
గురువారం నగరంలో కురిసిన వర్షానికి నీట మునిగిన తాడ్‌బండ్ రహదారి
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంపై గురువారం క్యుములోనింబస్ మేఘాలు విరుచుకుపడ్డాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో రెండు గంటల పాటు బీభత్సం సృష్టించాయి. క్యుములోనింబస్ మేఘాలు దట్టంగా ఆవహించడంతో మధ్యాహ్నమే కారుచీకట్లు అలుముకున్నాయి. గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల మధ్య నగరంలోని చాలా ప్రాంతాల్లో గంటకు 80 కిలోమీటర్లకుపైగా వేగంతో ఈదురుగాలులు వీచాయి. ఈ గాలుల ధాటికి చెట్లు, కొమ్మలు విరిగిపడ్డాయి. హోర్డింగులు నేలకూలాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతోపాటు కొన్ని చోట్ల విద్యుత్ తీగలు తెగిపడటంతో కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో రహదారులు, కాలనీలు నీట మునిగాయి. ఎల్బీనగర్, బేగంపేట తదితర ప్రాంతాల్లో స్వల్ప పరిమాణంలో ఉన్న వడగళ్లు కురిశాయి. సుమారు 200 వాటర్‌లాగింగ్ పాయింట్ల వద్ద మోకాళ్లలోతున వరదనీరు నిలిచింది. రెండు గంటల్లో సగటున 2 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టుగా వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. మొత్తం గా 3 సెం.మీ. వాన పడిందని అంచనా.
స్తంభించిన ట్రాఫిక్
ప్రధాన రహదారులపై హోర్డింగ్‌లు, చెట్లు కూలిపడటం, రహదారులపై వర్షపు నీరు నిలవడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఉద్యోగులు, మహిళలు, ప్రయాణికులు, వాహన చోదకులు గంటల తరబడి ట్రాఫిక్‌లో వేచి ఉండాల్సి వచ్చింది. ఖైరతాబాద్‌లో రైల్వే విద్యుత్ లైన్‌పై హోర్డింగ్ ఫ్లెక్సీ చిరిగి పడింది. దానిని గమనించిన లోకో పైలట్ రైలును నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది.
గాలివానకు కారణాలివే..
విదర్భ–ఛత్తీస్‌గఢ్–తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనం ఆవహించి.. ఉపరితల ద్రోణి ఏర్పడటంతోపాటు బంగాళాఖాతం మీదుగా వీస్తున్న తేమగాలుల కారణంగా క్యుములోనింబస్ మేఘాలు ఉధృతంగా ఏర్పడి గాలివాన కురిసిందని బేగంపేటలోని వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త రాజారావు వెల్లడించారు. దాదాపు రెండు గంటల వ్యవధిలోనే నగరంలో గాలివాన బీభత్సం సృష్టించిందన్నారు. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుండటం, గాలిలో తేమ అధికంగా ఉండటంతో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడతాయని తెలిపారు. వచ్చే 24 గంటల్లోనూ హైదరాబాద్‌లో అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని.. గాలివాన బీభత్సం సృష్టించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
గాలివాన బీభత్సం ఇలా..
- అబిడ్స్ పరిధిలోని జియాగూడ, పురానాపూల్ చౌరస్తా, జుమ్మెరాత్ బజార్, పాన్‌మండీ, గోషామహాల్ రహదారి, బారాదరి, హిందీ నగర్, గోషామహాల్ చౌరస్తా, మాలకుంట, ఎంజే మార్కెట్ తదితర ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్లు నేలకూలడంతో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. పాన్‌మండీ నుంచి గోషామహాల్ చౌరస్తా వరకు పోలీస్ క్వార్టర్స్ దారిలో ఉన్న చెట్లు విరిగిపడడంతో హిందీ నగర్ రహదారి పూర్తిగా స్తంభించిపోయింది. అలాగే ఇదే ప్రాంతంలోని భారీ చెట్టు కూలిపడటంతో ఓ ఇంటి ప్రహరీగోడ ధ్వంసమైంది. హిందీ నగర్ రహదారిలో పెద్ద చెట్టు విరిగిపడడంతో ఒక ఆటో ట్రాలీ ధ్వంసమైంది.
- కార్ఖానాలో పరిధిలోని వాసవినగర్ సమీపంలోని పద్మజకాలనీ నీట మునిగింది. రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో కాలనీ వాసులు ఇబ్బందులకు గురయ్యారు. గృహలక్ష్మి కాలనీలో మోకాళ్ల లోతు నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. నాలుగో వార్డు బుసారెడ్డిగూడ, పికెట్‌లో పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
- మారేడుపల్లి పరిధిలో ప్రధాన రహదారులు వర్షపు నీటిలో మునిగిపోయాయి. కాలనీ వాసులే మ్యాన్ హోల్స్ మూతలను తెరిచి నీటిని పంపించారు.
- పాత బస్తీలోని ఇంజన్‌బౌలి, ఫలక్‌నుమా, భవానీనగర్, జంగంమెట్ తదితర ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. దాంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. జంగంమెట్ వార్డు కార్యాలయానికి ఎదురుగా పెద్ద చెట్టు రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ఇంజన్‌బౌలిలో చెట్టు కూలిపడటంతో ఒక ఆటో, చెరుకు రసం బండి ధ్వంసమయ్యాయి.
- సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఆస్పత్రి, మెడికల్ కాలేజీల ప్రాంగణాల్లోని చెట్లు నేలకూలాయి. అత్యవసర విభాగం వద్ద భారీ వృక్షం విరిగి పక్కనే ఉన్న పోలీసు ఔట్‌పోస్ట్‌పై పడింది. ఎటువంటి ప్రాణాపాయం కలగలేదు.
- ఈసీఐఎల్ చౌరస్తా, హెచ్‌బీకాలనీ రాజీవ్ పార్కు సమీపంలోని రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయి చెరువులను తలపించాయి.
బండ్లగూడలో 4.3 సెంటీమీటర్లు
క్యుములోనింబస్ మేఘాల కారణంగా గురువారం నగరంలోని బండ్లగూడ ప్రాంతంలో అత్యధికంగా 4.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముషీరాబాద్‌లో 3.5, నారాయణగూడలో 3.4, రాజేంద్రనగర్‌లో 3.1 సెంటీమీటర్ల వర్షం పడింది.
గాలివానకు ఇద్దరు బలి..
గురువారం ఉరుములు మెరుపులతో కురిసిన గాలివాన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముగ్గురిని బలితీసుకుంది. ఇక్కడి చంపాపేట డివిజన్ కర్మన్‌ఘాట్ ప్రాంతంలోని అంజిరెడ్డినగర్‌కాలనీకి చెందిన ఇంద్రావత్ అఖిల్ (7) గురువారం మధ్యాహ్నం సమీపంలోని చింతచెట్టుకు ఉయ్యాల కట్టుకుని ఊగుతున్నాడు. ఆ సమయంలో పిడుగు పడటంతో మృతి చెందాడు. ఇక ఆరాంఘర్ ప్రాంతంలో ఈదురు గాలుల తీవ్రతకు ఓ పాత ఇనుప సామాను గోదాం గోడ కూలడంతో పరశురాం అనే వ్యక్తి మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గా>యపడ్డారు. ముషీరాబాద్ నియోజకవర్గం గా«ంధీనగర్ డివిజన్‌లోని వి.వి.గిరి నగర్‌లో గాలివాన బీభత్సానికి రేకుల షెడ్డు కూలిపడి.. పి.డానియేల్ (50), ఆయన ఇద్దరు కుమారులు దీపక్ (13), చరణ్ (9)లు గాయపడ్డారు. పక్కనే మరో ఇంటిపై ఉన్న రేకుల షెడ్డు కూలడంతో మురుగన్‌రెడ్డి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
మూడు రోజుల పాటు వర్షాలు
రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా, విదర్భ ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం నెలకొని ఉందని.. అటు విదర్భ నుంచి కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి నెలకొని ఉందని పేర్కొంది. వీటి కారణంగా తెలంగాణలో శుక్రవారం ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వడగళ్ల వర్షాలు పడే అవకాశముందని వెల్లడించింది. శని, ఆది వారాల్లో మాత్రం తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment