Atrasiti case
-
టీడీపీ నేతల దౌర్జన్యకాండ
హనుమాన్‌జంక్షన్ రూరల్(గన్నవరం): బాపులపాడు మండలం కె.సీతారామపురంలో వైఎస్సార్ సీపీ నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం విజయవంతం కావడం అధికార టీడీపీ నేతల్లో గంగవెర్రులు పుట్టించింది. ఆ అక్కసుతో అర్థరాత్రి వైఎస్సార్ సీపీ కార్యకర్తను విచక్షణారహితంగా చితకబాది తల పగలకొట్టారు. వివరాల్లోకి వెళ్లితే కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కె.సీతారామపురంలో ఆదివారం రాత్రి వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పార్టీ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు, పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు డాక్టర్ దుట్టా రామచంద్రరావు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు, జెడ్పీటీసీ సభ్యురాలు కైలే జ్ఞానమణి, ఎంపీటీసీ సభ్యురాలు మంగళపాటి కమలకుమారి పుష్పాలతో నివాళి అర్పించారు. అయితే కొందరు టీడీపీ కార్యకర్తలు బాబు జగ్జీవన్‌రామ్‌కు పూలమాల వేయకుండా అవమానపర్చారంటూ సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టారు. రచ్చబండ ముగిసిన తర్వాత మాజీ సర్పంచి మాయర వెంకటేశ్వరరావు ఇంటి వద్ద వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు ఏర్పాటు చేసిన విందు వద్దకు కొందరు టీడీపీ కార్యకర్తలు బైక్‌పై వచ్చి ఘర్షణకు దిగారు. కారులో తిరిగి వెళ్లుతున్న యార్లగడ్డ వెంకట్రావును అడ్డగించేందుకు యత్నించారు. దీంతో అక్కడే ఉన్న వైఎస్సార్ సీపీ, టీడీపీ నాయకుల మధ్య వివాదం చోటుచేసుకుంది. రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు కర్రలతో బలంగా కొట్టడంతో వైఎస్సార్ సీపీ కార్యకర్త చిన్నం కాశీ విశ్వనాథ్ తల పగిలింది. దీంతో అతడిని పార్టీ నాయకులు హుటాహుటిన ఏలూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హనుమాన్‌జంక్షన్ పోలీసులు నలుగురు టీడీపీ కార్యకర్తలపై సెక్షన్ 324 కింద కేసు నమోదు చేశారు. 11 మందిపై ఎస్సీ అట్రాసిటీ కేసు అధికార పార్టీ నేతలు ఎదురుదాడికి దిగారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు సహా మరో 11 మంది కుల దూషణకు పాల్పడారని ఫిర్యాదు చేశారు.పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దమ్ముంటే నేరుగా రండి వైఎస్సార్ సీపీ కార్యకర్త తల పగలుకొట్టడమే కాకుండా 11 మందిపై ఎదురు తప్పుడు కేసులు పెట్టిన ఘటనను త్రీవంగా ఖండిస్తూ హనుమాన్ జంక్షన్ పోలీస్‌స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాలో డాక్టర్ దుట్టా మాట్లాడుతూ కె.సీతారామపురంలో రచ్చబండ కార్యక్రమానికి గ్రామం యావత్తూ తరలివచ్చి బ్రహ్మారథం పట్టడంతో ఓర్వలేకపోయిన టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే దాడికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ అధికార పార్టీ కేసులకు బెదిరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. చలసానిపై ఎస్సీ అట్రాసిటీ ఫిర్యాదు.. రచ్చబండ కార్యక్రమం నేపథ్యంలో ఆదివారం రాత్రి కె.సీతారామపురంలో వైఎస్సార్ సీపీకి చెందిన ఎస్సీ కార్యకర్తలపై తెలుగురైతు నాయకుడు చలసాని ఆంజనేయులు, టీడీపీ మండల కార్యదర్శి చెన్నుబోయిన శివయ్య, టీడీపీ నాయకులు చెన్నుబోయిన సత్యనారాయణ, కంచనపల్లి రామారావుతో పాటు మరో 20 మంది టీడీపీ కార్యకర్తలు తమపై దాడికి పాల్పడ్డారని హనుమాన్ జంక్షన్ సీఐ వై.వి.ఎల్.నాయుడు, ఎస్ఐ వి.సతీష్‌లకు ఫిర్యాదు చేశారు. కానీ అధికార పార్టీ నేతల ఒత్తిడి మేరకు ఈ ఫిర్యాదుపై హనుమాన్‌జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేయలేదు. -
బిగుసుకుంటున్న ఉచ్చు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినందుకు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న నెన్నెలకు చెందిన గీత కార్మికుడు రామాగౌడ్ ఉదంతంలో బాధ్యులపై ఉచ్చు బిగుసుకుంటోంది. రాష్ట్రంలోనే చర్చనీయాంశమైన ఈ కేసును బెల్లంపల్లి సబ్ కలెక్టర్ రాహుల్‌రాజ్ విచారణ చేస్తున్నారు. బుధవారం ఆయన నెన్నెలకు వెళ్లి స్వయంగా రామాగౌడ్ కుటుంబసభ్యులతో మాట్లాడడంతోపాటు రామాగౌడ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన పల్ల మహేష్ అనే వ్యక్తికి సంబంధించి కూడా వివరాలు సేకరించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసిన అంశమే ఈ ఘటనలో ప్రధానమైనదిగా మారింది. సబ్ కలెక్టర్ విచారణ కూడా అట్రాసిటీ కింద ఫిర్యాదు చేసిన మహేష్ ఎస్టీనా లేక బీసీనా అనే కోణంతో పాటు ఎస్టీ ధ్రువీకరణ పత్రం జారీ చేసే విషయంలో నిబంధనలు పాటించారా లేదా అనే అంశంపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే మహేష్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగానే, సంబంధిత ఎస్ఐ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు తీసుకోగా, విచారణాధికారిగా వ్యవహరించిన ఏసీపీ దానిని సమర్థించి, రామాగౌడ్ ఎస్టీ గౌరవానికి భంగం కలిగించినట్లుగా నిర్ధారించారు. ఈ వ్యవహారంలో ఎస్ఐ, ఏసీపీ ఎంతమేర నిజాయితీగా వ్యహరించారనే అంశాన్ని కూడా సబ్ కలెక్టర్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. భూపాలపల్లి ఇన్చార్జి కలెక్టర్‌గా ఆర్వీ.కర్ణన్ మేడారం జాతరను పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో జాతర ప్రారంభమయ్యే 31వ తేదీ లోపే ఆయనకు నివేదిక అందజేయనున్నట్లు సమాచారం. తహసీల్దార్‌పై తొలివేటు? పల్ల మహేష్ అనే వ్యక్తి రామాగౌడ్‌పై ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయడం వల్లనే ఆత్మహత్య చేసుకున్నట్లు సబ్ కలెక్టర్ రాహుల్‌రాజ్ ప్రాథమిక విచారణలోనే తేలిపోయింది. అయితే మహేష్ ఎస్టీ కాదని, పితృస్వామ్య దేశంలో తండ్రి కులమే సంతానానికి సంక్రమిస్తుందనే వాదన తెరపైకి వచ్చింది. గతంలో హైదరాబాద్ యూనివర్సిటీలో జరిగిన ఓ విద్యార్థి ఆత్మహత్య విషయంలో కూడా ఇదే వివాదం రేగింది. ఈ నేపథ్యంలో నెన్నెల తహసీల్దార్ ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని మహేష్‌కు ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రం ఇచ్చారనే అంశాన్ని విచారిస్తున్నట్లు సమాచారం. కాగా 2017 సెప్టెంబర్ 18న జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రానికి సంబంధించి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ కూడా ఎస్టీగా సర్టిఫై చేయకుండా ఏకంగా తహసీల్దార్ సంతకం చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. కొలావర్ కులానికి చెందిన వ్యక్తిగా మహేష్‌ను తహసీల్దార్ నేరుగా సర్టిఫై చేయడం గమనార్హం. ఈ కుల ధ్రువీకరణ పత్రం కారణంగానే అట్రాసిటీ కేసు మొదలు, ఆత్మహత్య వరకు చోటు చేసుకోవడంతో విచారణాధికారి కూడా దీనిపైనే ప్రత్యేక దృష్టి పెట్టారు. రాజకీయంగా బెల్లంపల్లిలో హైటెన్షన్ రామాగౌడ్ ఆత్మహత్య ఉదంతం బెల్లంపల్లి నియోజకవర్గంలో రాజకీయంగా టెన్షన్ వాతావరణానికి కారణమైంది. ఈ ఆత్మహత్యకు అధికార పార్టీ నాయకులే కారణమనే విషయాన్ని ప్రతిపక్షాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధించాయి. నెన్నెల గ్రామ సర్పంచ్, మండల కో అప్షన్ సభ్యుడు, ఎంపీటీసీతో పాటు ఎమ్మెల్యేను కూడా ఇందులోకి లాగాయి. అఖిలపక్షం పేరుతో అన్ని పార్టీలు ఆందోళనలు జరుపుతుండడంతో స్వయంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మీడియా సమావేశం పెట్టి తనకే సంబంధం లేదని చెప్పుకునే ప్రయత్నం చేశారు. రామాగౌడ్ తన కుటుంబంలో సభ్యుడి వంటి వాడని ఆయన చెప్పినప్పటికీ, రామాగౌడ్ మృతి తరువాత ఎమ్మెల్యేతో పాటు టీఆర్ఎస్ నాయకులెవరూ బాధితుని కుటుంబాన్ని పరామర్శించకపోవడాన్ని ప్రతిపక్షాలు అవకాశంగా మార్చుకున్నాయి. ప్రత్యక్షంగా టీఆర్ఎస్ నేతలకు ఈ అంశంతో సంబంధం లేకపోయినా... వారి ప్రోద్బలంతోనే ఎస్టీ ధ్రువీకరణ పత్రం, అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు వంటివి జరిగాయనే విషయాన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు జనంలోకి తీసుకెళ్లడం కొంత ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో సబ్ కలెక్టర్ నివేదికపైనే కేసు ఆధారపడి ఉంది. ఎస్ఐ, ఏసీపీల విచారణ ఏమైంది..? ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఎవరైనా ఫిర్యాదు చేస్తే దాన్ని రూఢి చేసుకున్న తరువాతే కేసు నమోదు చేయాలన్న ప్రాథమిక సూత్రాన్ని కూడా ఈ కేసులో పాటించలేదని సబ్ కలెక్టర్ విచారణలో స్పష్టమైనట్లు సమాచారం. ఎస్ఐ కేసు నమోదు చేయగానే విచారణాధికారిగా ఏసీపీ వాస్తవాలను విచారించకుండానే రామాగౌడ్‌పై కేసును నిర్ధారించడం, దానికి తహసీల్దార్ ఇచ్చిన కుల ధ్రువీకరణ పత్రాన్ని ప్రామాణికంగా తీసుకోవడం కూడా కీలకంగా మారింది. కేసు నమోదు చేసిన తరువాత గౌడ కుల సంఘాలు, రామాగౌడ్ కుటుంబసభ్యులు ఏసీపీ, కలెక్టర్లను కలిసి వాస్తవాలు తెలియజేసినా, ఎందుకు స్పందించి అట్రాసిటీ కేసు నుంచి సాధారణ కేసుగా మార్చలేదనేది ప్రశ్న. ఈ విషయాలపై విచారణ జరుపుతున్న సబ్ కలెక్టర్ ఇచ్చే నివేదిక పైనే బాధ్యులపై తీసుకునే చర్యలు ఏంటనేది తేలనుంది. -
అట్రాసిటీ కేసుపై విచారణ
సీతంపేట : గిరిజన సహకార సంస్థలో ఎంసీడబ్ల్యూగా పనిచేస్తున్న దళిత మహిళా ఉద్యోగిని ఎం.సాయమ్మపై అదే సంస్థ మేనేజర్ ఎస్.నారాయణరావు ఇటీవల దాడికి పాల్పడినట్లు అట్రాసిటీ కేసు నమోదైన విషయం విదితమే. దీంతో సంబంధిత మేనేజర్‌పై శనివారం విచారణ చేపట్టారు. జిల్లా ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ పి.పెంటారావు దర్యాప్తు నిర్వహించారు. బాధితురాలు, మేనేజర్, ఇతర సిబ్బంది వద్ద వేర్వేరుగా స్టేట్మెంట్ రికార్డు చేశారు. సూపర్‌బజార్ సేల్స్‌మన్ దుర్గారావు, ఇతరుల నుంచి వివరాలు సేకరించారు. -
అట్రాసిటీ కేసుల్లో పరిహారం పెంపు
గత ఉత్తర్వులను సవరిస్తూ సర్కార్ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందినవారు అత్యాచారాలు, దాడులకు గురైనపుడు సహాయం, పునరావాసం కింద అందించే పరిహారాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గతంలోని ఉత్తర్వులను సవరిస్తూ ఆదేశాలు జారీచేసింది. తాజా నిర్ణయం ప్రకారం ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరిగిన సందర్భాల్లో బాధితులు వందశాతం వైకల్యానికి గురైతే రూ. 8.25 లక్షల పరిహారం, 50 శాతం వైకల్యముంటే రూ.4.5 లక్షలు, 50 శాతం కంటె తక్కువ వైకల్యానికి గురైతే రూ. 2.5 లక్షల పరిహారాన్ని అందజేయనున్నారు. దాడిలో హత్యకు గురైనా.. లేదా మరణానికి దారితీస్తే రూ.8.25 లక్షలు, గ్యాంగ్ రేప్‌నకు గురైన వారికి రూ.8.25 లక్షలు, అత్యాచారానికి గురైన వారికి రూ.5 లక్షలు పరిహారమివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాక హత్య, మరణం, రేప్, గ్యాంగ్‌రేప్, శాశ్వత వైకల్యం, దోపిడీకి గురైన కేసుల్లో ఎస్సీ, ఎస్టీ బాధితుల భార్య లేదా వారిపై ఆధారపడి జీవిస్తున్న వారికి నెలకు రూ.5 వేల చొప్పున అందజేస్తారు. ఈ కేసుల్లో చనిపోయిన వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం, వ్యవసాయ భూమి, ఇళ్లు వంటివి అందజేస్తారు. వారి పిల్లలను డిగ్రీ వరకు చదివిస్తారు. దాడుల్లో ఇళ్లు పూర్తిగా ధ్వంసం కావడం లేదా తగులబడితే అదేస్థలంలో ప్రభుత్వ ఖర్చులతో ఇంటిని నిర్మించి ఇస్తారు. వివక్ష బాధితులకు రూ.2 లక్షల పరిహారం.. ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకంగా తప్పుడు సాక్ష్యాలను సృష్టించడం, ఇవ్వడం వంటి కేసుల్లో బాధితులకు రూ.4.15 లక్షల పరిహారాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల చేతుల్లో వివక్ష లేదా బాధితులుగా మారిన వారికి లేదా వారిపై ఆధారపడిన వారికి రూ.2 లక్షలు పరిహారం, ఆలయాల్లోకి, ప్రార్థనాస్థలంలోకి ప్రవేశించకుండా, సామాజిక, సాంస్కృతికంగా ఊరేగింపులు నిర్వహించకుండా అడ్డుకుంటే.. బాధితులకు రూ. లక్ష పరిహారంతో పాటు ఆయా హక్కులను కల్పించాలని నిర్దేశించింది. ఎస్సీ, ఎస్టీలను ఎన్నికల్లో ఓటు వేయకుండా, నామినేషన్ దాఖలు చేయకుండా నిరోధించడం, ఎన్నికల్లో హింస.. ఇతరత్రా దౌర్జన్యకర సంఘటనల్లో బాధితులకు రూ.85 వేల పరిహారాన్ని అందించనున్నారు. ఈ మేరకు ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శి బి. మహేశ్ దత్ ఎక్కా ఉత్తర్వులను జారీచేశారు. -
కటకటాల్లో కామాంధులు
అనంతపురం: సంచలనం సృష్టించిన గిరిజన విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసులో ముగ్గురు కామాంధులను కటకటాల వెనక్కి పంపినట్లు అనంతపురం డీ ఎస్పీ మల్లికార్జునవర్మ బుధవారం సాయంత్రం విలేకరులకు తెలిపారు. కళ్యాణదుర్గం మండలానికి చెందిన ఓ విద్యార్థిని అనంతపురంలోని హాస్టల్లో ఉంటూ ఇంటర్మీడియట్ చదువుతోంది. ఆమె స్నేహితురాలిని రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లికి చెందిన అమర్నాథ్రెడ్డి ప్రేమించాడు. ప్రేమికురాలి ద్వారా పరిచయమైన ఇంటర్ విద్యార్థినిని బైకులో వదిలిపెడతానంటూ పిల్చుకెళ్లిన అమర్నాథ్రెడ్డి ప్రసన్నాయపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. వాటిని వీడియో తీసి తాను చెప్పినట్లు వినకపోతే బయటపెడతానంటూ బెదిరిస్తూ తరచూ ఆమెపై స్నేహితులు వినోద్‌రెడ్డి, కార్తీక్‌తో కలసి అతను కోరిక తీర్చుకునేవాడు. ఈ క్రమంలో మంగళవారం అదే ప్రాంతానికి బాలికను పిలుచుకెళ్లారు. అప్పటికే బాధితురాలి ద్వారా సమాచారం అందుకున్న త్రీటౌన్ సీఐ గోరంట్ల మాధవ్ సిబ్బందితో వెళ్లి నిందితులను పట్టుకున్నారు. గిరిజన బాలిక కావడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు వివరించారు. -
నన్ను కులం పేరుతో దూషించారు
పాతపాడు గిరిజన ఎంపీటీసీ బాణావత్ కుమారి ఆవేదన విజయవాడ(గాంధీనగర్) : నిధుల దుర్వినియోగాన్ని ప్రశ్నించినందుకు తనను కులం పేరుతో దూషించి గ్రామ సభ నుంచి గెంటివేశారని పాతపాడు గ్రామానికి చెందిన గిరిజన మహిళా ఎంపీటీసీ బాణావత్ కుమారి మీడి యా ఎదుట తన గోడు వెళ్లబోసుకుంది. స్థానిక ప్రెస్ క్లబ్లో గిరిజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం విలేకరులతో ఆమె మాట్లాడుతూ నీరు-చెట్టు పథకంలో భాగంగా చెరువులో మట్టి తవ్వకాలకు సంబంధించి రూ.8 లక్షలు వసూలు చేయగా రూ.5 లక్షలు లెక్కల్లో చూపకుండా పంచాయతీ వార్డు సభ్యుడు బెజవాడ ఏడుకొండలు దుర్వినియోగం చేశారన్నారు. ఏప్రిల్ 28న ఇంకుడు గుంతల గ్రామసభలో మిగిలిన 3 లక్షలు గ్రామాభివృద్ధికి ఖర్చు చేద్దామని ఏడుకొండలును కోరగా కులం పేరుతో దూషిస్తూ నీకు లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదంటూ దాడికి పాల్పడ్డారని వాపోయింది. ఏడుకొండలుకు అదే గ్రామానికి చెందిన బి.వానపతి సహకరించారని తెలిపింది. కేసు పెట్టినప్పటికీ పోలీసులు నమోదు చేయలేదని, గన్నవరం ఎమ్మెల్యే వంశీమోహన్‌కు విషయం చెప్పినప్పటికీ పట్టించుకోలేదని తెలిపింది. కొండలరావుపై కేసు నమోదు చేయాలని, అవసరమైతే పోలీసు కమిషనర్‌ను కలిసి న్యాయం చేయాలని అభ్యర్థిస్తానని కుమారి పేర్కొంది. కొండలరావుపై కేసు నమోదు చేయాలి కుమారిపై దాడికి పాల్పడి కులం పేరుతో దూషించిన ఏడుకొండలుపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి గోపిరాజు డిమాండ్ చేశారు. గిరిజన సంఘం నాయకులు రాంప్రసాద్‌నాయక్, రాములు, గిరిజన సంక్షేమ సేవాసంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అజ్మీరా ఛాయాదేవి, ఎంపీటీసీ కుమారి భర్త లక్ష్మణరావు పాల్గొన్నారు. -
అట్రాసిటి కేసు పెట్టారని..
♦ గొంతుకోసుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం ♦ పరిస్థితి విషమం, హైదరాబాద్‌కు తరలింపు తాండూరు రూరల్: అట్రాసిటి కేసు పెట్టారని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి బ్లేడ్‌తో గొంతుకోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన తాండూరు మండలంలోని వీరారెడ్డిపల్లిలో గురువారం చోటు చేసుకుంది. బాధితుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. రాంపూర్ అనుబంధ వీరారెడ్డిపల్లికి చెందిన సన్డ్రాస వెంకటప్ప కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఐదు రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన నల్లొల్ల వెంకటయ్యతో డ్వాక్రా రుణం విషయమై గొడవ జరిగింది. దీంతో వెంకటయ్య వెంకటప్పతో పాటు అతడి కుటుంబీకులపై అట్రాసిటి కేసు పెట్టాడు. దీంతో వెంకటప్ప తీవ్ర మనోవేదనకు గురై గురువారం ఉదయం ఇంటి వద్ద బ్లేడ్‌తో గొంతుకొసుకున్నాడు. కుటుంబీకులు గమనించి తాండూరులోని జిల్లా ఆస్పత్రికి, అక్కడి నుంచి నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై కరన్‌కోట్ ఎస్ఐ చంద్రకాంత్‌ను వివరణ కోరగా.. వెంకటప్పతో పాటు అతని సోదరిపై అట్రాసిటి కేసు నమోదు చేశామన్నారు. వెంకటయ్య సోదరికి పెళ్లి సంబంధం రావడంతో కేసు నేపథ్యంలో సంబంధం చెడిపోవడంతో వెంకటప్ప బ్లేడ్‌తో గొంతు కోసుకున్నాడని తెలిపారు. పూర్తి వివరాలు సేకరిస్తామని ఎస్ఐ వివరించారు. -
అట్రాసిటీ కేసు నమోదుతో టీడీపీ నేత హైడ్రామా
కుటుంబంతో సహా ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ వైనం అడ్డుకున్న పోలీసులు సంగం (ఆత్మకూరురూరల్) : గ్రామంలో తనపై కక్ష కట్టి అట్రాసిటీ కేసు నమోదు చేశారని కుటుం బసమేతంగా ఆత్మహత్య చేసుకుంటున్నానని జన్మభూమి కమిటీ మెంబరు నానా యాగీ చేసిన సంఘటన సంగం మండలం పడమటిపాళెంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. పడమటిపాళెం గ్రామానికి చెందిన షేక్ రసూల్, అతని సోదరులపై మంగళవారం గ్రామానికి చెందిన సుబ్బరాయుడు కులం పేరుతో దూషించారని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడు. సంగం ఎస్సై వేణు కేసు నమోదు చేసుకున్నారు. దీంతో రసూల్, తనపై కక్ష కట్టి ఎలాంటి నేరం చేయకున్నా అట్రాసిటీ కేసు నమోదు చేయడం దారుణమని, తనకు అవమానం జరిగిందని ఇంటి చుట్టుప్రక్కల వారికి చెప్పుకొని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో బుధవారం తనకు న్యాయం జరగదని భావించి కుటుంబ సమేతంగా భార్య, ఇద్దరు పిల్లలతో గృహ నిర్భందం చేసుకున్నాడు. ఇంటి లోపల తలుపులు బిగించుకొని ఆత్మహత్యకు పాల్పడుతున్నామని అందరికీ చెప్పడంతో సమీపంలోని వారు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో ఎస్సై, బుచ్చిరెడ్డిపాళెం సీఐ గంగా వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అవకాశం లేకపోవడంతో కిటికీ వద్ద నుంచి రసూల్‌తో మాటలు కలిపా రు. తాను న్యాయం చేస్తానని, ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడవద్దని ఎస్సై హామీ ఇవ్వడంతో కిటికీ తలుపులు తెరిచి పోలీసు సిబ్బందితో రసూల్ మాట్లాడాడు. ఈ తరుణంలో వెనుకవైపు నుంచి పోలీసు సిబ్బంది లోపలికి ప్రవేశించి ఒంటిపై కిరోసిన్ పోసుకోబోతున్న కుటుంబ సభ్యులను తప్పించారు. అందర్నీ వెలుపలికి తీసుకువచ్చి ఎలాంటి కేసులు నమోదుచేయబోమని, అట్రాసిటీ కేసుపై పూర్తిస్థాయిలో విచారిస్తామని హామీ ఇవ్వడంతో కథ సుఖాంతమైంది. -
అధికారపార్టీ ఆగడాలు!
సాక్షి, కర్నూలు: తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. మాట వినని వారిపై కేసులు పెట్టి భయాందోళనకు గురిచేస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఘోర పరాభావం ఎదురైంది. 14 స్థానాలకు గానూ కేవలం మూడింట మాత్రమే ఆ పార్టీ నేతలు విజయం సాధించారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుటుంబానికి కంచుకోటగా ఉన్న డోన్ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ విజయబావుటా ఎగురవేసింది. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్న డోన్ నియోజకవర్గ టీడీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్న నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. జిల్లాలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు ముగ్గురే ఉన్నప్పటికీ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం.. అధికారులతోనూ నియోజకవర్గ ఇన్చార్జీలు చెప్పినట్లు నడుచుకోవాలని ఆదేశించడంతో వారి ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. డోన్ నియోజకవర్గంలో ఇది మరింత మితిమీరిందనే చెప్పొచ్చు. ఆరు నెలల కిందట.. కౌనిల్సర్పై అసభ్యంగా ప్రవర్తించారని టీడీపీ నేతల ఒత్తిడి మేరకు జెడ్పీటీసీ సభ్యుడు శ్రీరాములు, వైఎస్సార్సీపీ కౌన్సిలర్ పద్మజ భర్త హరికిషన్‌పై, అలాగే పార్టీ కార్యకర్తలు రాజవర్ధన్, ప్రసాద్‌లపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో కౌన్సిలర్ లక్ష్మిదేవి కుమారులు దినేష్‌గౌడ్, నాగార్జునగౌడ్ తదితరులపైనా ఇలాంటి కేసే నమోదు చేశారు. ఊరేగింపు సందర్భంగా జరిగిన చిన్న వివాదాన్ని పెద్దదిగా చేసి లక్ష్మికాంత్, రామాంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ప్యాపిలి గ్రామంలో గత ఏడాది సోమశేఖర్ అనే కార్యకర్తపైనా.. ఆదే మండలానికి చెందిన ఎస్.రంగాపురం గ్రామానికి చెందిన నాగరాజుపైనే ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. వైఎస్సార్సీపీకి మద్దతు ఇస్తున్న వారిపైనా ఇలాంటి చర్యలకే పాల్పడుతుండటంతో టీడీపీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది -
చంద్రబాబుపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) : దళితుల మనోభావాలను కించపరుస్తూ మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఇటీవల దళితులను కించపరిచేలా సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా శనివారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. బుచ్చిరెడ్డిపాళెంలో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబునాయుడు కులరాజకీయాలు మానుకోవాలన్నారు. గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం చింతవరంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ మాట్లాడుతూ సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి దళితుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం సరికాదన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో జరిగిన నిరసన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్సీ, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొండా వెంకటేశ్వర్లు, వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ అల్లారెడ్డి ఆనందరెడ్డి బాబు వ్యాఖ్యలను ఖండించారు. వెంకటగిరి క్రాస్‌రోడ్డులో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా సహాయ కార్యదర్శి చిట్టేటి హరికృష్ణ మాట్లాడుతూ జెడ్పీ చైర్మన్, వెంకటగిరి సమన్వయకర్త బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి నేతృత్వంలో నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట పాత బస్టాండు వద్ద జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ సుబ్రమణ్యంరెడ్డి మాట్లాడారు. కావలిలో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి పందిటి కామరాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. బిట్రగుంటలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ పెంచలయ్య మాట్లాడుతూ దళితజాతిలో పుట్టాలని ఎవరు కోరుకుంటారు అంటూ సీఎం చేసిన వాఖ్యలను ఖండించారు. -
దళితులపై అగ్రవర్ణాల దాడి
నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు రొంపిచర్ల: పరగటిచర్ల గ్రామంలో ఉపాధి హామీ పథకంలో అధికార పార్టీ వర్గ విభేదాలు దళితులపై దాడికి దారి తీశాయి. పరగటిచర్ల గ్రామ పంచాయతీ సర్పంచి పదవి రిజర్వేషన్లో ఎస్సీలకు కేటాయిచారు. ఆ గ్రామానికి చెందిన టీడీపీ మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు కొమ్ముల నాగేశ్వరరావు తన భార్య ప్రభావతిని పోటీ పోయించగా ఆమె గెలిచారు. అయితే టీడీపీకి చెందిన రెండు వర్గాల ఒప్పందం మేరకు చిగురుపాటి ఆదినారాయణ వర్గానికి చెందిన ప్రభావతి మొదటి రెండున్నర సంవత్సరాలు, కామినేని శేషయ్య వర్గానికి సంబంధించి మిగిలిన రెండున్నర సంవత్సరాలు సర్పంచిగా కొనసాగేటట్లు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అయితే చిగురుపాటి, కామినేని వర్గాల మధ్యఒద్దిక కుదరటం లేదు. గ్రామంలో ఉపాధి హామీ పనులు నిర్వహించేందుకు ఇప్పటి వరకు పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంటులను తొలగించి కొత్తవారిని ఏర్పాటు చేసుకునేందుకు రెండు వర్గాలు అంగీకరించాయి. అయితే తమ వర్గానికి చెందిన వారిని ఫీల్డ్ అసిస్టెంటుగా నియమించాలని పట్టుబట్టి చివరికి చిగురుపాటి వర్గానికి చెందిన కొంగర నాగభిక్షంను నియమించారు. రెండు రోజుల క్రితం ఫీల్డ్ అసిస్టెంట్, ఆయన బంధువులు దళితవాడలో పనులు నిర్వహించేందుకు దండోరా వేయాలని వెళ్లారు. అక్కడే ఉన్న సర్పంచి వర్గీయులు పంచాయతీ తీర్మానం లేకుండా పనులు ఎలా నిర్వహిస్తారు అని ప్రశ్నించడంతో గొడవ ప్రారంభమైంది. ఇరువురి మధ్య మాటామాటా పెరిగి ధూషించుకునే వరకు వచ్చింది. సర్పంచి వర్గీయులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రక్షణ కావాలని కోరారు. సర్పంచి భర్త, టీడీపీ ఎస్సీసెల్ అధ్యక్షులు కొమ్ముల నాగేశ్వరరావు పాలకేంద్రంలో 20 ఏళ్ళుగా టెస్టర్‌గా పనిచేస్తున్నారు. యథాప్రకారం శుక్రవారం రాత్రి విధులు నిర్వహించుకునేందుకు వెళ్లాడు. అప్పటికే దారికాచి ఉన్న కొందరు అగ్ర కులస్తులు నాగేశ్వరరావుపై దాడిచేస్తుండగా, కొందరు దళితులు అడ్డుకునేయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో అడ్డువచ్చిన దళితులను కూడా చితకబాదారు. క్షతగాత్రులందరూ నరసరావుపేట ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు.. టీడీపీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు కొమ్ముల నాగేశ్వరరావు మీద దాడి చేసిన ఆగ్రవర్ణాలకు చెందిన 15 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సయ్యద్ సమీర్ బాషా శనివారం తెలిపారు. నాగేశ్వరరావును పరగటిచర్ల గ్రామానికి చెందిన అగ్ర కులాల వారు శుక్రవారం దాడిచేసి కులంపేరుతో ధూషించడమే కాక గాయపరిచినట్లు ఫిర్యాదు అందిందన్నారు. గ్రామంలో శాంతి భద్రత పరిరక్షణ నిమిత్తం పోలీసు పికెట్ ఏర్పాటు చేశామన్నారు. -
రేణుక చౌదరి భర్త ఎస్సీ, ఎస్టీ కేసు
ఖమ్మం: కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి భర్త శ్రీధర్చౌదరితో పాటు మరి కొంత మందిపై బుధవారం టూటౌన్ పోలీసు స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేశారు. ప్రెస్ క్లబ్లో డాక్టర్ రాంజీ భార్య కళావతి విలేకరులతో మాట్లాడుతుండగా రేణుక చౌదరి భర్త శ్రీధర్ చౌదరి ప్రోత్సహంతో రేణుక చౌదరి అనుచరులు నాగెండ్ల దీపక్ చౌదరి, పులిపాటి వెంకయ్య, నున్నా రవి, సిరిపురపు సుదర్శన్, పొరంపల్లి రామారావు, పుల్లయ్య, శేషు రాం నాయక్, సైదులు నాయక్ మరికొంత మంది గిరిజన మహిళ అని చూడ కుండా కులం పేరుతో దూషింస్తూ, చంపుతామని బెదిరించారని కళావతి తన ఫిర్యాదులో పేర్కోన్నారు. ఆమె పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
శరద్‌యాదవ్‌పై అట్రాసిటీ కేసు
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి జితన్ రాం మంఝిపై కులతత్వ విమర్శలు చేసినందుకు జేడీ(యూ) అధ్యక్షుడు శరద్‌యాదవ్‌పై మంగళవారం పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ జస్టిస్ భరత్ సింగ్ ఆదేశం మేరకు, శరద్‌యాదవ్‌పై ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్లో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని పట్నా సీనియర్ ఎస్పీ జితేంద్ర రానా తెలిపారు. శరద్‌యాదవ్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని లోక్ జనశక్తి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు పాశ్వన్ డిసెంబర్ 3న చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 2న శరద్‌యాదవ్ కాన్పూర్‌లో మంఝి విద్యా, రాజకీయ అర్హతలపై చేసిన వ్యాఖ్యలు దళితుల, ముసాహర్ కులస్తుల మనోభావాలను దెబ్బతీశాయని ఆయన ఆరోపించారు. మంఝిని ముసాహర్గా వర్ణించారని విష్ణు పేర్కొన్నారు.