బిగుసుకుంటున్న ఉచ్చు | Bellampally highlighting politically with Rama goud suicide | Sakshi
Sakshi News home page

బిగుసుకుంటున్న ఉచ్చు

Published Fri, Jan 26 2018 7:59 PM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM

Bellampally highlighting politically with Rama goud suicide - Sakshi

రామాగౌడ్‌ కుటుంబాన్ని పరామర్శిస్తున్న పౌరహక్కుల సంఘం నాయకులు

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినందుకు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న నెన్నెలకు చెందిన గీత కార్మికుడు రామాగౌడ్‌ ఉదంతంలో బాధ్యులపై ఉచ్చు బిగుసుకుంటోంది. రాష్ట్రంలోనే చర్చనీయాంశమైన ఈ కేసును బెల్లంపల్లి సబ్‌ కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ విచారణ చేస్తున్నారు. బుధవారం ఆయన నెన్నెలకు వెళ్లి స్వయంగా రామాగౌడ్‌ కుటుంబసభ్యులతో మాట్లాడడంతోపాటు రామాగౌడ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన పల్ల మహేష్‌ అనే వ్యక్తికి సంబంధించి కూడా వివరాలు సేకరించారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసిన అంశమే ఈ ఘటనలో ప్రధానమైనదిగా మారింది. సబ్‌ కలెక్టర్‌ విచారణ కూడా అట్రాసిటీ కింద ఫిర్యాదు చేసిన మహేష్‌ ఎస్టీనా లేక బీసీనా అనే కోణంతో పాటు ఎస్టీ ధ్రువీకరణ పత్రం జారీ చేసే విషయంలో నిబంధనలు పాటించారా లేదా అనే అంశంపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే మహేష్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగానే, సంబంధిత ఎస్‌ఐ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు తీసుకోగా, విచారణాధికారిగా వ్యవహరించిన ఏసీపీ దానిని సమర్థించి, రామాగౌడ్‌ ఎస్టీ గౌరవానికి భంగం కలిగించినట్లుగా నిర్ధారించారు.

ఈ వ్యవహారంలో ఎస్‌ఐ, ఏసీపీ ఎంతమేర నిజాయితీగా వ్యహరించారనే అంశాన్ని కూడా సబ్‌ కలెక్టర్‌ పరిశీలిస్తున్నట్లు సమాచారం. భూపాలపల్లి ఇన్‌చార్జి కలెక్టర్‌గా ఆర్‌వీ.కర్ణన్‌ మేడారం జాతరను పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో జాతర ప్రారంభమయ్యే 31వ తేదీ లోపే ఆయనకు నివేదిక అందజేయనున్నట్లు సమాచారం.

తహసీల్దార్‌పై తొలివేటు?
పల్ల మహేష్‌ అనే వ్యక్తి రామాగౌడ్‌పై ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయడం వల్లనే ఆత్మహత్య చేసుకున్నట్లు సబ్‌ కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ ప్రాథమిక విచారణలోనే తేలిపోయింది. అయితే మహేష్‌ ఎస్టీ కాదని, పితృస్వామ్య దేశంలో తండ్రి కులమే సంతానానికి సంక్రమిస్తుందనే వాదన తెరపైకి వచ్చింది. గతంలో హైదరాబాద్‌ యూనివర్సిటీలో జరిగిన ఓ విద్యార్థి ఆత్మహత్య విషయంలో కూడా ఇదే వివాదం రేగింది.

ఈ నేపథ్యంలో నెన్నెల తహసీల్దార్‌ ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని మహేష్‌కు ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రం ఇచ్చారనే అంశాన్ని విచారిస్తున్నట్లు సమాచారం. కాగా 2017 సెప్టెంబర్‌ 18న జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రానికి సంబంధించి మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ కూడా ఎస్టీగా సర్టిఫై చేయకుండా ఏకంగా తహసీల్దార్‌ సంతకం చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. కొలావర్‌ కులానికి చెందిన వ్యక్తిగా మహేష్‌ను తహసీల్దార్‌ నేరుగా సర్టిఫై చేయడం గమనార్హం. ఈ కుల ధ్రువీకరణ పత్రం కారణంగానే అట్రాసిటీ కేసు మొదలు, ఆత్మహత్య వరకు చోటు చేసుకోవడంతో విచారణాధికారి కూడా దీనిపైనే ప్రత్యేక దృష్టి పెట్టారు.

రాజకీయంగా బెల్లంపల్లిలో హైటెన్షన్‌
రామాగౌడ్‌ ఆత్మహత్య ఉదంతం బెల్లంపల్లి నియోజకవర్గంలో రాజకీయంగా టెన్షన్‌ వాతావరణానికి కారణమైంది. ఈ ఆత్మహత్యకు అధికార పార్టీ నాయకులే కారణమనే విషయాన్ని ప్రతిపక్షాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధించాయి. నెన్నెల గ్రామ సర్పంచ్, మండల కో అప్షన్‌ సభ్యుడు, ఎంపీటీసీతో పాటు ఎమ్మెల్యేను కూడా ఇందులోకి లాగాయి. అఖిలపక్షం పేరుతో అన్ని పార్టీలు ఆందోళనలు జరుపుతుండడంతో స్వయంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మీడియా సమావేశం పెట్టి తనకే సంబంధం లేదని చెప్పుకునే ప్రయత్నం చేశారు.

రామాగౌడ్‌ తన కుటుంబంలో సభ్యుడి వంటి వాడని ఆయన చెప్పినప్పటికీ, రామాగౌడ్‌ మృతి తరువాత ఎమ్మెల్యేతో పాటు టీఆర్‌ఎస్‌ నాయకులెవరూ బాధితుని కుటుంబాన్ని పరామర్శించకపోవడాన్ని ప్రతిపక్షాలు అవకాశంగా మార్చుకున్నాయి. ప్రత్యక్షంగా టీఆర్‌ఎస్‌ నేతలకు ఈ అంశంతో సంబంధం లేకపోయినా... వారి ప్రోద్బలంతోనే ఎస్టీ ధ్రువీకరణ పత్రం, అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు వంటివి జరిగాయనే విషయాన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు జనంలోకి తీసుకెళ్లడం కొంత ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో సబ్‌ కలెక్టర్‌ నివేదికపైనే కేసు ఆధారపడి ఉంది.

ఎస్‌ఐ, ఏసీపీల విచారణ ఏమైంది..?
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఎవరైనా ఫిర్యాదు చేస్తే దాన్ని రూఢి చేసుకున్న తరువాతే కేసు నమోదు చేయాలన్న ప్రాథమిక సూత్రాన్ని కూడా ఈ కేసులో పాటించలేదని సబ్‌ కలెక్టర్‌ విచారణలో స్పష్టమైనట్లు సమాచారం. ఎస్‌ఐ కేసు నమోదు చేయగానే విచారణాధికారిగా ఏసీపీ వాస్తవాలను విచారించకుండానే రామాగౌడ్‌పై కేసును నిర్ధారించడం, దానికి తహసీల్దార్‌ ఇచ్చిన కుల ధ్రువీకరణ పత్రాన్ని ప్రామాణికంగా తీసుకోవడం కూడా కీలకంగా మారింది. కేసు నమోదు చేసిన తరువాత గౌడ కుల సంఘాలు, రామాగౌడ్‌ కుటుంబసభ్యులు ఏసీపీ, కలెక్టర్‌లను కలిసి వాస్తవాలు తెలియజేసినా, ఎందుకు స్పందించి అట్రాసిటీ కేసు నుంచి సాధారణ కేసుగా మార్చలేదనేది ప్రశ్న. ఈ విషయాలపై విచారణ జరుపుతున్న సబ్‌ కలెక్టర్‌ ఇచ్చే నివేదిక పైనే బాధ్యులపై తీసుకునే చర్యలు ఏంటనేది తేలనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement