సాక్షి అమలాపురం: గోదావరి చేస్తున్న గాయానికి పెద్ద ఎత్తున భూములు కోతకు గురవుతున్నాయి. వరద ఉధృతికి విలువైన సాగు భూములు నదీగర్భంలో కలిసిపోతున్నాయి. జూలైలో వచ్చిన రికార్డు స్థాయి వరద.. ఈ నెలలో వచ్చిన వరదలకు లంక గ్రామాల్లోని కొబ్బరి తోటలు, విలువైన ఉద్యాన పంటలు పండే భూములు నదీకోతకు గురవుతున్నాయి. డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 17 మండలాల్లో 93 లంక గ్రామాలుండగా, సుమారు 25 గ్రామాల్లో నదీకోత తీవ్రత అధికంగా ఉంది. మిగిలిన గ్రామాల్లో సైతం నదీకోతకు భూములు కొట్టుకుపోతున్నాయి.
బంగారు భూములు
గోదావరి మధ్య ఏర్పడిన సహజసిద్ధమైన లంకలంటే బంగారం పండే భూములు. ఏటా వరదలకు మేటలుగా పడే ఒండ్రు మట్టి వల్ల ఇక్కడ పంటల దిగుబడి అధికం. ఇతర ప్రాంతాల్లో కన్నా లకంల్లో కొబ్బరి దిగుబడి అధికం. కాయ సైతం పెద్దగా ఉంటుంది. ఇక్కడి కొబ్బరికి ఇతర ప్రాంతాల్లో పండే కాయకన్నా రూ.2 అధికంగా వస్తుంది. కొబ్బరితో పాటు కోకో, అరటి, కంద, పసుపు, అల్లం, కూరగాయల వంటి ఉద్యాన పంటలతో పాటు పువ్వులు, నర్సరీలు, మొక్కజొన్న, అపరాల వంటి వ్యవసాయ పంటలు సాగవుతుంటాయి. దీర్ఘకాలికం మినహా మిగిలిన పంటలు ఆగస్టు వరదల సమయానికే చేతికి వచ్చేలా సాగు చేస్తుంటారు. దశాబ్దాల కాలంగా ఇంతటి విలువైన వందల ఎకరాల భూములు నదీగర్భంలో కలిసిపోవడంతో లంక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కోత ఇక్కడ అధికం
జిల్లాలోని ఆలమూరు, రావులపాలెం, ఆత్రేయపురం, కొత్తపేట, పి.గన్నవరం, మామిడికుదురు, అంబాజీపేట, అయినవిల్లి, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి, ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన, అల్లవరం, కె.గంగవరం, కపిలేశ్వరపురం మండలాల్లో నదీకోత అధికంగా ఉంది. గోదావరి మధ్యన ఉన్న లంక గ్రామాల్లోనే కాకుండా ఏటిగట్లు, నదీగర్భానికి మధ్య ఉన్న భూములు సైతం పెద్ద ఎత్తున కోతకు గురవుతున్నాయి. కె.గంగవరం మండలం శేరిలంక, ముమ్మిడివరం మండలం కమిని, వలసతిప్ప, సలాదివారిపాలెం గ్రామాలు కూడా కోతకు గురవుతున్నాయి. ఇక్కడ ఇళ్లు కూడా కొట్టుకుపోతున్నాయి. ఇక్కడ గత దశాబ్దకాలంలో సుమారు 2 వేల ఎకరాల భూములు కొట్టుకుపోయాయని అంచనా.
ఇది మామిడికుదురు మండలం పెదపట్నంలంక వద్ద పరిస్థితి. కల్పవృక్షాలను ఇలా నదీమతల్లి ఇలా కబళించేస్తోంది. ఇక్కడ కొబ్బరి దిగుబడి సంఖ్యలోను, పరిమాణంలోను ఎక్కువ. ఈ గ్రామాన్ని ఆనుకుని ఉన్న బి.దొడ్డవరం, పెదపట్నం, అప్పనపల్లిలో సైతం నదీ కోత తీవ్రంగా ఉంది. దొడ్డవరాన్ని ఆనుకుని బోట్లకూరు అనే గ్రామం మొత్తం నదిలో కలిసిపోయింది. ఈ గ్రామాల్లో సుమారు 600 ఎకరాల భూమి నదిలో కొట్టుకుపోయింది.
పి.గన్నవరం మండలం జి.పెదపూడిలంక, ఉడుమూడిలంక, బూరుగులంక, అరిగెలవారిపేట వశిష్ట నది మధ్యలో దీవిలా ఉంటాయి. ఉధృత నదీ కోతకు ఈ దీవికి అన్నివైపులా సాగు భూమి కోతకు గురవుతోంది. జిల్లా పరిధిలోని వశిష్ట ఎడమగట్టు వైపు నది చిన్నపాయలా ప్రవహిస్తున్నా.. వంపు తిరిగినందున ఇటు లంక భూమికి కోత పెట్టడంతో పాటు ఏటిగట్టును సైతం బలహీనపరుస్తోంది. గడచిన పదేళ్లలో ఈ నాలుగు గ్రామాల్లో సుమారు 100 ఎకరాలకు పైగా భూమి గోదావరిలో కలిసిపోయిందని అంచనా.
రక్షణకు అడ్డంగా కన్జర్వెన్సీ యాక్టు
కోత నివారణకు గ్రోయిన్లు, రిటైనింగ్ వాల్స్ నిర్మించాలని లంక గ్రామాల రైతులు కోరుతున్నారు. అయితే మద్రాస్ కన్జర్వెన్సీ యాక్టు–1884 దీనికి ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ యాక్టు ప్రకారం నదీ ప్రవాహానికి అడ్డంగా నిర్మాణాలు చేయకూడదు. ఈ నిబంధన వల్ల ప్రభుత్వం ఏటిగట్లను ఆనుకుని ఉన్న లంక ప్రాంతాల్లో గ్రోయిన్లు, రిటైనింగ్ వాల్స్ కడుతున్నా.. లంక మధ్య ప్రాంతాల్లో మాత్రం నిర్మించలేకపోతోంది. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2008లో రూ.110 కోట్లతో వీటిని నిర్మించారు. ఈ నిర్మాణాలు జరిగిన చోట నదీ కోత ఉండకపోవడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment