కౌటాల/రామకృష్ణాపూర్, న్యూస్‌లైన్ :
జిల్లాలో మంగళవారం పిడుగులు విధ్వంసం సృష్టించాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురియడంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. కౌటాల మండలంలో విద్యార్థి, మహిళ మృతి చెందగా, రామకృష్ణాపూర్‌లో సింగరేణి
కార్మికుడు మృతిచెందాడు. ఆ కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలిలా ఉన్నాయి. కౌటాల మండలం బాబాసాగర్ గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థి హుల్కె వినోద్(18) తమ పంటచేనులో మంగళవారం ఉదయం అరక పట్టడానికి వెళ్లాడు. సాయంత్రం వర్షం కురియడంతో పంట చేనులో నుంచి పశువులతో ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగు పడటంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. వినోద్ బాబాసాగర్ గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ కామాటి హుల్కె బాపు-కమల మూడో కుమారుడు. ఈయన మండల కేంద్రంలోని కళాశాలలో బీకాం చదువుతున్నాడు. కాగా విద్యార్థి మృతితో విషాదం అలుముకుంది. అలాగే కౌటాల మండలం బోదన్‌పల్లి గ్రామానికి చెందిన యశోధ(45) తమ చేనులో పనిచేస్తుండగా మంగళవారం పిడుగుపాటుకు గురై మృతిచెందింది. ఉదయం పనులకు వెళ్లగా సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పిడుగు వేయడంతో చేనులోనే మృతిచెందింది. యశోధకు భర్త బాపు, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
గురుడుపేట గ్రామంలో నగోసె చంద్రయ్య అనే రైతుకు చెందిన ఎద్దు పిడుగుపాటుతో చనిపోయింది. అలాగే రామకృష్ణాపూర్‌లోని ఆర్‌కే-1ఏ గని సమీపంలోని పాలవాగు వంతెన వద్ద మంగళవారం పిడుగుపాటుకు గురై సట్టు సాంబయ్య(52) అనే సింగరేణి కార్మికుడు మృతిచెందాడు. మందమర్రి ఏరియాలోని కేకే-5 గనిలో టింబర్‌మెన్‌గా పనిచేసే సాంబయ్య రెండో షిఫ్టు విధులకు హాజరయ్యేందుకు మోటార్ సైకిల్‌పై బయలుదేరాడు. మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ఉరుములతో కూడిన వర్షం పడటంతో పాలవాగు వంతెన పక్కనే గల చెక్‌పోస్టు కిందకి వెళ్లాడు. చెక్‌పోస్ట్‌పైనే పిడుగు పడటంతో దానికిందే ఉన్న సాంబయ్య అక్కడే మృతిచెందాడు. పట్టణంలోని పోచమ్మబస్తీలో నివాసముండే సాంబయ్యకు భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పిడుగుల విధ్వంసం
Published Wed, Sep 18 2013 1:14 AM | Last Updated on Sun, Sep 2 2018 4:19 PM
Advertisement
Advertisement