సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: తూర్పు మధ్య, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో గురువారం ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశాలున్నాయని తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే 2, 3 రోజులు రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నాయి.
ఉత్తరాంధ్రపై దీని ప్రభావం ఎక్కువగా ఉండనుంది. విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. గురువారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆరెంజ్ వార్నింగ్‌ను జారీ చేసింది. 10వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన వారు తిరిగి వెనక్కి రావాలని సూచించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉందని, రవాణా వ్యవస్థకు అంతరాయం కలుగుతుందని, చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయే ప్రమాదం ఉందని ఐఎండీ తెలిపింది.
వరి, అరటి పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపింది. వీటిని దృష్టిలో ఉంచుకుని యంత్రాంగం తగు చర్యలు తీసుకోవాలని చెప్పింది. ప్రజలు శిథిల భవనాలు/ఇళ్లలో ఉండవద్దని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. చెరువులు, కాలువలు, నదులు, విద్యుత్ స్తంభాలు, వైర్లకు దూరంగా ఉండాలని సూచించింది.
Rain Alert: బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం.. 6 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
Published Thu, Sep 8 2022 5:55 AM | Last Updated on Thu, Sep 8 2022 9:44 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment