అనంతపురం పునరావాస కేంద్రానికి అధికారులు తరలించిన బాధితులు
సాక్షి ప్రతినిధి, అనంతపురం/కర్నూలు (అగ్రికల్చర్): భారీ వర్షాలతో అనంతపురం జిల్లా కకావికలమైంది. బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. కనీవినీ ఎరుగని రీతిలో అనంతపురంలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాయదుర్గంలో 14.6, బుక్కరాయసముద్రంలో 12, పెద్దపప్పూరులో 11.6, గుత్తిలో 9.8, పుట్లూరులో 8.5, యాడికిలో 8.3 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.
ప్రధానంగా అనంతపురం మండలం కక్కలపల్లి, కాటిగాని కాలువ, కట్టకిందపల్లి, ఆలమూరు, కామారుపల్లి, సజ్జల కాలువ, కురుగుంట, కొడిమి, రాచానపల్లి, ఎ.నారాయణపురం తదితర ప్రాంతాలతో పాటు రుద్రంపేట, చంద్రబాబు కొట్టాల, విమలా ఫారుఖ్‌నగర్, సుందరయ్య కాలనీ, వికలాంగుల కాలనీ, జాకీర్ కొట్టాల, నగరంలోని ఆజాద్‌నగర్, విశ్వశాంతి నగర్, హనుమాన్ కాలనీ, శాంతినగర్, ప్రశాంతి నగర్, రంగస్వామి నగర్, రజక నగర్, ఆదర్శ నగర్, యువజన కాలనీ, నాలుగు, ఐదు, ఆరో రోడ్డు, సోమనాథ నగర్, సుఖదేవ నగర్, శ్రీశ్రీనగర్, గౌరవ్ గార్డెన్, తడకలేరు తదితర ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
వంక పరిసర ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలను ఇళ్ల నుంచి ఖాళీ చేయించి పునరావాస ప్రాంతాలకు తరలించారు. వరద ఉధృతి కారణంగా చాలా ప్రాంతాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. బుక్కరాయసముద్రం వద్ద వాగులో సిమెంట్ కంటైనర్ బోల్తాపడింది.
అనంతపురం ఐదో రోడ్డులో ఆహార పొట్లాల పంపిణీ
ఉమ్మడి కర్నూలులో భారీ వర్షాలు
ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు సగటున 85.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఉమ్మడి జిల్లాలో దశాబ్దాల కాలంలో ఇంత భారీ వర్షాలు కురవడం ఇదే మొదటిసారి. దేవనకొండలో రికార్డు స్థాయిలో 160.2 మి.మీ. వర్షం కురిసింది. నందవరంలో 112.6, బనగానపల్లెలో 107.4, పగిడ్యాలలో 98.2, పెద్దకడబూరులో 97.2, గోనెగండ్లలో 96.2, వెల్దుర్తిలో 96.2 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.
హంద్రీ నది, వేదావతి నదితోపాటు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. భారీ వర్షాలతో వెల్దుర్తి మండలంలో నాలుగు మట్టి మిద్దెలు కూలిపోయాయి. హాలహర్వి మండలం గూళ్యం సమీపంలో వేదావతి నది పొంగిపొర్లడంతో ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. గాజులదిన్నె ప్రాజెక్టుకు వరదనీరు పోటెత్తింది. దీంతో నాలుగు గేట్లు ఎత్తి 32 వేల క్యూసెక్కుల నీటిని హంద్రీ నదిలోకి విడుదల చేస్తున్నారు. కర్నూలు నగరంలో భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు
జలమయమయ్యాయి.
సీఎం చొరవతో సహాయక చర్యలు వేగవంతం
అనంతపురంలో జిల్లాలోని వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షించడంతో సహాయక చర్యలు మరింత వేగం పుంజుకున్నాయి. అన్ని శాఖల సమన్వయంతో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి బాధిత ప్రజలకు అన్న పానీయాలు, నిత్యావసర వస్తువులు, మందులు అందజేస్తున్నారు.
స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, మేయర్ వసీం, కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ఎస్పీ ఫక్కీరప్ప తదితరులు లోతట్టు ప్రాంతాల్లో బాధితులను పరామర్శించి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించారు. వరద బాధితులకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని మంత్రి ఉషశ్రీ చరణ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment