సమస్యలు వింటూ.. పరిష్కారం చూపుతూ | Reporter r.v. Karnan - Sub-Collector, Madanapalle | Sakshi
Sakshi News home page

సమస్యలు వింటూ.. పరిష్కారం చూపుతూ

Published Sun, Dec 21 2014 2:28 AM | Last Updated on Wed, Apr 3 2019 5:32 PM

సమస్యలు వింటూ.. పరిష్కారం చూపుతూ - Sakshi

సమస్యలు వింటూ.. పరిష్కారం చూపుతూ

ప్రజలతో మమేకం
 
రిపోర్టర్ ఆర్.వీ.కర్ణన్ - సబ్ కలెక్టర్, మదనపల్లె
 
మదనపల్లె డివిజన్ కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న కుగ్రామం బోడుమల్లదిన్నె. గ్రామంలో సమస్యలు తాండవిస్తున్నాయి. ఇటీవల గ్రామంలో విషజ్వరాలతో నలుగురు మృతి చెందారు. 500 కుటుంబాలకుపైగా ఉన్న గ్రామంలో నాలుగైదు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. మరుగుదొడ్లు లేక మహిళలు అష్టకష్టాలు పడుతున్నారు. పారిశుద్ధ్య లోపం, తాగునీటి సమస్యతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రజల సమస్యలను ఎత్తిచూపాలని ‘సాక్షి’ భావించింది. మదనపల్లె డివిజన్ పరిపాలన అధికారి(సబ్ కలెక్టర్) ఆర్‌వీ.కర్ణన్‌ను ఆ బాధ్యత స్వీకరించాల్సిందిగా కోరింది.

అందుకు అంగీకరించిన ఆయన వీఐపీ రిపోర్టర్‌గా మారారు. మదనపల్లె రూరల్ మండలం కొండామారిపల్లె పంచాయతీ బోడుమల్లదిన్నె గ్రామానికి చేరుకుని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ, వాటికి పరిష్కార మార్గాలను చూపారు. ఓ వైపు చిరుజల్లులు కురుస్తున్నా ప్రజల వద్దకే వెళ్లి వారితో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ప్రజలతో ఆయన జరిపిన సంభాషణలు, పరిష్కార మార్గాలు మీకోసం.. ప్రెజెంటేషన్: చిట్టెం సుధాకర్, మాడా చంద్రమోహన్
 
 సబ్ కలెక్టర్ హామీలు
 
వందశాతం మరుగుదొడ్లు నిర్మిస్తాం.. బోడుమల్లదిన్నె గ్రామంలో పర్యటించినప్పుడు గ్రామంలోని సమస్యలు తెలుసుకున్నా. వాటిని పరిష్కరించేలా మా అధికారులను ఆదేశిస్తాను. రిపబ్లిక్ డే (జనవరి26) నాటికి వంద శాతం మరుగుదొడ్లు అన్ని ఇళ్లకు చేయిస్తా. కలెక్టర్ సిద్ధార్థజైన్ ఆదేశాల మేరకు గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రత్యేక చొరవ చూపుతాను. మొదటి దశలోనే లబ్ధిదారులకు సగం డబ్బులు అందజేశాం. మిగిలిన వాటిని కూడా త్వరలో ఇస్తాం. డ్రాప్ అవుట్స్‌ను గుర్తించి పాఠశాలలో చేర్పిస్తా. తాగునీరు, పారిశుద్ధ్య పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటా.  బోడుమలదిన్నె గోడు విన్న సబ్ కలెక్టర్ సమస్యలు తెలుసుకుంటూ మార్గాలు చూపారు

సబ్ కలెక్టర్: ఏమ్మా? నీ పేరేంటి? మరుగుదొడ్డిని ఎప్పటి నుంచి కట్టుకుంటున్నావు? ఇబ్బందులుంటే మొహమాటం లేకుండా చెప్పండమ్మా!
ఇమామ్‌బీ: సారూ.. మూడు రోజుల నుంచి కట్టుకుంటున్నా. మీరిచ్చే డబ్బు సాలలేదు. ఇటుకకు రూ.5 వేలు, ఇసుకకు రూ.2 వేలు,కూలీల ఖర్చులు ఇలా దాదాపు రూ.15 వేలు అయిపోతోంది.
సబ్ కలెక్టర్: ప్రభుత్వం ఎంత డబ్బులు ఇస్తుందమ్మా?
ఇమామ్‌బీ: రూ.12 వేలు ఇస్తారు సారూ
సబ్ కలెక్టర్: ప్రభుత్వం ఇచ్చిన సొమ్ముతో కట్టుకోవాలి.
ఇమామ్‌బీ: అలాగే సార్
సబ్ కలెక్టర్: ఎంత మంది పిల్లలమ్మా?
ఇమామ్‌బీ: నలుగురు ఆడబిడ్డలు సార్
సబ్ కలెక్టర్: ఆడ బిడ్డలు ఉంటే          మరుగుదొడ్డి కట్టుకోవాలని లేదా?
ఇమామ్‌బీ: ఉంది, డబ్బు లేక కట్టుకోలేదు.
సబ్ కలెక్టర్: ఇప్పుడు డబ్బులు ఇచ్చారు కదా, కట్టుకోండి
ఇమామ్‌బీ: తప్పకుండా కట్టుకుంటాం సార్.
సబ్ కలెక్టర్: ఏమయ్యా నీ పేరేంటి? గ్రామంలో విషజ్వరాలు అదుపులో ఉన్నాయా? తాగునీటి సమస్య ఎలా ఉంది?
రామచంద్ర: జ్వరాలు అదుపులోకి వచ్చాయి. వాంతులు, విరేచనాలు తగ్గుముఖం పట్టాయి. కాచిన నీళ్లు తాగమన్నారు. రెండు రోజుల క్రితం తాగునీటి బోరు వేశారు. నీళ్లు కూడా బాగా వస్తున్నాయి. అంతా కలెక్టర్, మీ దయ సార్.
సబ్ కలెక్టర్: బాబు, నీ పేరేంటి? గ్రామంలో సమస్యలు ఏమైనా ఉన్నాయా?
 ప్రసాద్: సార్ నా పేరు ప్రసాద్. గ్రామంలో పారిశుద్ధ్యం మెరుగుపడింది. గ్రామంలోని కాలువలు, డ్రైనేజీల్లో చెత్తాచెదారం ఎత్తివేశారు. ఇలాగే ఉంటే బాగుంటుంది.
సబ్ కలెక్టర్: స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేశారా?
ప్రసాద్: త్వరలో చేస్తాం సార్, మీరు చెప్పారు కాబట్టి సర్పంచును కలిసి స్వచ్ఛ భారత్ చేస్తాం.
సబ్ కలెక్టర్: పెద్దాయనా.. నీకు పెన్షన్ వస్తుందా?
ఇమామ్: వస్తుంది సారూ..
సబ్ కలెక్టర్: ఎంత వస్తుంది?
ఇమామ్: వెయ్యి రూపాయలు సార్
సబ్ కలెక్టర్: చౌక దుకాణాల్లో బియ్యం ఇస్తున్నారా?
ఇమామ్: ఇస్తున్నారు సార్
సబ్ కలెక్టర్: సంక్రాంతి పండుగకు అదనంగా చక్కెర, ఇతర వస్తువులు కూడా ఇస్తారు.
ఇమామ్: సంతోషం సార్
సబ్ కలెక్టర్: ఏమయ్యా.. నీకు పెన్షన్ వస్తుందా?
 షేక్ ఇమామ్ సాహెబ్: రాలేదు సార్
 సబ్ కలెక్టర్: అర్హత ఉంటే తప్పకుండా వచ్చే నెల నుంచి వస్తుంది.
 షేక్ ఇమామ్ సాహెబ్: గతంలో కూడా ఇచ్చారు, వయస్సు కూడా ఉంది వచ్చేలా చూడండి సార్.
 సబ్ కలెక్టర్: ఏమ్మా నీ పేరేంటి? మరుగుదొడ్డి ఎందుకు కట్టుకోలేదు?
 మంగమ్మ: స్థలం లేక కట్టుకోలేదు సార్
 సబ్ కలెక్టర్: ఇంటిలోని కాంపౌండ్ చూపిస్తూ ఇక్కడ కట్టుకోవచ్చు కదా? ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది కదా?
 మంగమ్మ: తప్పకుండా కట్టుకుంటాం సార్.
 
 సబ్ కలెక్టర్: తాగునీరు బాగా వస్తుందా?
 తట్టి నాగరాజురెడ్డి (సర్పంచు భర్త): రెండు రోజుల క్రితం బోర్ వేశాం సార్, కుళాయిల ద్వారా నీటిని అందజేస్తున్నాం.
 సబ్ కలెక్టర్: ఓవర్‌హెడ్ ట్యాంకును తరచూ శుభ్రం చేస్తున్నారా?
 తట్టి నాగరాజురెడ్డి: క్రమం తప్పకుండా చేస్తున్నాం సార్.
 సబ్ కలెక్టర్: ఏమయ్యా మీ పేర్లు ఏమిటి? మీ        సమస్యల గురించి చెప్పండి?
 వెంకటరమణ, లక్ష్మన్న: సార్ మా పేరు వెంకటరమణ, లక్ష్మన్న సార్. మాకు పెన్షన్ రాలేదు.
 సబ్ కలెక్టర్: మీ వయస్సు ఎంత?
 వెంకటరమణ, లక్ష్మన్న: తెలవదు సార్
 సబ్ కలెక్టర్: 65 సంవత్సరాలైతే పింఛన్ వస్తుంది. వయస్సు ఉంటే తప్పకుండా వచ్చే నెల నుంచి పింఛన్ వస్తుంది.
 వెంకటరమణ, లక్ష్మన్న: అలాగే సార్.
 సబ్ కలెక్టర్: మీ పేరేంటి? మరుగుదొడ్లు ఎలా కట్టుకుంటున్నారు?
 సయ్యద్ సాహెబ్: నా పేరు సయ్యద్ సాహెబ్ సార్, నిన్నటి నుంచి మరుగుదొడ్లు కట్టుకుంటున్నాం.
 సబ్ కలెక్టర్: త్వరగా కట్టుకోవాలి.
 సయ్యద్ సాహెబ్: అలాగే సార్
 సబ్ కలెక్టర్: మీకు పిల్లలు ఎంత మంది?
 సయ్యద్‌సాహెబ్: ఒక కూతురు సార్ అంటూ కూతురు రోష్నిని చూపించారు.
 సబ్ కలెక్టర్: చదువుకుంటున్నావా అమ్మా?
 రోష్ని: నిలిపివేశాను.
 సబ్ కలెక్టర్: ఎంతవరకు చదివావు?
 రోష్ని: పదో తరగతి నిలిపివేశా.
 సబ్ కలెక్టర్: ఇంటి దగ్గర ఉండి ఓపెన్ స్కూల్ ద్వారా డిగ్రీ వరకు చదవవచ్చు.
 సయ్యద్‌సాహెబ్: ఇంటి దగ్గర పనుల కోసం చదువు నిలిపివేశాను.
 సబ్ కలెక్టర్: ఓపెన్ స్కూల్ ద్వారా చదివించాలి.
 సయ్యద్‌సాహెబ్: తప్పకుండా సార్
 సబ్ కలెక్టర్: మీ పేరేంటమ్మ? మరుగుదొడ్లు            కట్టుకుంటున్నారా?
 గుల్‌జార్‌బీ: మూడు రోజుల నుంచి మరుగుదొడ్లు కట్టుకుంటున్నాం. మీరు చెప్పినట్లు త్వరగా కట్టుకుంటాం.
 సబ్ కలెక్టర్: ఇటుకలు ఎక్కడి నుంచి తెస్తున్నారు?
 రామయ్య: తట్టివారిపల్లె వద్ద ఇటుకల ఫ్యాక్టరీ సార్
 సబ్ కలెక్టర్: ఊరిలో పాఠశాల ఉందా?
 సీతారాములు: ఉంది సార్, ఊరిలో పిల్లలందరూ పాఠశాలకు పోతున్నారు.
 సబ్ కలెక్టర్: ఉపాధి పనులు జరుగుతున్నాయా?
 గోపాలు: జరుగుతున్నాయి సార్
 సబ్ కలెక్టర్: వైద్య సిబ్బంది వస్తున్నారా?
 రంగప్ప: వస్తున్నారు, జ్వరాలకు మందులు కూడా ఇచ్చారు.
 (అంతలోనే ఎంపీడీవో లక్ష్మిపతి, డీఎల్‌పీవో జగదీశ్వరమ్మ, ఈవోఆర్‌డీ గంగయ్య, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ రఫి, కార్యదర్శి అక్కడికి చేరుకున్నారు)
 సబ్ కలెక్టర్: గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. దగ్గరుండి పూర్తి చేయించాలి. తాగునీటి సమస్య లేకుండా చూడాలి. చదువు నిలిపివేసిన వారిని గుర్తించి పాఠశాలకు వెళ్లేలా చూడాలి.
 అధికారులు: తప్పకుండా చేయిస్తాం సార్.
 సబ్ కలెక్టర్: గ్రామాల్లో తరచూ తిరుగుతూ సమస్యలు తెలుసుకోవాలి.
 అధికారులు: మీరు చెప్పినట్లు చేస్తాం సార్.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement