
సిటీ మొత్తం.. చీకటి మయం!
గురువారం అర్ధరాత్రి 3.30 గంటల నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు విపరీతమైన గాలి.. జోరు వాన. దీంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా అల్లకల్లోలం అయిపోయింది. ఈదురుగాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో విద్యుత్ సరఫరా వ్యవస్థ మొత్తం కుప్పకూలింది. పెద్దపెద్ద చెట్లు కూడా కూకటివేళ్లతో లేచిపోయాయి. పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగి.. విద్యుత్ లైన్లపై పడటంతో ఎక్కడికక్కడ ఫీడర్లు ట్రిప్పైపోయాయి. ఫలితంగా శుక్రవారం రాత్రి 3.30 గంటల నుంచి తెల్లవారే వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పూర్తిగా చీకట్లు రాజ్యమేలాయి. ఉదయం 8.30 గంటల వరకు 60 శాతం ఫీడర్ల పరిధిలో సరఫరాను పునరుద్ధరించగా, మరో 40 శాతం ఫీడర్ల పరిధిలో సాయంత్రం ఐదు గంటల వరకు కూడా విద్యుత్ సరఫరా లేదు.
రోజంతా కరెంటు లేక మంచినీటి సరఫరా నిలిచిపోయింది. చాలాచోట్ల హాస్టళ్లలో కూడా ఓవర్ హెడ్ ట్యాంకులలో నీళ్లు లేకపోవడంతో స్నానాలు, కాలకృత్యాలకు కూడా తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అపార్టుమెంట్లలో లిఫ్టులు పనిచేయకపోవడంతో.. ఫ్లాట్లలో, ముఖ్యంగా పై అంతస్తులలో ఉండేవాళ్లు తీవ్ర ఇబ్బంది పడాల్సి వచ్చింది. స్నానం చేయడానికి నీరు కూడా లేక చాలామంది ఆఫీసులకు సెలవులు పెట్టి ఇంటికే పరిమితం అయ్యారు. ఛార్జింగ్ లేక సెల్‌ఫోన్లు మూగపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో వినియోగదారులకు అందుబాటులో ఉండాల్సిన ట్రాన్స్‌కో డీఈ, ఏడీఈ, ఏఈ, లైన్‌మెన్‌లు సెల్‌ఫోన్‌లు స్విచాఫ్ చేసుకున్నారు. 1912 కాల్ సెంటర్‌కు ఫోన్ చేస్తే ఎంగేజ్ వచ్చింది.
పడిపోయిన డిమాండ్
ఈదురుగాలి దెబ్బకు గచ్చిబౌలి, రామచంద్రాపురం, మాదాపూర్, ఆసిఫ్‌నగర్, శివరాంపల్లి, బాలానగర్, మియాపూర్‌లోని 220 కేవీ లైన్లు హ్యాంగై సరఫరా నిలిచిపోగా, మరికొన్ని చోట్ల భద్రత కోసం అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
అంతటా సమన్వయ లోపం
ట్రాన్స్‌కో, డిస్కం అధికారులకు మధ్య సమన్వయ లోపం వినియోగదారుల పాలిట శాపంగా మారింది. 400 కేవీ, 220 కేవీ, 132 కేవీ సబ్‌స్టేషన్లు, లైన్లను ట్రాన్స్‌కో చూస్తుండగా, 33 కేవీ, 11 కేవీ లైన్లను డిస్కం చూస్తుంది. అనుకోని విపత్తులు సంభవించినప్పుడు రెండు శాఖలు సమన్వయంతో వ్యవహరించాలి. కానీ వారి మధ్య సమన్వయ లోపం శుక్రవారం స్పష్టమైంది.