మండే ఎండలు
♦ సోమవారం 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
♦ వారం వ్యవధిలో 5 డిగ్రీల పెరుగుదల
♦ మధ్యాహ్నం బయటకు రాని జనం
ఎండలు ముదురుతున్నాయి. అప్పుడే వేడిగాలులు ప్రారంభమయ్యాయి. దీంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటే జంకుతున్నారు. వారం రోజులుగా పగటి గరిష్ట ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఫిబ్రవరిలోనే ఎండలు తీవ్రరూపం దాల్చడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ సీజన్‌లో అత్యధికంగా సోమవారం 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదివారం 36.9 డిగ్రీలు గరిష్టంగా, 17.4 డిగ్రీలు కనిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈనెల 16వ నుంచి 22వ తేదీ వరకు సుమారు 5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పెరిగింది. ఉదయం 10గంటల నుంచి వాతావరణం వెడెక్కుతోంది. ఫిబ్రవరిలోనే ఎండలు ఇలా ఉంటే మార్చిలో ఇంకెలా ఉంటాయోనని జనాలు ఆందోళన చెందుతున్నారు. ఈ నెలలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డా.సుధాకర్ తెలిపారు. - తాండూరు