శ్రీకాళహస్తిలో జలమయమైన జయరామారావువీధి
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో రెండు, మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ప్రస్తుతం ఉత్తర–దక్షిణ ద్రోణి ఛత్తీస్‌గఢ్ నుంచి కర్ణాటక పరిసరాల వరకు ఆంధ్రప్రదేశ్ మీదుగా పయనిస్తోంది. ఇది సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. దీని ప్రభావంతో ఇప్పటికే రెండ్రోజులుగా కోస్తాంధ్ర, రాయలసీమల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమలో దీని ప్రభావం మరింత ఎక్కువ ఉండడంతో అక్కడ వానలు ఎక్కువ పడుతున్నాయి.
బుధవారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ఈనెల 9న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నాయి. ఇటు ద్రోణి, అటు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో బుధవారం కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం నివేదికలో వెల్లడించింది.
అదే సమయంలో ఉత్తరకోస్తాలోని విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి, దక్షిణ కోస్తాలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, రాయలసీమలోని కర్నూలు జిల్లాల్లో ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అక్కడక్కడ పిడుగులకు ఆస్కారం ఉందని పేర్కొంది.
రానున్న మూడు రోజులు తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. అందువల్ల మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని సూచించింది. కాగా మంగళవారం రాత్రి వరకు వెంకటగిరిలో అత్యధికంగా 9.1 సెంటీమీటర్లు, సీతానగరం 8.8, బొబ్బిలి 8.3, సాలూరు 7.3, కొయ్యూరు 6.6, లింగసముద్రం 6.1, అమలాపురం 5.8, చోడవరం 5.2, గోకవరం 5.0, గుత్తి (అనంతపురం జిల్లా)లో 4.2 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment