గోదావరి వరద బాధిత ప్రాంతాల్లో రెండోరోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం, పి.గన్నవరం లంక గ్రామాల్లో పర్యటించారు. మంగళవారం సాయంత్రం 4 గంటవరకూ ఆయా గ్రామాల్లో ముమ్మరంగా పర్యటించారు. వరద బాధిత కుటుంబాలను పరామర్శించారు.
రివెట్‌మెంట్ నిర్మాణంపై సీఎం ప్రకటన
ముమ్మిడివరం నియోజకవర్గంలో గురజాపులంకలో ప్రారంభమైన సీఎం పర్యటన తర్వాత కూనలంక, లంక ఆఫ్ ఠానేలంక గ్రామాల్లో సాగింది. ఆతర్వాత సీఎం దీనికి సమీపంలోనే ఉన్న పి.గన్నవరం నియోజకవర్గం కిందకు వచ్చే కొండకుదురులంక, పొట్టిలంక గ్రామాల్లో పర్యటించారు. కూనలంక, లంక ఆఫ్ ఠానేలంక, కొండకుదురు లంకల్లో సీఎం వరద బాధితులనుద్దేశించి మాట్లాడారు.
గురజాపులంక, కూనలకం, కొండకుదరు లంకల్లో గోదావరి వరద వల్ల తీవ్రంగా కోతకు గురవుతున్న పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ఆవాసాలున్న ప్రాంతాల్లో భూమి కోతకు గురికాకుండా రివిట్‌మెంట్ (స్టోన్ పిచ్చింగ్) చేయిస్తామని ప్రకటించారు. ప్రాథమికంగా దీనికోసం రూ.150 కోట్లు అవుతుందని అంచనా వేసినప్పటికీ, రూ.200 కోట్లైనా ఖర్చు చేయడానికి వెనుకాడమన్నారు. రెండు నెలల్లోగా పనులు ప్రారంభించాల్సింది అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వరదలు కారణంగా పంట నష్టపోయిన వారికి ఈ నెలాఖరులోగా పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు.
లంక గ్రామాల్లో కలియ దిరుగుతూ…
గురజాపులంక నుంచి కొండకుదరు లంక వరకూ కూడా ప్రతిచోటా వరద బాధితులను సీఎం కలుసుకున్నారు. గుజాపులంక, లంక ఆఫ్ ఠానే లంక, కొండకుదరు లంకలో దాదాపుగా అన్ని కుటుంబాలనుకూడా సీఎం కలుసుకున్నారు. లంక ఆఫ్ ఠాణే లంకలో రోడ్డుకు ఇరువైపులా అన్ని కుటుంబాలో వారు మమేకం అయ్యారు. గత ఏడాది జులైలో నీళ్లు ఎంతవరకూ వచ్చాయి. ఈ ఏడాది నీళ్లు ఎంతవరకూ వచ్చాయో చూపించేలా అధికారులు ఇదివరకే మార్కింగ్ వేశారు. వీటిని సీఎం స్వయంగా పరిశీలించారు.
వరదల సమయంలో ప్రభుత్వం నుంచి వచ్చిన సహాయం అందిందా? లేదా? రేషన్ సహా రూ.2వేల రూపాయలు ఆర్థిక సహాయం, ఇల్లు ధ్వంసమైన వారికి రూ.10వేల రూపాయల ఆర్థిక సహాయంపై బాధితులనుంచి ఆరాతీశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి లోటు పాటు లేదని, అన్ని సకాలానికే అందాయని, మనుషులతో పాటు పశువులను కూడా బాగా చూసుకున్నారని వారంతా చెప్పారు. ఈ వరదల్లోనే కాకుండా కిందట వరదల్లో కూడా అత్యంత వేగంగా స్పందించి ఆదుకున్నారని బాధితులంతా సీఎంతో అన్నారు. మరో ముప్ఫైఏళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగాలంటూ వృద్ధులు ఆశీర్వదించారు.
రైతులకు పరామర్శ
లంక గ్రామాల్లో వరదల కారణంగా కూరగాయలు పండిస్తున్న పలువురు రైతులు నష్టపోయారు. అంతేకాకుండా కొబ్బరితోటల్లో అంతరపరంటలుగా సాగుచేస్తున్న కూరగాయల పంటలు కూడా దెబ్బతిన్నాయి. గురజాపులంకలో బొక్కా నాగేశ్వర్రావుకు చెందిన పంటపొలాన్ని పరిశీలించారు. వరదల కారణంగా దెబ్బతిన్న మిరప, బెండ పంటలను సీఎం చూశారు.
అలాగే శ్రీనివాసరావు, లంకాలువలో వడగానిరెడ్డి గాంధీ పొలాన్నికూడా సీఎం పరిశీలించారు. సంబంధిత రైతులతో మాట్లాడి వరద ప్రభావాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి విపత్తులు వస్తున్న సమయంలో ప్రభుత్వం స్పందిస్తున్న తీరుపై వారు హర్షం వ్యక్తంచేశారు. విపత్తులను ఆపలేకున్నా, దెబ్బతిన్న రైతును నిలబెట్టడంతో ముఖ్యమంత్రి చేస్తున్న చొరవ ప్రశంసనీయమని, వైయస్సార్ బాటలో నడుస్తూ రైతులకు మేలు చేస్తున్నారని వారు సీఎంతో అన్నారు. నెలాఖరులోగా పంట నష్టపరిహారాన్ని విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం ప్రకటించగానే వారు హర్షం వ్యక్తంచేశారు.
ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఆరా
వరద సహాయంపై బాధితులనుంచి వివరాలు తెలుసుకుంటూనే మరోవైపు ప్రభుత్వ పథకాల అమలు తీరుపైనా ముఖ్యమంత్రి ప్రశ్నలు వేశారు. ముఖ్యంగా వృద్ధులకు పెన్షన్ అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. సూర్యోదయానికి ముందే వాలంటీర్ల వచ్చి తమ చేతిలో పెడుతున్నారని వారంతా బదులిచ్చారు. పెన్షన్ పంపిణీలో మంచి మార్పులు తీసుకు వచ్చి, బాసటగా నిలబడ్డారంటూ వారు సంతృప్తివ్యక్తంచేశారు. మహిళలకు అందుతున్న పథకాలపైనా కూడా సీఎం ఆరా తీశారు. ఆసరా, చేయూత, విద్యాకానుక, వసతి దీవెన లాంటి పథకాలు అందుతున్న తీరు, అర్హుల ఎంపిక తదితర అంశాలపైనా కూడా సీఎం ప్రశ్నలు వేశారు. లంకఆఫ్ ఠానే లంక సహా కొన్ని గ్రామాల్లో కుటుంబ సభ్యుల అనారోగ్యం సమస్యలతో ఇబ్బంది పెడుతున్న కొందరు మహిళలకు సహాయంపై అధికారులకు ఆదేశిస్తూనే వారికి స్వయం ఉపాధి కల్పించాలని అధికారులను ఆదేశించారు.
వాలంటీర్లు తోడుగా… బాధిత కుటుంబాలకు వద్దకు సీఎం
గురజాపు లంక, లంక ఆఫ్ ఠానే లంక, కొండకుదరు లంక తదితర లంక గ్రామాల్లో సీఎం పర్యటనలో వాలంటీర్లు దగ్గరుండి ఆయా కుటుంబాలను పరిచయం చేశారు. వరద సహాయం సరిగ్గా అందిందా లేదా? అన్నది వారి సమక్షంలోనే సీఎం తెలుసుకున్నారు. లంక ఆఫ్ ఠానే లంక రామాలయం పేట వీధిలో మహిళా వాలంటీర్ బేబీ సీఎంతో పాటుగా ఆయా కుటుంబాల సందర్శనలో ఉన్నారు. వివిధ కుటుంబాలకు అందుతున్న ప్రభుత్వ పథకాలపై వాలంటీర్ ద్వారా ముఖ్యమంత్రి సమాచారం తెలుసుకున్నారు. అవన్నీ సజావుగానే అందుతున్నాయని సీఎంకు లబ్ధిదారులు తెలిపారు. లంక ఆఫ్ ఠాణే లంకలో జయ లక్ష్మి మహిళ తన పెన్షన్ కాజూరు వద్ద ఉందని, తాను ఇక అక్కడకు వెళ్లని, లంక ఆఫ్ ఠాణే లంకు మార్పించాలంటూ సీఎంను కోరగా, వెంటనే వాలంటీర్‌ను పిలిపించి ఆమేరకు దరఖాస్తు చేసి, మార్పించాలని ఆదేశించారు. దీనికి సంబంధించి ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నామని మహిళా వాలంటీర్ సీఎంకు తెలిపారు.
పాఠాలు బాగా చెప్తున్నారా? విద్యా కానుక అందిందా?
లంక గ్రామాల్లో పర్యటన సందర్భంగా పలువురు చిన్నారులు సీఎంను కలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలు, మార్పులపై వారికి ప్రశ్నలు వేశారు. గురజాపు లంక, లంక ఆఫ్ ఠాణే లంకలో ఇలాంటి దృశ్యాలు కనిపించాయి. విద్యాకానుక కింద పుస్తకాలు, అన్నిరకాల వస్తువులు వచ్చాయా? లేవా? పాఠాలు బాగా చెప్తున్నారా? లేదా? పాఠశాలలో పరిస్థితులు బాగున్నాయా? లేవా? అంటూ బడిపిల్లలకు పలు ప్రశ్నలు సంధించారు. అన్ని బాగున్నాయి.. మామయ్యా అంటూ వారంతా సీఎంకు సమాధానం ఇచ్చారు. అక్కడున్న పిల్లలకు ముఖ్యమంత్రి చాక్లెట్లు ఇచ్చారు.
ఓఎన్జీసీ, జీపీసీఎల్ డ్రిల్లింగ్ కారణంగా జీవనోపాధి కోల్పోయిన కుటుంబాలు ఇవాళ సీఎం పర్యటించిన ప్రాంతాల్లో ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరికీ కూడా ప్రభుత్వం కోట్ల రూపాయల పరిహారం అందించిన విషయాన్ని లంక గ్రామాల ప్రజలు మరోసారి గుర్తు చేసుకున్నారు. ఇచ్చిన వాగ్దానం ప్రకారం తమకు పరిహారాన్ని ఇచ్చారంటూ సీఎంతో పలువురు తమ సంతోషాన్ని పంచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment