ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర బృందం
సాక్షి, అమరావతి: భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు మానవతా ధృక్పథంతో ఉదారంగా సాయం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్రానికి సిఫారసు చేయాల్సిందిగా నష్టాన్ని అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర బృందాన్ని కోరారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో తనను కలిసిన కేంద్ర అధికారులతో మాట్లాడుతూ... ఈ విపత్తు హృదయ విదారకరమన్నారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం అందచేసిన నష్టం వివరాల్లో ఎలాంటి పెంపూ లేదు. వాస్తవాలు ఎలా ఉంటే అలా ఇచ్చాం. ఎందుకంటే నష్టం అంచనాల తయారీకి మాకు క్షేత్రస్థాయిలో సమర్థవంతమైన వ్యవస్థ ఉంది. ప్రతి గ్రామంలోనూ రైతు భరోసా కేంద్రాలున్నాయి. ప్రతి రైతు పండించే పంటా ఇ–క్రాప్‌లో నమోదవుతోంది. సోషల్ ఆడిట్ కూడా నిర్వహిస్తున్నాం. ఇ– క్రాప్‌కు సంబంధించి రైతులకు రశీదులు కూడా ఇచ్చాం., నష్టపోయిన పంటలపై కచ్చితమైన, నిర్ధారించిన లెక్కలున్నాయి’’ అని ఆయన వివరించారు.
తాత్కాలిక ప్రాతిపదికన నిధులివ్వాలి
క్షేత్రస్థాయిలో నష్టానికి సంబంధించి వాస్తవ వివరాలను అందచేశామని, కోవిడ్ నియంత్రణ చర్యల కోసం వినియోగించినందువల్ల ఎస్డీఆర్‌ఎఫ్ నిధులు నిండుకున్నాయనే విషయాన్ని రాష్ట్ర ఆర్ధిక శాఖ కార్యదర్శి మీకు (కేంద్ర బృందానికి) వివరించారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. పనులు సాఫీగా జరగాలంటే నిధులు అవసరమని, వెంటనే తాత్కాలిక ప్రాతిపదికన విడుదలకు సహకారం అందించాలని కేంద్ర బృందాన్ని కోరారు.
మీ సూచనలు పరిగణలోకి
కేంద్ర బృందం సూచనలను పరిగణలోకి తీసుకుంటామని, దీర్ఘకాలంలో ఇలాంటి విపత్తులను నియంత్రించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. వరదనీటిని తరలించడానికి ఇప్పుడున్న కాల్వల సామర్థ్యాన్ని పెంచేలా ఇటీవలే ఒక కార్యక్రమాన్ని చేపట్టామని, దీనిద్వారా పెద్ద మొత్తంలో వేగంగా తరలించే అవకాశం కలుగుతుందని తెలిపారు. రిజర్వాయర్లు, డ్యామ్‌లపై పరిశీలన జరిపి తగిన చర్యలు చేపడతామని, ఆటోమేటిక్ వాటర్ గేజ్ సిస్టంపైనా దృష్టిపెడతామని చెప్పారు.
చేతికందే పంట నీటి పాలైంది...
వైఎస్సార్ కడప జిల్లాలో మౌలిక సదుపాయాలు దారుణంగా దెబ్బతిన్నాయని, పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని కేంద్ర బృందం సభ్యుడు, ఎన్‌ఎండీఏ, కేంద్ర హోంమంత్రిత్వశాఖ సలహాదారు కునాల్ సత్యార్థి చెప్పారు. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయిన చోట అపార నష్టం జరిగిందన్నారు. తాగునీటి సరఫరా, ఇరిగేషన్‌కూ తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. బ్రిడ్జిలు, రోడ్లు తెగిపోవడం వల్ల చాలా గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయని, పంట చేతికందే సమయంలో నీటి పాలైందని, శనగ పంట కూడా తీవ్రంగా దెబ్బతిందని చెప్పారు. చిత్తూరులో జిల్లాలో కొంత భాగం, నెల్లూరులో కూడా వరదల ప్రభావం అధికంగా ఉందన్నారు.
ధాన్యం కొనుగోలు నిబంధనలు సడలించాలి
ధాన్యం కొనుగోలు నిబంధనలను సడలించేలా కృషి చేయాలని కేంద్ర బృందాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కోరింది. భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బ తిన్నందున తేమ, ఇతర నిబంధనల విషయలో సడలింపులు ఇచ్చి ఉదారంగా వ్యవహరించాలని అభ్యర్థించింది.
మీ వేగం.. బాగుంది
విపత్తు సమయంలో రాష్ట్ర అధికార యంత్రాంగం అద్భుతంగా పనిచేసిందని, మీ (ముఖ్యమంత్రి జగన్) నాయకత్వంతో ప్రభుత్వ పనితీరు ప్రశంసనీయమని వరద నష్టాన్ని అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర బృందం పేర్కొంది. విద్యుత్ సహా అన్నిరకాల శాఖలు చాలా బాగా పనిచేశాయని, అత్యవసర సేవలను వెంటనే పునరుద్ధరించారని తెలిపింది. అంకితభావంతో పనిచేసే అధికారులు మీకున్నారని, క్షేత్రస్థాయిలో తీసుకున్న చర్యలన్నీ బాగున్నాయని అభినందించింది. భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేసేందుకు మూడు రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించిన కేంద్ర అధికారుల బృందం సభ్యులు సోమవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశమై తమ దృష్టికి వచ్చిన అంశాలను తెలియచేశారు. తమ పర్యటనలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, మీడియా ప్రతినిధులను కలుసుకున్నామని, ప్రతి ఒక్కరూ వరదల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పనితీరును ప్రశంసించారని చెప్పారు.
వెంటనే నిధుల విడుదలతో తక్షణ సాయం..
‘ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు ఇంత త్వరగా విద్యుత్తు పునరుద్ధరణ సహజంగా జరగదు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ప్రశంసనీయం. సహాయ కార్యక్రమాల కోసం కలెక్టర్లకు వెంటనే నిధులిచ్చారు. దీనివల్ల పనులు చాలా వేగంగా జరిగాయి. ఈ డబ్బులతో బాధితులను తక్షణమే ఆదుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ఏర్పాటును మేం చూడలేదు’ అని కేంద్ర బృందం సభ్యుడు, ఎన్‌ఎండీఏ, కేంద్ర హోంశాఖ సలహాదారు కునాల్ సత్యార్థి పేర్కొన్నారు. జేసీబీలను తరలించి అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారని, సహాయక శిబిరాలను ప్రారంభించి ముంపు బాధితులను ఆదుకున్నారని చెప్పారు. యువకులు, డైనమిక్‌గా పనిచేసే అధికారులున్నారని అభినందించారు. అధికారులంతా తమకు చక్కటి సహకారాన్ని అందించారన్నారు.
వైఎస్సార్ కడప జిల్లాకు భారీ నష్టం
తన పర్యటన సందర్భంగా వీలైనన్ని గ్రామాలను, వరద కారణంగా నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించామని, కడప జిల్లాకు భారీ నష్టం వాటిల్లిందని కునాల్ సత్యార్థి తెలిపారు. పశువులు మృత్యువాత పడ్డాయని, రోడ్లు, భవనాలు, లాంటి మౌలిక సదుపాయాలతోపాటు ప్రాజెక్టులు బాగా దెబ్బతిన్నాయని చెప్పారు.
ఆనవాయితీగా వరదలొచ్చే ప్రాంతాలు కావు..
అవి సంప్రదాయంగా వరదలు వచ్చే ప్రాంతం కాదని, అలాంటి చోట ఊహించని రీతిలో వర్షాలు కురిశాయని కునాల్ సత్యార్థి పేర్కొన్నారు. ఈ స్థాయిలో వరద ప్రవాహాన్ని మోసుకెళ్లగలిగే పరిస్థితి అక్కడున్న నదులు, వాగులు, వంకలకు లేదని చెప్పారు. కరువు ప్రాంతంలో అతి భారీవర్షాలు కురిశాయని, ఈ స్థాయిలో వరదను నియంత్రించగలిగే రిజర్వాయర్లు, డ్యామ్‌లు కూడా ఆ ప్రాంతంలో లేవన్నారు. ఉన్న డ్యామ్‌లు, రిజర్వాయర్లు కూడా ఈ స్థాయి వరదలను ఊహించి నిర్మించినవి కావన్నారు. ఇలాంటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా తలెత్తున్నాయని, కరువు ప్రాంతాల్లో కుంభవృష్టి, నిరంతరం మంచి వర్షాలు కురిసేచోట కరువు లాంటి పరిస్థితులు నెలకొంటున్నాయని తెలిపారు. తీరం దాటిన తర్వాత అల్పపీడనం వెంటనే తొలగిపోలేదని, అది చాలా రోజులు కొనసాగిందని చెప్పారు.
మావంతు సహకారాన్ని అందిస్తాం
వరదల వల్ల జరిగిన నష్టంలో 40 శాతం రోడ్లు, భవనాలు రూపేణా జరిగిందని, 32 శాతం నష్టం వ్యవసాయం, అనుబంధ రంగాల్లో జరిగిందని, ఇరిగేషన్ స్కీమ్‌ల రూపేణా 16 శాతం మేర నష్టం జరిగిందని కేంద్ర బృందం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ను వీలైనంత మేర ఆదుకునేలా తమ వంతు సహకారాన్ని అందిస్తామని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment