పెళ్లికని కారులో బయలుదేరారు.. వేడుకలో బంధువులను కలుసుకోవచ్చని సంబరపడ్డారు.. ఇంతలో విధి పాశానికి చిక్కుకున్నారు.. రోడ్డు ప్రమాదం బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు.. ఓ చిన్నారిని అనాథగా మిగిల్చి నలుగురు కుటుంబసభ్యులు మృత్యువు ఒడిలో చేరిపోయారు.. అనంతపురం జిల్లా జ్వాలాపురం క్రాస్ వద్ద శనివారం రాత్రి జరిగిన ఈ ఘోర ఘటనలో మదనపల్లె పట్టణంలోని నక్కలదిన్నెవాసులు దుర్మరణం పాలవడంతో స్థానికులు శోకసంద్రంలో మునిగిపోయారు.
సాక్షి, మదనపల్లె టౌన్: అనంతపురం జిల్లా బత్తలపల్లె మండలం జ్వాలాపురం క్రాస్ వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఆరేళ్ల చిన్నారి మాత్రం గాయాలతో బయటపడింది. పోలీసుల కథనం మేరకు.. అనంతపురం జిల్లా తనకల్లు మండలం కడపలవారిపల్లెకు చెందిన రెడ్డి పీరా, అమ్మాజీ దంపతులు 15 ఏళ్ల క్రితం మదనపల్లెకు వలసవచ్చి నక్కలదిన్నెలో స్థిరపడ్డారు. రెడ్డిపీరా సీటీఎంలోని ఓ క్వారీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఏడేళ్ల క్రితం కుమార్తె రేష్మాను హిందూపురానికి చెందిన బాబు బుడాన్‌కు ఇచ్చి వివాహం జరిపించాడు. తర్వాత బుడాన్ సైతం మదనపల్లెకు వచ్చి అత్తగారింట్లోనే ఉంటూ మగ్గం నేసుకుంటున్నాడు.
చదవండి: (చిరునవ్వుతో భర్తకు ఎదురెళ్లింది.. ఏమైందో తెలియదు.. కొద్ది నిమిషాల్లోనే..)
రెడ్డిపీరా కుమారుడు రెడ్డిబాషా బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో బుడాన్ చెల్లెలికి పెళ్లి నిశ్చయమైంది. దీంతో అనంతపురంలో పెళ్లికి వెళ్లేందుకు రెడ్డిపీరా భార్య అమ్మాజీ (50), కుమారుడు రెడ్డిబాషా (28), కుమార్తె రేష్మా (30), అల్లుడు బాబు బుడాన్ (36), మనవరాలు తానియాభాను (6) మదనపల్లె నుంచి కారులో మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరారు. మార్గంమధ్యలో జ్వాలాపురం క్రాస్ వద్దకు రాగానే కారు టైరు పగిలిపోయింది. దీంతో కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో అమ్మాజీ, రెడ్డిబాషా, బాబు బుడాన్, రేష్మా అక్కడికక్కడే మృతి చెందారు. చిన్నారి తానియాభాను తీవ్రంగా గాయపడి అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది.
కారులో చిక్కుకుపోయిన మృతదేహాలను పోలీసులు జేసీబీ సాయంతో వెలికితీశారు. క్షతగాత్రురాలిని అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ ఘటనాస్థలాన్ని పరిశీలించి మృతుల బంధువులకు సమాచారం అందించారు. ఈ విషాద వార్త తెలుసుకున్న నక్కలదిన్నె వాసులు దిగ్భ్రాంతి చెందారు. పెళ్లికి వెళ్లి వస్తామని చెప్పిన వాళ్లు మృత్యువాత పడడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు.
Comments
Please login to add a commentAdd a comment