నన్ను కులం పేరుతో దూషించారు
పాతపాడు గిరిజన ఎంపీటీసీ బాణావత్ కుమారి ఆవేదన
విజయవాడ(గాంధీనగర్) : నిధుల దుర్వినియోగాన్ని ప్రశ్నించినందుకు తనను కులం పేరుతో దూషించి గ్రామ సభ నుంచి గెంటివేశారని పాతపాడు గ్రామానికి చెందిన గిరిజన మహిళా ఎంపీటీసీ బాణావత్ కుమారి మీడి యా ఎదుట తన గోడు వెళ్లబోసుకుంది. స్థానిక ప్రెస్ క్లబ్‌లో గిరిజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం విలేకరులతో ఆమె మాట్లాడుతూ నీరు-చెట్టు పథకంలో భాగంగా చెరువులో మట్టి తవ్వకాలకు సంబంధించి రూ.8 లక్షలు వసూలు చేయగా రూ.5 లక్షలు లెక్కల్లో చూపకుండా పంచాయతీ వార్డు సభ్యుడు బెజవాడ ఏడుకొండలు దుర్వినియోగం చేశారన్నారు. ఏప్రిల్ 28న ఇంకుడు గుంతల గ్రామసభలో మిగిలిన 3 లక్షలు గ్రామాభివృద్ధికి ఖర్చు చేద్దామని ఏడుకొండలును కోరగా కులం పేరుతో దూషిస్తూ నీకు లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదంటూ దాడికి పాల్పడ్డారని వాపోయింది. ఏడుకొండలుకు అదే గ్రామానికి చెందిన బి.వానపతి సహకరించారని తెలిపింది.
కేసు పెట్టినప్పటికీ పోలీసులు నమోదు చేయలేదని, గన్నవరం ఎమ్మెల్యే వంశీమోహన్‌కు విషయం చెప్పినప్పటికీ పట్టించుకోలేదని తెలిపింది. కొండలరావుపై కేసు నమోదు చేయాలని, అవసరమైతే పోలీసు కమిషనర్‌ను కలిసి న్యాయం చేయాలని అభ్యర్థిస్తానని కుమారి పేర్కొంది.
కొండలరావుపై కేసు నమోదు చేయాలి
కుమారిపై దాడికి పాల్పడి కులం పేరుతో దూషించిన ఏడుకొండలుపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి గోపిరాజు డిమాండ్ చేశారు. గిరిజన సంఘం నాయకులు రాంప్రసాద్‌నాయక్, రాములు, గిరిజన సంక్షేమ సేవాసంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అజ్మీరా ఛాయాదేవి, ఎంపీటీసీ కుమారి భర్త లక్ష్మణరావు పాల్గొన్నారు.