గడ్డిమోపు కోసం వెళ్లడంతో ప్రమాదం తప్పింది. వినోద్ ఒక్కసారిగా బీతావాహ దృశ్యాన్ని చూసి నిశ్చేష్టుడు అయ్యాడు. తల్లి మరణించడాన్ని జీర్ణించుకోలేక పోతున్నాడు. ఆయన రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. కళ కూలీ పనిచూస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. గాయపడ్డ వారిని జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. దీంతో లాండసాంగ్వి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
చేను పనులకు ఆసరాగా వెళ్లిన డిగ్రీ విద్యార్థి మృతి
జైనథ్ మండలం సావాపూర్ గ్రామానికి చెందిన త్రయంబక్-రేవతిలకు ఇద్దరు కుమారుడు, ఒక కూతురు ఉంది. పెద్ద కుమారుడు రతన్ ఐకేపీ లో జైనథ్‌లో సీఏగా పనిచేస్తున్నాడు. కూతురు ప్రతిభ ఇంటర్ చదువుతోంది. చిన్నవాడైన గౌ తం ఆదిలాబాద్‌లో డిగ్రీ చదువుతున్నాడు. తల్లిదండ్రులకు పొలం పనుల్లో సహాయంగా ఉం టాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం తల్లి, ముగ్గురు కూలీలతో కలిసి ఆకుర్ల గ్రామ శివార్లలోని తాము కౌలుకు తీసుకున్న చేనులో కలుపు మొక్కలు తీయడానికి వెళ్లాడు. సాయంత్రం నా లుగు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా జోరువాన కురిసింది.
దీంతో మేఘాలు కమ్ముకోవడంతో వారంతా దగ్గరలో ఉన్న చెట్ల కిందికి పరుగెత్తారు. రేవతి, ముగ్గురు కులీలు ఒక చెట్టు కింద నిలబడగా, గౌతమ్ ఒక్కడే కొంత దూరం లో ఉన్న మోతుకు చెట్టు కింద తలదాచుకున్నా డు. నాలుగున్నరకు ఒక్కసారిగా పిడుగు పడి గౌతమ్ అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. అతని సెల్ ముక్కలవగా, బట్టలు, శరీరం కాలి పోయాయి. పక్కనే ఉన్న తల్లి, కూలీలు ఏమైం దని తేరుకునే లోపే గౌతమ్ తుదిశ్వాస విడిచాడు. కూలీలు బిగ్గరగా అరుస్తూ పరుగెత్తారు. తల్లి కొడుకు మృతదేహంపై రోదించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది. అంతలోనే స్పృహ కోల్పోయింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఏఎస్సై గంగారాం సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు తేలిపారు.
Advertisement
Advertisement