CM YS Jagan: గడప గడపకూ మనలో ఒకడై.. | CM YS Jagan Tour In Flood Effected Konaseema District People | Sakshi
Sakshi News home page

CM YS Jagan: గడప గడపకూ మనలో ఒకడై..

Published Wed, Jul 27 2022 3:37 AM | Last Updated on Wed, Jul 27 2022 7:33 AM

CM YS Jagan Tour In Flood Effected Konaseema District People - Sakshi

జి.పెదపూడిలంకలో అవ్వను ఆప్యాయంగా పలకరిస్తున్న ముఖ్యమంత్రి

వరదలు వచ్చినప్పుడే నేను కూడా ఇక్కడకు వచ్చి ఉంటే కలెక్టర్లు, అధికారులంతా నా చుట్టూనే తిరిగేవారు. టీవీ చానళ్లలో నేను బాగా కనిపించేవాడిని. నా ఫొటోలూ బాగా వచ్చేవి. కానీ ప్రజలకు మంచి జరిగేది కాదు. అందుకే వరదల పరిస్థితి పూర్తిగా చూసిన తరువాత వారం రోజులు గడువు ఇచ్చా. ప్రతి బాధితుడికీ సాయం అందించాలని చెప్పా. పశువులకు సైతం మంచి చేసే విధంగా.. వాటికి కూడా నోరు ఉంటే మెచ్చుకునే విధంగా.. బాగా చూసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చా.  నేరుగా బాధితుల ఇళ్ల వద్దకు వచ్చి సాయం అందిందో లేదో అడుగుతానని అప్పుడే చెప్పా. అందుకే ఇన్ని రోజులు వేచి చూసి ఇప్పుడు మీ ముందుకు వచ్చా.

ముంపు బారిన పడ్డ వారిని రక్షించడం, పునరావాసం కల్పించడం, సాయం అందించడంపై దృష్టి పెట్టాలే కానీ డ్రామాలు అనేవి ఉండకూడదు. ఏదైనా ఘటన జరిగిన వెంటనే వచ్చేసి ఫొటోలకు ఫోజులిచ్చి చంద్రబాబులా పబ్లిసిటీ కోసం పాకులాడకూడదు.   
– వరద బాధితులతో సీఎం జగన్‌

కోనసీమ నుంచి సాక్షి ప్రతినిధి: వరద ప్రాంతాల్లో బాధితులను ఆదుకునేందుకు అధికార యంత్రాంగం ప్రణాళికాబద్ధంగా, నిరంతరం శ్రమించిందని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్, వలంటీర్లు, సచివాలయాల ఉద్యోగులు, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు కలసికట్టుగా పని చేసి అందరికీ తక్షణ సాయం అందించారని చెప్పారు. కలెక్టర్‌ హిమాన్షు శుక్లా బాగా పని చేశారని అభినందించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని వరద బాధిత లంక గ్రామాల్లో సీఎం మంగళవారం పర్యటించారు. పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లో వరద ముంపునకు గురైన గంటి పెదపూడిలంక, అరిగెలవారిపాలెం, ఉడుమూడిలంక, బూరుగులంక, నున్నవారిబాడవ, మేకలపాలెం గ్రామాల్లో పర్యటించి బాధితులను కలుసుకున్నారు. అందరికీ అన్ని రకాలుగా సాయం అందిందా?.. లేదా? అని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తమకు సాయం అందిందని బాధితులంతా చేతులు పైకి ఎత్తి తెలియచేశారు. పర్యటనలో సీఎం ఏమన్నారంటే..
అరిగెలవారిపాలెంలో వరద బాధితులతో మాట్లాడుతున్న సీఎం జగన్‌   

15 రోజుల్లో నష్టం అంచనాలు..
ఈరోజు మన పరిపాలనలో ఎన్నో మార్పులు తెచ్చాం. అవి మీరు చూస్తూనే ఉన్నారు. ఇది మీ ప్రభుత్వం. మీకోసం.. పని చేస్తున్న ప్రభుత్వం. కలెక్టర్‌ నుంచి వలంటీర్ల వరకు అధికార యంత్రాంగం అంతా వరదల్లో ఎంతో సమర్థంగా పని చేయబట్టే ఈరోజు అందరికీ సాయం అందింది. ఇప్పుడిప్పుడే ఉధృతి తగ్గుముఖం పడుతోంది. మొదటి ప్రమాద హెచ్చరికను కూడా ఉపసంహరించారు. వరదల వల్ల జరిగిన నష్టాలపై వచ్చే 15 రోజుల్లో అధికారులు అంచనాలు తయారు చేయడం పూర్తి చేస్తారు. అది ఇల్లైనా పంటలైనా వేటినీ విడిచిపెట్టరు. రెండు మూడు నెలల్లో బాధితులందరికీ నష్ట పరిహారం అందిస్తాం. ఈ సీజన్‌లో జరిగిన నష్టాలకు సీజన్‌ ముగియకుండానే పరిహారం అందించే ఏర్పాటు చేస్తాం. ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క బాధితుడికీ అన్యాయం జరగదు.
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా జి.పెదపూడిలంకలో దెబ్బతిన్న పంటను పరిశీలిస్తున్న సీఎం జగన్‌  

పాల్గొన్న మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు
పర్యటనలో సీఎం వెంట మంత్రులు జోగి రమేష్, పినిపే విశ్వరూప్, తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాలకృçష్ణ, ఎంపీలు చింతా అనురాధ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్, సీఎం ప్రోగ్రామ్స్‌ కోఆర్డినేటర్‌ తలశిల రఘురామ్, ప్రభుత్వ విప్‌ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యేలు కొండేటి చిట్టిబాబు, రాపాక వరప్రసాద్, పొన్నాడ సతీష్‌కుమార్, జక్కంపూడి రాజా, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, పోతుల సునీత, ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయరెడ్డి, వరదలపై కోనసీమ ప్రత్యేకాధికారి మురళీధర్‌రెడ్డి, కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, పీఆర్‌ ఈఎన్‌సీ సుబ్బారెడ్డి తదితరులున్నారు.

గంటి పెదపూడి వద్ద గోదావరిపై బ్రిడ్జి
లంక గ్రామాల ప్రజలు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న గంటి పెదపూడి వద్ద గోదావరిపై బ్రిడ్జి నిర్మాణ బాధ్యత నాకు వదిలేయండి. వంతెన లేక మీరు పడుతున్న బాధలను ప్రతి గ్రామంలోనూ చెప్పారు. అన్నీ ఆలకించా. ఆ వంతెన నిర్మాణ పనులను మరో నెలన్నరలో ప్రారంభిస్తాం. 

సీఎం పర్యటన సాగిందిలా
మంగళవారం ఉదయం 10.30 గంటలకు: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండల జి.పెదపూడికి సీఎం జగన్‌ చేరుకున్నారు. అక్కడ నుంచి వశిష్ట నదిపై పంటు దాటి జి.పెదపూడి లంక వెళ్లారు. లంక గ్రామాల్లో వర్షం పడడంతో రోడ్లు బురదమయమయ్యాయి. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా సీఎం బాధితుల వద్దకు వెళ్లి పరామర్శను కొనసాగించారు.  

11.05 గంటలకు: జి.పెదపూడి దీవిలోకి అడుగుపెట్టిన సీఎం సుమారు 3.35 గంటల పాటు బాధితుల మధ్యనే గడిపి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రతి బాధితుడికి తన గోడు చెప్పుకునే అవకాశం ఇచ్చారు. మీకు సాయం అందిందా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం 2.50 వరకు స్వయంగా పరిశీలించారు. షెడ్యూల్‌లో లేకపోయినప్పటికీ స్థానికుల కోరిక మేరకు బూరుగులంకలో పర్యటించారు. పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లో పలు గ్రామాలకు వెళ్లి బాధితులను పరామర్శించారు. అనంతరం రాజమండ్రి చేరుకున్నారు. రాత్రి సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం అక్కడే ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహంలో సీఎం బస చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement