భద్రాద్రిలో నిమజ్జనోత్సవ సందడి
Published Thu, Sep 19 2013 4:06 AM | Last Updated on Fri, Sep 1 2017 10:50 PM
భద్రాచలం ,న్యూస్‌లైన్ : భద్రాచలం గోదావరి తీరం బుధవారం భక్తుల కోలాహలంతో సందడిగా మారింది. తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన గణనాధుల విగ్రహాలను పవిత్ర గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. జై బోలో గణేష్ మహరాజ్‌కీ జై...అనే నినాదాలతో గోదావరి తీరం మార్మోగింది. బై..బై.. గణేశా అంటూ భక్తులు కేరింతలు కొడుతూ గణనాధునికి వీడ్కోలు పలికారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్ నుంచి విగ్రహాలను భద్రాచలం వద్ద గోదావరి నదిలో నిమజ్జనం చేసేందుకు తీసుకొచ్చారు. ప్రత్యేకంగా అలకంరించిన వాహనాలపై ఆశీనులైన గణనాధులను ఊరేగింపుగా తీసుకురాగా, నిర్వాహకులు, భక్తులు భక్తి భావంతో నృత్యాలు చేశారు. బుధవారం ఉదయం నుంచే భద్రాచలానికి విగ్రహాల రాక మొదలైంది.
అయితే చాలా మంది బుధవారం సాయంత్రం విగ్రహాలను ఊరేగింపు చేయటంతో గురువారం అధిక సంఖ్యలో విగ్ర హాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. సుమారు వేయికి పైగా విగ్రహాలు నిమజ్జనం జరిగినట్లుగా అధికారులు చెబుతున్నారు. గురువారం రాత్రి వరకూ సుమారు మూడు వేలకు పైగా విగ్రహాలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు ఇందుకనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని, నిమజ్జనోత్సవ సమస్యలపై దృష్టి సారించిన సబ్ కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా ఈ సారి ప్రత్యేక ఏర్పాట్లు చేయించారు. గతంలో వాహనాలపై వచ్చే విగ్రహాలను కరకట్టపై నుంచి కల్యాణ కట్ట సమీపంలో క్రేన్ ద్వారా దించి నిమజ్జనానికి తరలించేవారు. అయితే ఈ సారి కరకట్ట నుంచి గోదావరి మెట్ల వరకూ వాహనాలు వెళ్లేలా ప్రత్యేక రహదారిని ఏర్పాటు చేశారు. దీంతో త్వరగా విగ్రహాల నిమజ్జనం జరుగుతోంది.
ఉత్సవ కమిటీలు సహకరించాలి : సబ్ కలెక్టర్ గుప్తా
నిమజ్జనోత్సవం సజావుగా ప్రశాంత వాతావారణంలో జరిగేందుకు ఉత్సవ కమిటీల వారు అధికారులతో సహకరించాలని భద్రాచలం సబ్ కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా సూచించారు. బుధవారం నిమజ్జనోత్సవాన్ని ఆయన స్థానిక అధికారులతో కలసి పరిశీలించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక దృష్టి సారించాలని పోలీస్ శాఖ అధికారులను ఆదేశించారు.
Advertisement
Advertisement