మళ్లీ మహోగ్ర గోదారి | Telangana: Furious Flood Water In Godavari | Sakshi
Sakshi News home page

మళ్లీ మహోగ్ర గోదారి

Published Thu, Aug 18 2022 1:22 AM | Last Updated on Thu, Aug 18 2022 1:22 AM

Telangana: Furious Flood Water In Godavari - Sakshi

భద్రాచలంలో ఆంజనేయస్వామి ఆలయంలోకి చేరిన వరద 

సాక్షి, హైదరాబాద్‌/భద్రాచలం: గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఎగువన మహారాష్ట్రలో, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పోటెత్తి ప్రవహిస్తోంది. ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, కిన్నెరసాని తదితర ఉప నదులు ఉప్పొంగుతుండటంతో గత రెండు రోజులుగా గోదావరిలో వరద భీకరరూపం దాల్చింది.

ఈ నేపథ్యంలో గోదావరి పరీవాహకంలోని అన్ని ప్రాజెక్టుల గేట్లను ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్టే దిగువకు విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన లక్ష్మీ (మేడిగడ్డ) బ్యారేజీ గేట్లు ఎత్తేసి 10.25 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఈ వరదకు ఉప నదులు, వాగులు వంకల నుంచి వచ్చిన వరద తోడై సమ్మక్క(తుపాకులగూడెం) బ్యారేజీలోకి 12.52 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు.

సమ్మక్క బ్యారేజీ దిగువన సీతమ్మసాగర్‌లోకి 14,93,531 క్యూసెక్కులు చేరుతుండగా.. ఆ మేరకు కిందకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో భద్రాచలం వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. మధ్యాహ్నం వరకు 54.60 అడుగులతో ఉన్న గోదావరి తర్వాత స్వల్పంగా తగ్గింది. సాయంత్రం 54.50 అడుగులతో 15,02,258 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, మంగళవారం జారీ చేసిన మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు.  

కొనసాగుతున్న కృష్ణమ్మ పరవళ్లు
గద్వాల రూరల్‌/దోమలపెంట(అచ్చంపేట)/ నాగార్జున సాగర్‌: కృష్ణా బేసిన్‌లో ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. బుధవారం రాత్రి 8 గంటలకు జూరాలకు 2.52 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లోగా ఉండగా, 44 గేట్లు ఎత్తి 2,14,135 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సంకేçశుల నుంచి 52,832 క్యూసెక్కులు వస్తుండటంతో.. శ్రీశైలం ప్రాజెక్టుకు మొత్తం 2,96,431 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది.

దీంతో పది గేట్లను పది మీటర్ల మేర ఎత్తి స్పిల్‌వే ద్వారా 2,75,700 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 63,914 క్యూసెక్కులు మొత్తం 3,39,614 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి వరద ఉధృతి నేపథ్యంలో నాగార్జునసాగర్‌ ఆరు గేట్లు ఐదు అడుగులు, 18 గేట్లు పది అడుగులు ఎత్తి దిగువకు 2,98,596 క్యుసెక్కులు వదులుతున్నారు. మంగళవారం వరకు 26 గేట్ల ద్వారా నీరు విడుదలవగా.. బుధవారం రెండు గేట్లు మూసివేసి 24 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement