ఇదా చదువు చెప్పే తీరు?
- గురువులకు సబ్ కలెక్టర్ క్లాసు
- మలకపొలం ఆశ్రమ పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు
ఆదివారం.. సమయం మధ్యాహ్నం 12 గంటలు.. ఏడో తరగతి గదిలోకి యువ ఐఏఎస్ అధికారి ఒకరు ఆకస్మికంగా ప్రవేశించారు. ఓ విద్యార్థిని లేపి.. ఇంగ్లిష్ పుస్తకంలోని ఓ పద్యం చదవమని కోరారు.. పుస్తకంవైపు బిక్కమొహం వేసిన విద్యార్థిని చూసి ఆ అధికారి విస్తుపోయారు. రెండుమూడు సార్లు.. ‘చవువమ్మా.. భయంలేదు’.. అంటూ సముదాయించినా ఒక అక్షరం కూడా నోటి నుంచి పెగల్లేదు. మరో ఇద్దరు విద్యార్థులు కూడా ఇలానే బిత్తరచూపులు చూశారు. తొమ్మిదో తరగతి గదిలోకి ప్రవేశించి.. 9/4= రాస్తే.. 37 అని, 9/5=46 అని రాయడంతో ఈ సారి బిత్తరపోవడం ఆ అధికారి వంతు అయింది. మరో విద్యార్థి 100ను 5తో భాగించాలన్నా నేలచూపులు చూశాడు. అంతే.. ఆ అధికారి, ఆ విద్యార్థులకు పాఠాలు చెప్పే గురువులకు క్లాసు తీసుకున్నారు. ఇదీ.. పాడేరు మండలం మలకపొలం గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాలలో జరిగిన సన్నివేశం. ఆ అధికారి.. కొత్తగా వచ్చిన సబ్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్.
పాడేరు : గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు ప్రాథమిక స్థాయిలోనే చదువులో వెనుకబడి ఉండటంపై పాడేరు సబ్‌కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ విస్మయం వ్యక్తం చేశారు. మండలంలోని మారుమూల మలకపొలం ఆశ్రమ పాఠశాలను ఆదివారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 7 9 తరగతుల విద్యార్థులకు గణితం, ఇంగ్లిష్‌లో సబ్‌కలెక్టర్ పలు ప్రశ్నలు వేశారు.
బోర్డుపై చిన్నపాటి అంకెలను వేసి గుణింతాలు, భాగాహారాలు చేయమని పలువురు విద్యార్థులను సబ్‌కలెక్టర్ కోరినా వారు కనీస పరిజ్ఞానం లేకుండా తెల్లముఖాలు వేయడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న గణిత ఉపాధ్యాయుడిని చూస్తూ.. ఇక్కడి విద్యార్థులు చిన్నపాటి లెక్కల్లో కూడా పరిజ్ఞానం లేకపోవ డం దారుణమంటూ తప్పు పట్టారు.
9వ తరగతి విద్యార్థులు ఎక్కాలు కూడా చెప్పలేకపోవడం సబ్‌కలెక్టర్‌ను మరింత బాధించింది. ఓ విద్యార్థిని సబ్‌కలెక్టర్ లేపి ఇంగ్లిష్‌లో తల్లితండ్రుల పేర్లు రాయమన్నా తెలియదని సమాధానం ఇవ్వడంతో ఇక్కడ విద్యార్థులకు విషయ పరిజ్ఞానం లోపించిందని సబ్‌కలెక్టర్ బేరీజు వేశారు.
ఉపాధ్యాయులకు క్లాసు...
గ్రామాల్లో చదువుకున్న సమయంలోనే విద్యార్థులకు సరైన ప్రాథమిక విద్య అబ్బలేదని, నేరుగా ఆశ్రమ పాఠశాలలో చేరుతుండటంతో మళ్లీ బోధించాల్సి వస్తోందని గణిత ఉపాధ్యాయుడు సబ్ కలెక్టర్‌కు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతే వెంటనే సబ్ కలెక్టర్ వెంకటేష్ ప్రసన్న మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో విద్యాబోధన సక్రమంగా లేదని హైస్కూల్ స్థాయిలో కూడా బోధన కార్యక్రమాలను నిర్లక్ష్యం చేస్తారా అంటూ ఉపాధ్యాయులను నిలదీశారు. చదువులో గిరిజన విద్యార్థులు ఇంత వెనుకబడితే ఫలితాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఒక దశలో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఈ పాఠశాలకు తనిఖీకి వస్తానని అప్పటికైనా విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లోనూ పరిణతి చెందేలా శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు.
ఉపాధ్యాయుల గైర్హాజరుపై ఆరా
అనంతరం పాఠశాల మూవ్‌మెంట్ రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. హెచ్‌ఎం సెలవు చీటి ఈ రిజిస్టర్‌లో ఉండటాన్ని సబ్‌కలెక్టర్ తప్పు పట్టారు. హెచ్‌ఎం సెలవు చీటిని గిరిజన సంక్షేమ కార్యాలయానికి అందజేసి అధికారుల అనుమతి తరువాతే సెలవు తీసుకోవాలనిసూచించారు. డిప్యుటీ వార్డెన్, పీఈటీలు కూడా పాఠశాలలో లేకపోవడంపై సబ్‌కలెక్టర్ విచారణ జరిపారు. విద్యార్థులకు మెనూ, తాగునీటి సదుపాయంపై సమీక్షించారు. తహశీల్దార్ రాజకుమారి, డీటీ వంజంగి త్రినాథనాయుడు, వీఆర్వో పద్మ ఆయన వెంట ఉన్నారు.