
సాక్షి, విజయవాడ: పిడుగుపాట్ల నుంచి ప్రజలను అప్రమత్తం చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందంజలో ఉందని డిజాస్టర్ మేనేజ్‌మెంట్, రెవెన్యూ డిపార్టుమెంట్ సెక్రటరీ ఉషారాణి తెలిపారు. నగరంలో ఏపీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్, నేషనల్ ఇస్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్, యూనిసెఫ్ ఆధ్వరంలో ‘పిడుగు పాటు ముందస్తు సూచనలు, అవగాహన విధానాలు’పై బుధవారం వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉషారాణి మీడియాతో మాట్లాడుతూ.. వివిధ రాష్ట్రాలు ప్రకృతి విపత్తులను ఏవిధంగా ఎదుర్కొంటున్నాయని.. ఉరుములు, మెరుపులు, పిడుగుపాట్లపై అనుసరిస్తున్న విధానాలపై చర్చించామని ఆమె తెలిపారు. దేశవ్యాప్తంగా గడిచిన పదేళ్లలో పిడుగుపాటుకు 25 వేల మంది చనిపోయారని ఆమె వెల్లడించారు. సాంకేతికతను వినియోగించుకుని పిడుగుపాట్లపై మండలస్థాయిలో ప్రజలను చైతన్య పరుస్తున్నామని ఉషారాణి పేర్కొన్నారు.
అదేవిధంగా మోబైల్‌ఫోన్లకు సందేశాలు సైతం పంపుతున్నామని ఆమె చెప్పారు. పిడుగుపాట్ల నుంచి ప్రజలను అప్రమత్తం చేయడంలో ఏపీ ముందంజలో ఉందన్నారు. ప్రజలు సైతం అవగాహన కలిగి ఉండాలని ఆమె వ్యాఖ్యానించారు. వర్షం పడే సమయంలో చెట్ల కిందకు వెళ్లకూడదని.. ఇళ్ల నిర్మాణం చేపట్టినప్పుడు యర్త్ఇన్ చేసుకోవాలని ఉషారాణి సూచించారు. గ్లోబుల్ వార్మింగ్ సైతం తగ్గించేలా చెట్లను పెంచాలని ఆమె తెలిపారు. రాష్ట్రంలోని గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తామని సెక్రటరీ ఉషారాణి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment