
పడవపై వెళ్తున్న పెళ్లి కుమార్తె
మామిడికుదురు: కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఎంతో అట్టహాసంగా ఊరేగింపుగా పెళ్లికి వెళ్లాలని చేసుకున్న ప్లాన్ వర్షాల దెబ్బకు విఫలమైంది. ఊహించని రీతిలో ఎదురైన వరద బెడద ఆడ పెళ్లివారిని నానా తంటాలు పెట్టింది. వరద నీరు వారి గ్రామాన్ని పూర్తిగా చుట్టుముట్టేయటంతో చేసేది లేక పెళ్లికుమార్తె పడవలో వెళ్లి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.
కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పెదపట్నంలంక లంకపేటకు చెందిన నల్లి ప్రశాంతికి, మలికిపురం మండలం కేశనపల్లికి చెందిన గంటా అశోక్‌కుమార్‌తో వివాహం నిశ్చయమైంది. గురువారం ఉదయం ముహూర్తంగా నిర్ణయించారు. కానీ పెదపట్నంలంకను గోదావరి వరద చుట్టు ముట్టింది. రోడ్లు ముంపు బారిన పడటంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.
అష్టకష్టాలు పడి పెళ్లి కుమార్తెను అతి ముఖ్యులతో కలిసి పడవపై అప్పనపల్లి కాజ్‌వే వరకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి కారులో కేశనపల్లికి చేరుకున్నారు. ముహూర్త సమయానికి కాస్త ఆలస్యమైనా పెళ్లి వేదిక వద్దకు చేరుకోగలిగారు. అనంతరం పెద్దలు పెళ్లి ప్రక్రియ పూర్తి చేశారు.