ఏం తమాషాగా ఉందా...!
♦ ప్రతి సమావేశానికి ఆలస్యంగా వస్తున్నావ్
♦ ఆఫీసర్లు అంటే అంత చులకనా..
♦ వికారాబాద్ మున్సిపల్ కమిషనర్‌పై మండిపడిన సబ్ కలెక్టర్
వికారాబాద్ : ఆఫీసర్లు అంటే అంత లోకువా.. ఏందీ విషయం.. ప్రతి మీటింగ్‌కు ఆలస్యంగా వస్తావ్.. కొన్ని మీటింగ్‌లకు హాజరే కావు.. వచ్చినా ఎలాంటి నివేదికలు ఉండవు.. అసలు నీ ఉద్దేశం ఏమిటంటూ స్థానిక మున్సిపల్ కమిషనర్ ఎంకేఐ అలీపై వికారాబాద్ సబ్ కలెక్టర్ శ్రుతిఓజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రతి మంగళవా రం సమీక్ష సమావేశం ఉంటుందనే సమాచారం నీకు తెలియదా.. తెలిస్తే ఎందుకు రాలేదు.. ఫోన్ చేస్తేనే మీటింగ్‌కు వస్తావా.. ఎం తమాషాగా ఉందా.. పద్ధతి మార్చుకోకుంటే ఫలితం అనుభవించక తప్పదని తనదైన శైలిలో హెచ్చరించారు.
మంగళవారం వికారాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి సబ్ కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశానికి మున్సిపల్ కమిషనర్ హాజరుకాకపోవడంతో ఫోన్ చేసి పిలిపించారు. ప్రతి వారం మున్సిపాలిటీ లో నిర్వహించే సమావేశానికి సైతం మున్సిపల్ అధికారులు హాజరుకాకపోవడంతో ఈసారి సమావేశాన్ని మండల పరిషత్‌కు మార్చినట్లు తెలిపారు. తీరుమార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
కాగా సమావేశానికి అధికారులు పూర్తిస్థాయి సమాచారంతో హాజరు కావాలని ఆదేశించారు. మొక్కుబడిగా వచ్చినా శాఖా పరమైన చర్యలు తప్పవన్నారు. వేసవి దృష్ట్యా ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పశువుల దాహార్తిని తీర్చేందుకు వీలుగా నీటి తొట్లు నిర్మించాలన్నారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాం తాల్లో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని తెలిపారు. ఆర్‌డబ్ల్యూఎస్ పనితీరును మరింత మెరుగు పడాల న్నారు. అర్హులైన వారికి కార్పొరేషన్ రుణాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశానికి ఎంపీడీఓ సత్తయ్య, తహసీల్దార్ గౌతంకుమార్‌తో పాటు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.