
సాక్షి,అమరావతి: రాబోయే రెండ్రోజులూ కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో శ్రీలంక తీరప్రాంతం మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
అల్లూరి సీతారామరాజు, ఏలూరు, నెల్లూరు, తిరుపతి, వైఎస్సార్, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో బుధవారం పలుచోట్ల తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, అంబేద్కర్ కోనసీమ, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, నంద్యాల, కర్నూలు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో గురువారం అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.
ఇక మంగళవారం అనంతపురం, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో 13 సెం.మీ., అనంతపురం జిల్లా కనేకల్‌లో 8.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తిరుపతి జిల్లా మల్లంలో 7.9, వాకాడులో 5.7, పూలతోటలో 4.1, గునుపూడులో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment