సాక్షి, విశాఖపట్నం: ఈశాన్య రుతుపవనాల సీజన్ ప్రారంభమై దాదాపు పది రోజులవుతోంది. ఈ సీజన్‌లో రాష్ట్రంలో వానలు సమృద్ధిగా కురవాల్సి ఉంది. కానీ వాటి జాడ కనిపించకుండా పోతోంది. ఇప్పటికే నైరుతి రుతుపవనాల సీజన్ (జూన్–సెపె్టంబర్) కూడా రాష్ట్రంపై మిశ్రమ ప్రభావాన్ని చూపింది. కొన్ని ప్రాంతాల్లో సంతృప్తికరంగా, మరికొన్ని ప్రాంతాల్లో తక్కువగా వర్షాలు కురిశాయి. దీంతో ఆ సీజనులో 521.6 మి.మీలకు గాను 454.6 మి.మీల వర్షపాతం మాత్రమే నమోదైంది. కురవాల్సిన దానికంటే 13 శాతం తక్కువ కురిసిందన్న మాట.
సెప్టెంబర్ లోనూ 16 శాతం తక్కువగా సాధారణ వర్షపాతం (20 శాతం కంటే తక్కువ నమోదైతే సాధారణ వర్షపాతంగానే పరిగణిస్తారు) రికార్డయింది. ఇక ఈశాన్య రుతుపవనాల ప్రభావం ఎక్కువగా ఉండే అక్టోబర్‌లో వర్షాలు మరింతగా ముఖం చాటేశాయి. ఈ నెలలో ఏకంగా 90 శాతం భారీ లోటు నమోదైంది. అక్టోబర్ 1 నుంచి 31 వరకు నమోదైన వర్షపాతాన్ని పరిశీలిస్తే.. 99 శాతం లోటుతో కర్నూలు జిల్లా అట్టడుగున నిలిచింది.
ఆ జిల్లాలో అక్టోబర్‌లో 112.2 మి.మీలు కురవాల్సి ఉండగా కేవలం 0.1 మి.మీలు మాత్రమే కురిసింది. ఈశాన్య రుతుపవనాల ఆగమనం వేళ (అక్టోబర్ మూడో వారం) బంగాళాఖాతంలో ఏర్పడిన హమూన్ తుపాను వాటి చురుకుదనానికి బ్రేకు వేసింది. గాలిలో తేమను ఆ తుపాను బంగ్లాదేశ్ వైపు లాక్కుని పోవడంతో ఈశాన్య రుతుపవనాలు బలహీనంగా మారాయి. అప్పట్నుంచి అవి చురుకుదనాన్ని సంతరించుకోలేక వర్షాలు కురవడం లేదు.
నవంబర్‌లోనూ అంతంతే..
సాధారణంగా రాష్ట్రంలో నవంబర్‌లోనూ భారీ వర్షాలు కురుస్తాయి. అయితే రాష్ట్రంలో ఈ నెలలోనూ ఆశించిన స్థాయిలో వానలు కురిసే పరిస్థితుల్లేవని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) స్పష్టం చేసింది. నవంబర్‌లో దక్షిణాది రాష్ట్రాల్లో సగటున సాధారణ వర్షపాతం నమోదవుతుందని, కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం సాధారణంకంటే తక్కువ వర్షపాతం రికార్డవుతుందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ ఎస్.స్టెల్లా ‘సాక్షి’కి చెప్పారు.
వచ్చే మూడు రోజులు వానలు..
తాజాగా గురువారం నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 1.5 కి.మీల ఎత్తులో విస్తరించి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనంతో కలిసి శ్రీలంక పరిసరాల్లో కొనసాగుతోంది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌పైకి ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఈనెల ఆరో తేదీ వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. శుక్ర, శనివారాల్లో ఉత్తరకోస్తా, రాయలసీమల్లో కొన్నిచోట్ల, దక్షిణ కోస్తాలో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment