వజ్రపాత్ యాప్ ముఖచిత్రం, పిడుగుపాటుకు సంబంధించి హెచ్చరిక చూపిస్తున్న దృశ్యం
కారుమబ్బులు కమ్ముకుని.. భారీ శబ్దాలతో ఉరుములు.. కళ్లు మిరుమిట్లు గొలిపే మెరుపులు వస్తున్నాయంటే పిడుగులు పడతాయి. ఈ పిడుగుపాటుకు ఎన్నో పశువులు, ఎందరో మనుషులు బలైపోతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ క్షేత్రాల్లో, చిట్లకింద ఉన్నవారే ఈ పిడుగుపాటుకు గురవుతున్నట్లు పలు ఘటనలు తెలుపుతున్నాయి. అసలు ఈ పిడుగుపాటు నుంచి రక్షించుకోవడం ఎలా? ఎక్కడ ఉంటే పిడుగు మనమీద పడకుండా ఉంటుంది? అనే విషయాలు పాఠకుల కోసం..
సాక్షి, అశ్వాపురం(ఖమ్మం) : ఈ ఏడాది వర్షాకాలం ఆరంభం నుండి పగలు ఎండ, సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పిడుగులు పడుతున్నా యి. పగలు విపరీతంగా ఎండ ఉండి సాయంత్రం గాలి భీభత్సం స్పష్టిస్తోంది. ఈ నెల 18న ఒక్కరోజే పిడుగుపాటుకు జిల్లాలో టేకులపల్లి మండలంలో ఇద్దరు, బూర్గంపాడు మండలంలో ఒక రైతు, రెండు కాడెడ్లు, 13 మేకలు మృతి చెందాయి. ఇలా ఏటా పిడుగుపాటుకు ఎందరో ప్రజలతోపాటు పశువులు, మేకలు, గొర్రెలు మృత్యువాత పడుతున్నాయి. ఉరుములు, మెరుపుల సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పిడుగుపాటు నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఆరుబయట ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
మేఘాల్లోని రుణ, ధనావేశాల చర్యల వల్ల విద్యుత్ తరంగాలు (మెరుపులు) ఏర్పడి భూమి మీదికి ప్రసరించడాన్నే పిడుగు అంటారని పలువురు నిపుణులు చెబుతున్నారు. అయితే వచ్చే ఆ మెరుపులో ఎంతో శక్తి దాగి ఉంటుందని, దానిని తాకిన అనంతరం ప్రాణాలు రెప్పపాటులో పోతాయని వారంటున్నారు. ముఖ్యంగా మెరుపులు విడుదలైనప్పుడు అవి భూమిపై ఎత్తుగా ఉండే పచ్చటి చెట్లపైనే పడే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో చెట్ల కింద ఉన్నవారు కూడా పిడుగుపాటుకు గురై మరణిస్తారు.
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వచ్చే సమయంలో చెట్ల కింద ఉండొద్దు. పొలాల్లో కూడా ఉండొద్దు. పొలాల్లో ఉంటే అక్కడ ఉండే మొక్కలకన్నా మనిషే ఎత్తుగా ఉంటాడు కాబట్టి అతడిపైనే పడే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో అరచేతులతో చెవులు మూసుకొని నేలపై మోకాళ్ల మీద కూర్చొని తల కిందకు వంచి ఉండాలి. వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలకు దూరంగా ఉండాలి. ఎత్తైన ప్రదేశంలో ఉండకూడదు. ఉరుములు, మెరుపుల సమయంలో సెల్‌ఫోన్‌లో మాట్లాడకూడదు. ఈదురుగాలి, వర్షం సమయంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ తీగల కింద, సమీపంలో ఉండకూడదు.గుండె సంబంధిత వ్యాధి ఉన్న వారు వర్షం, ఉరుములు, మెరుపుల సమయంలో జాగ్రత్తగా ఉండాలి.
ఇంట్లో ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
► మొబైల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను విద్యుత్‌కు అనుసంధానం చేయరాదు.
► ఆ సమయంలో విద్యుత్, ఎలక్ట్రానిక్ పరికరాలు వాడరాదు.
► చేతులు కడగటం, స్నానం చేయడం, వంట సామాన్లు కడగటం, బట్టలు ఉతకడం చేయరాదు.
► కాంక్రీట్ నేలపై పడుకోవడం, గోడకు ఆనుకోవడం చేయకూడదు.
► విద్యుత్ వాహకాలు (ఇనుప తలుపులు, నీటి పైపులు) తాకకూడదు.
► కిటికీల తలుపులు మూసివేయాలి.
► చివరి ఉరుము శబ్దం విన్న తరువాత 30 నిమిషాల వరకు ఇంట్లోనే ఉండాలి.
► పిడుగుపాటుకు గురైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
► పిడుగుపాటుకు గురికాగానే అంబులెన్స్‌కు, వైద్యులకు సమాచారం అందించాలి.
► పిడుగుపాటు బాధితుడిని తాకడం సురక్షితమే కాబట్టి వెంటనే ప్రథమ చికిత్స అందించాలి.
► పిడుగు తాకిన ప్రాంతం తడిగా, చలిగా ఉంటే బాధితుడి శరీరానికి నేలకు మధ్య దుప్పటి ఉంచాలి.
► ఊపిరి ఆగిపోతే నోట్లో నోరు పెట్టి ఊదాలి.
► గుండె చప్పుడు ఆగిపోతే వైద్యులు వచ్చే లోపు రెండు చేతులతో చాతి భాగాన్ని గట్టిగా ఒత్తుతూ ఉండాలి.
► బాధితుడి నాడి, శ్వాస పని చేస్తుంటే మిగిలిన అవయవాల పనితీరును పరిశీలించాలి.
వచ్చేసింది వజ్రపాత్..
పిడుగు ఎక్కడ, ఎప్పుడు పడుతుందో తెలియక ప్రాణనష్టాలు జరుగుతున్నాయి. పిడుగు ఎక్కడ పడుతుందో తెలసుకునే మొబైల్ యాప్ అందుబాటులోకి వచ్చింది. వజ్రపాత్ యాప్ ద్వారా పిడుగు ఎక్కడ పడుతుందో తెలుసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో ప్లేస్టోర్‌లో వజ్రపాత్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్ డౌన్‌లోడ్ చేసుకోగానే ఫోన్ నంబర్ అడుగుతుంది. ఫోన్ నంబర్ ఎంటర్ చేయగానే మనకు ఏ భాష కావాలో ఎంచుకోవాలి. అనంతరం యాప్‌కు సంబంధించిన ముఖచిత్రం వస్తుంది.
వజ్రపాత్ యాప్ ముఖచిత్రంపై రెండు రకాల సమాచారం వస్తుంది. ఎడమ చేతి వైపు పిడుగు గుర్తుతో పాటు పిడుగు సమాచారం వస్తుంది. ఇక్కడ నొక్కితే మనం ఉన్న ప్రాంతం మ్యాప్‌లో వస్తుంది. మ్యాప్‌లో ఎరుపు, నారింజ, పసుపు రంగుల్లో వలయాలు వస్తాయి. వలయాల పక్కన అంకెలు ఉంటాయి. ఆ అంకెల ప్రకారం కొద్ది సేపట్లో ఎంత దూరంలో పిడుగుపడే అవకాశం ఉందో చూపిస్తుంది. పిడుగుపడే అవకా శం ఉంటే ఎంత దూరంలో పడుతుందో పిన్ గుర్తు కనిపిస్తుంది. యాప్‌లో కుడిభాగంలో పిడుగుపాటు హెచ్చరికలు ఉంటాయి. ఇక్కడ నొక్కితే పిడుగు పడే అవకాశాలు ఉన్నాయా? లేదా? అనే సమాచారం వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment