మదనపల్లె టౌన్ : సిమెంట్ లారీ బైక్‌ను ఢీకొని విద్యార్థి మృత్యువాత పడిన సంఘటన మదనపల్లె పట్టణంలో గురువారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. తంబళ్లపల్లె మండలం జుంజురపెంట పంచాయతీ బురుజుపల్లెకు చెందిన దంపతులు ప్రహ్లాద, లక్ష్మీదేవీలు 20 ఏళ్లక్రితం మదనపల్లెకు బతుకుదెరువు నిమిత్తం వచ్చారు. కదిరిరోడ్డులోని అమ్మచెరువుమిట్ట ఏసీ గోడౌన్‌వద్ద సొంతంగా ఇంటిని నిర్మించుకుని పాడిపశువుల పోషణతో జీవనం సాగిస్తున్నారు.
ఈ క్రమంలో వారి ఒక్కగానొక్క కుమారుడు సి.ఉపేంద్ర (17) స్థానికంగా ఇంటర్ చదువుతున్నాడు. సెలవులు కావడంతో తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటూ గురువారం ఉదయం పాడిఆవులకు పచ్చగడ్డి కొనుగోలు చేసేందుకు నీరుగట్టువారిపల్లెకు బైక్‌లో బయలుదేరాడు. గడ్డి కొనుగోలు చేసి ఇంటికి తీసుకువెళుతున్న క్రమంలో మార్గమధ్యంలో సిమెంట్‌లారీ వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.
సమాచారం అందుకున్న వన్‌టౌన్ ఎస్‌ఐ లోకేష్ ప్రమాదస్థలికి చేరుకుని విచారణ చేపట్టి పంచనామా అనంతరం మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కగానొక్క బిడ్డ ఇక లేడని తెలుసుకున్న తల్లిదండ్రులు ఆస్పత్రి వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇక మాకు దిక్కెవరంటూ గుండెలు బాదుకోవడం చూపరుల హృదయాలను కలిచివేసింది.
Comments
Please login to add a commentAdd a comment