మళ్లీ మహోగ్రం.. పోటెత్తిన కృష్ణమ్మ | Flood rise in Krishna river increasing with Heavy Rains | Sakshi
Sakshi News home page

మళ్లీ మహోగ్రం.. పోటెత్తిన కృష్ణమ్మ

Published Fri, Sep 9 2022 5:05 AM | Last Updated on Fri, Sep 9 2022 9:38 AM

Flood rise in Krishna river increasing with Heavy Rains - Sakshi

నాగార్జునసాగర్‌ టెయిల్‌పాండ్‌ ప్రాజెక్టు నుంచి పులిచింతలకు పరవళ్లు తొక్కుతున్న నీరు

సాక్షి, అమరావతి/నెట్‌వర్క్‌: కృష్ణమ్మ మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. ఆల్మట్టికి దిగువన తుంగభద్ర, వేదవతి, భీమా పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణాలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. గురువారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం జలాశయంలోకి 4,26,201 క్యూసెక్కులు చేరుతుండగా పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా 12,500, హంద్రీ–నీవా ద్వారా 1,125, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 800 క్యూసెక్కులు తరలిస్తున్నారు.

కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 62,091 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయంలో 884.4 అడుగుల్లో 211.95 టీఎంసీలను నిల్వ చేస్తూ స్పిల్‌వే పది గేట్లను 15 అడుగుల మేర పైకి ఎత్తి 3,76,670 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. బుధవారం నుంచి గురువారం వరకు కుడిగట్టు కేంద్రంలో 15.201 మిలియన్‌ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 16.761 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు.  

589 అడుగుల్లో సాగర్‌ 
శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌లోకి 4,23,819 క్యూసెక్కులు చేరుతున్నాయి. సాగర్‌లో 589 అడుగుల్లో 309.06 టీఎంసీలను నిల్వ చేస్తూ స్పిల్‌వే గేట్లు, విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. నాగార్జున సాగర్‌ టెయిల్‌పాండ్‌ ప్రాజెక్టు పూర్తి స్థాయి మట్టం 75.50 మీటర్లకుగానూ 73.46 మీటర్లకు చేరుకుంది. పులిచింతలలోకి 3,67,262 క్యూసెక్కులు చేరుతుండగా 169.55 అడుగుల్లో 37.73 టీఎంసీలను నిల్వ చేస్తూ 3,98,349 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు.  

వందేళ్లలో రికార్డు వరద.. 
పశ్చిమ కనుమల్లో సహ్యాద్రి సానువుల్లో జన్మించి దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే హగరి లోయ గుండా ప్రవహించే వేదవతి (హగరి) వందేళ్ల తర్వాత ఉగ్రరూపం దాల్చింది. అనంతపురం జిల్లాలోని భైరవానితిప్ప ప్రాజెక్టు నిండిపోయింది. ప్రాజెక్టు(బీటీపీ)లోకి 62,085 క్యూసెక్కులు చేరుతుండగా అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. బీటీపీ చరిత్రలో ఇదే అత్యధిక వరద. బీటీపీ నుంచి దిగువకు వదిలేస్తున్న జలాలు తుంగభద్ర మీదుగా సుంకేశుల బ్యారేజ్‌లోకి, అక్కడి నుంచి శ్రీశైలంలోకి చేరుతున్నాయి.  

పెన్నా పరవళ్లు
పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు పెన్నా నది మళ్లీ పరవళ్లు తొక్కుతోంది. శ్రీసత్యసాయి జిల్లాలోని అప్పర్‌ పెన్నార్‌ ప్రాజెక్టులోకి 16,500 క్యూసెక్కులు చేరుతున్నాయి. నీటి నిల్వ ఇప్పటికే గరిష్ట స్థాయి 1.52 టీఎంసీలకు చేరుకోవడంతో గేట్లు ఎత్తి 11 వేల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ (పీఏబీఆర్‌)లోకి 21,030 క్యూసెక్కులు చేరుతున్నాయి. పీఏబీఆర్‌ సామర్థ్యం 11.1 టీఎంసీలు కాగా నిర్మాణ లోపంతో గరిష్ట స్థాయిలో నిల్వ చేయలేని పరిస్థితి నెలకొంది. పీఏబీఆర్‌లో 5.78 టీఎంసీలను నిల్వ చేస్తూ 13,770 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు.

అనంతపురం జిల్లాలోని మిడ్‌ పెన్నార్‌ రిజర్వాయర్‌లోకి 15,329 క్యూసెక్కులు చేరుతున్నాయి. రిజర్వాయర్‌ నీటి నిల్వ గరిష్ట స్థాయి 4.96 టీఎంసీలకు చేరుకోవడంతో 16,125 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. మిడ్‌ పెన్నార్‌ చరిత్రలో ఇదే అత్యధిక వరద. చాగల్లు రిజర్వాయర్‌లోకి 24,990 క్యూసెక్కులు చేరుతున్నాయి. ఈ రిజర్వాయర్‌ నీటి నిల్వ సామర్థ్యం 1.8 టీఎంసీలు కాగా 0.86 టీఎంసీలను నిల్వ చేసి 25 వేల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. చాగల్లు చరిత్రలోనూ ఇదే గరిష్ట వరద. గండికోట ప్రాజెక్టులోకి 35 వేల క్యూసెక్కులు చేరుతుండగా నీటి నిల్వ గరిష్టంగా 25.37 టీఎంసీలకు చేరుకోవడంతో గేట్లు ఎత్తి 30 వేల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు.

మైలవరం రిజర్వాయర్‌లో 9.98 టీఎంసీలకుగానూ 5 టీఎంసీలను నిల్వ చేస్తూ 32 వేల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. సోమశిల ప్రాజెక్టు 78 టీఎంసీలకుగానూ ఇప్పటికే 72.14 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టులోకి 11,893 క్యూసెక్కులు చేరుతుండగా కండలేరుకు కాలువ ద్వారా 8 వేలు, విద్యుదుత్పత్తి చేస్తూ 2,453 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. కండలేరు రిజర్వాయర్‌లోకి 7,790 క్యూసెక్కులు చేరుతుండటంతో నిల్వ 47 టీఎంసీలకు చేరుకుంది.

మరో 21 టీఎంసీలు చేరితే కండలేరు నిండిపోనుంది. సోమశిల రిజర్వాయర్‌కు దిగువన కొత్తగా నిర్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌లో పూర్తి సామర్థ్యం మేరకు 0.45 టీఎంసీలు, నెల్లూరు బ్యారేజ్‌లో 0.4 టీఎంసీలను నిల్వ చేస్తూ ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి సోమశిలకు వరద ప్రవాహం వస్తుండటంతో శుక్రవారం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయనున్నారు. సంగం, నెల్లూరు బ్యారేజ్‌లలోకి పెరిగే వరద ప్రవాహాన్ని బట్టి మిగులు జలాలను గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలేయనున్నారు.  

నేడు బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక! 
ప్రకాశం బ్యారేజ్‌లోకి చేరుతున్న వరద గంట గంటకూ పెరుగుతోంది. గురువారం సాయంత్రం 6 గంటలకు బ్యారేజ్‌లోకి 2,73,222 క్కూసెక్కులు చేరుతుండగా కృష్ణా డెల్టాకు 15,472 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 2,57,750 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఎగువ నుంచి బ్యారేజ్‌లోకి శుక్రవారం ఉదయానికి నాలుగు లక్షల క్యూసెక్కుల వరద చేరే అవకాశం ఉండటంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. లోతట్టు ప్రాంతాల వాసులను అప్రమత్తం చేస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement