
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఒకపక్క గరిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతుండగా మరోవైపు అకాల వర్షాలకు దారితీసే పరిస్థితులేర్పడ్డాయి. సోమవారం కోస్తాంధ్రలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశమున్నట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం రాత్రి విడుదల చేసిన నివేదికలో తెలిపింది.
అలాగే రానున్న మూడు రోజులు కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు గాని, వర్షం గాని కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో ఆదివారం అత్యధికంగా రెంటచింతలలో 42.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా తిరుపతి, నందిగామల్లో 41, విజయవాడ, కర్నూలు, అనంతపురం, నెల్లూరుల్లో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.