ప్రాణ నష్టం జరగకూడదు | CM Jagan Comments Godavari floods Heavy Rains Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ప్రాణ నష్టం జరగకూడదు

Published Wed, Jul 13 2022 3:27 AM | Last Updated on Wed, Jul 13 2022 6:48 AM

CM Jagan Comments Godavari floods Heavy Rains Andhra Pradesh - Sakshi

ధవళేశ్వరం బ్యారేజ్‌ నుంచి దిగువకు ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి

సాక్షి, అమరావతి: భారీ వర్షాలు, వరదల కారణంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణ నష్టం జరగరాదని, ఏ ఒక్క ప్రాణం పోకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టి అప్రమత్తంగా ఉండాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. బాధితుల పట్ల మానవతా దృక్ఫథంతో వ్యవహరించాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని వెంటనే సహాయ శిబిరాలకు తరలించాలన్నారు. శిబిరాల నుంచి తిరిగి ఇళ్లకు వెళ్లేటప్పుడు తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి రూ.2 వేలు, వ్యక్తికి అయితే  రూ.1,000 చొప్పున ఇవ్వాలని ఆదేశించారు.

అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, ఏలూరు, బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల కలెక్టర్లకు రూ.2 కోట్ల చొప్పున తక్షణం రూ.8 కోట్ల నిధులు ఇస్తున్నట్లు ప్రకటించారు. గోదావరికి వందేళ్లలో ముందస్తు వరదలు, భారీ వర్షాల నేపథ్యంలో మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించిన ముఖ్యమంత్రి జగన్‌ సహాయ చర్యలపై మార్గ నిర్దేశం చేశారు. వరద నష్టంపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరించి సీఎంవో అధికారులకు రోజువారీ నివేదిక పంపాలని కలెక్టర్లకు సూచించారు.
  
నెల ముందే భారీ వరదలు 
గోదావరికి ముందస్తు వరదలు వచ్చాయని, గత వందేళ్లలో ఇంత ముందుగా ఈ స్ధాయిలో వరద రాలేదని ముఖ్యమంత్రి జగన్‌ తెలిపారు. సాధారణంగా ఆగస్టులో 10 లక్షల క్యూసెక్కుల వరద ఉంటుందని, తొలిసారిగా జూలైలోనే అంతకు మించి వరద వచ్చిందని చెప్పారు. ఇది జాగ్రత్త పడాల్సిన అంశమని అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ప్రస్తుతం ధవళేశ్వరంలో 13 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండగా, రెండో నంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారని తెలిపారు.

బుధవారం ఉదయానికి వరద పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని, ప్రవాహం 15 నుంచి 16 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందని వెల్లడించారు. దీనివల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. మహారాష్ట్రలో భారీ వర్షాల నేపథ్యంలో గోదావరికి వరద కొనసాగే అవకాశం ఉందన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. 

24 గంటలు కంట్రోల్‌ రూమ్‌లు
కూనవరం, చింతూరు, వి.ఆర్‌.పురం, అమలాపురంలో ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధంగా ఉన్నాయని ముఖ్యమంత్రి జగన్‌ తెలిపారు. లైన్‌ డిపార్ట్‌మెంట్లు ప్రత్యామ్నాయాలతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. కంట్రోల్‌ రూమ్స్‌ సమర్థంగా 24 గంటలపాటు నిరంతరాయంగా పని చేయాలని స్పష్టం చేశారు.

శిబిరాల్లో ఖర్చుకు వెనుకాడొద్దు..
అవసరమైన చోట్ల వరద సహాయ శిబిరాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. శిబిరాల్లో ఏర్పాట్లు బాగుండాలన్నారు. మంచి ఆహారం, తాగునీరు, ఇతర సౌకర్యాల కల్పనలో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని స్పష్టం చేశారు. బాధితుల పట్ల మానవతా దృక్ఫధంతో మెలగాలని, శిబిరాల నుంచి తిరిగి ఇళ్లకు వెళ్లేటప్పుడు వారంతా ప్రశంసించేలా సదుపాయాలు కల్పించాలని సూచించారు. సహాయ శిబిరాల్లో నాణ్యమైన సేవలందించే క్రమంలో ఖర్చుకు వెనుకాడొద్దని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. 

అత్యవసర మందులు, నిత్యావసరాలు 
పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది, నర్సులు, ఇతర సిబ్బందిని పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంచి అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. నిత్యావసర సరుకులకు సంబంధించి తగినంత నిల్వ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పారిశుధ్యం బాగుండాలని స్పష్టం చేశారు. తాగునీటి పథకాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు తలెత్తితే అత్యవసర సేవలు అందించేందుకు వీలుగా జనరేటర్లను, తాగునీటి కోసం ట్యాంకర్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. 

బోట్లు, లైఫ్‌ జాకెట్లు..
వర్షాల నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న నిర్మాణాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్‌ సూచించారు. చెరువులు, ఇరిగేషన్‌ కాల్వలు బలహీనంగా ఉన్నచోట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యుత్‌ సబ్‌స్టేషన్లు ముంపు బారిన పడకుండా చర్యలు చేపట్టి బోట్లు, లైఫ్‌ జాకెట్లు అవసరమైన చోట్ల సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో హోం, విపత్తుల నిర్వహణశాఖ మంత్రి తానేటి వనిత, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై.శ్రీలక్ష్మి, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ జి.సాయి ప్రసాద్, గృహ నిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌జైన్, ఇంధనశాఖ కార్యదర్శి కె.విజయానంద్, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్,  వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, సివిల్‌ సఫ్లైస్‌ కమిషనర్‌ గిరిజా శంకర్, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తదితరులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement