వర్షాలకు ఇక విరామం.. | Another break for the rains | Sakshi
Sakshi News home page

వర్షాలకు ఇక విరామం..

Published Sat, Jan 13 2024 5:24 AM | Last Updated on Sat, Jan 13 2024 9:01 AM

Another break for the rains - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ సహా దక్షిణాది రాష్ట్రాల నుంచి మరికొద్ది రోజుల్లోనే ఈశాన్య రుతు­పవనాలు  ఉపసంహరించుకోనున్నాయి. ఈనెల 15కల్లా వీటి సీజను పూర్తిగా ముగియనుంది. దీంతో వర్షాలకు విరామం దొరకనుంది. ఫలితంగా కొద్దిరోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం కొన­సా­గనుంది. నిజానికి.. అక్టోబరు నుంచి డిసెంబరు వరకు ఈశాన్య రుతుపవనాల సీజనుగా పరిగ­ణి­స్తారు. ఏటా అక్టోబరు 18–22 తేదీల మధ్య ఈశా­న్య రుతుపవనాలు తమిళనాడులోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత రెండుమూడ్రోజుల్లో రాష్ట్రంలోకి విస్తరి­స్తాయి.

అయితే, ఈ ఏడాది ఈశాన్య రుతుపవ­నాలు నిర్ణీత సమయాని కంటే వారం రోజులు ఆలస్యంగా ప్రవేశించాయి. కానీ, అరకొర వర్షాలను మాత్రమే కురిపించాయి. అక్టోబరు నుంచి డిసెంబరు వరకు మూడునెలల్లో రాష్ట్రంలో 287.2 మి.మీల వర్షపాతం నమోదు కావలసి ఉండగా 219 మి.మీల వర్షపాతం మాత్రమే రికార్డయింది. అంటే.. సాధారణం కంటే 24 శాతం తక్కువ వర్షం కురిసిందన్న మాట. కోస్తాంధ్ర కంటే రాయల­సీమలో మరింత తక్కువ వర్షపాతం నమోదైంది. కోస్తాంధ్రలో 18 శాతం (322.9 మి.మీలకు గాను 265.8 మి.మీలు), రాయలసీమలో 30 శాతం (236.4కి 164.7 మి.మీలు) చొప్పున లోటు వర్షపాతం రికార్డయింది.

ఈ సీజనులో రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా ఏలూరు జిల్లాలో 42 శాతం అధిక వర్షపాతం కురవగా, అత్యల్పంగా నంద్యాల జిల్లాలో 89 శాతం లోటు వర్షపాతం కురిసింది. ఇక కోస్తాంధ్రలోని 18 జిల్లాలకు గాను అల్లూరి సీతా­రామరాజు, అనకాపల్లి, బీఆర్‌ ఆంబేడ్కర్‌ కోనసీమ, బాపట్ల, ఏలూరు, కృష్ణా, పల్నాడు, పశ్చిమ గోదా­వరి జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. రాయలసీమలో ఒక్క తిరుపతి మినహా మిగిలి ఏడు జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే రికార్డయింది. 

రాక.. పోక ఆలస్యమే..
ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాల ఆగ­మనం, తిరోగమనం (నిష్క్రమణ) కూడా ఆలస్యంగానే జరగడం విశేషం. ఈశాన్య రుతుపవనాల సీజను డిసెంబర్‌ ఆఖ­రుతో ముగియాల్సి ఉన్నా జనవరిలోనూ రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో.. నిర్ణీత సమయానికి దాదాపు పక్షం రోజులు ఆలస్యంగా ఈ రుతుపవనాలు ఉపసంహరించుకుంటున్నాయి. దీంతో.. ఈనెల 15 తేదీ నాటికి ఈశాన్య రుతుప­వనాలు ఉపసంహరణతో అవి బలహీన­పడ­తాయని, ఫలితంగా రాష్ట్రంలో ఇప్ప­ట్లో వర్షాలు కురవవని భారత వాతా­వ­ర­ణశాఖ శుక్రవారం వెల్లడించింది. 

కొనసాగనున్న మంచు, చలి..
రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు పొగమంచు, చలి కొనసాగనుంది. సాధారణం కంటే కనిష్ట (రాత్రి) ఉష్ణోగ్రతలు 2–4 డిగ్రీ­లు తక్కువగా నమోదవుతాయని వాతా­వరణ నిపుణులు చెబుతున్నారు. అయితే, చలి తీవ్రత అంతగా ఉండదని.. పొగ మంచు ప్రభావం మాత్రం ఉంటుందన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement