నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు
రొంపిచర్ల: పరగటిచర్ల గ్రామంలో ఉపాధి హామీ పథకంలో అధికార పార్టీ వర్గ విభేదాలు దళితులపై దాడికి దారి తీశాయి. పరగటిచర్ల గ్రామ పంచాయతీ సర్పంచి పదవి రిజర్వేషన్‌లో ఎస్సీలకు కేటాయిచారు. ఆ గ్రామానికి చెందిన టీడీపీ మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు కొమ్ముల నాగేశ్వరరావు తన భార్య ప్రభావతిని పోటీ పోయించగా ఆమె గెలిచారు. అయితే టీడీపీకి చెందిన రెండు వర్గాల ఒప్పందం మేరకు చిగురుపాటి ఆదినారాయణ వర్గానికి చెందిన ప్రభావతి మొదటి రెండున్నర సంవత్సరాలు, కామినేని శేషయ్య వర్గానికి సంబంధించి మిగిలిన రెండున్నర సంవత్సరాలు సర్పంచిగా కొనసాగేటట్లు ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
అయితే చిగురుపాటి, కామినేని వర్గాల మధ్యఒద్దిక కుదరటం లేదు. గ్రామంలో ఉపాధి హామీ పనులు నిర్వహించేందుకు ఇప్పటి వరకు పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంటులను తొలగించి కొత్తవారిని ఏర్పాటు చేసుకునేందుకు రెండు వర్గాలు అంగీకరించాయి. అయితే తమ వర్గానికి చెందిన వారిని ఫీల్డ్ అసిస్టెంటుగా నియమించాలని పట్టుబట్టి చివరికి చిగురుపాటి వర్గానికి చెందిన కొంగర నాగభిక్షంను నియమించారు. రెండు రోజుల క్రితం ఫీల్డ్ అసిస్టెంట్, ఆయన బంధువులు దళితవాడలో పనులు నిర్వహించేందుకు దండోరా వేయాలని వెళ్లారు. అక్కడే ఉన్న సర్పంచి వర్గీయులు పంచాయతీ తీర్మానం లేకుండా పనులు ఎలా నిర్వహిస్తారు అని ప్రశ్నించడంతో గొడవ ప్రారంభమైంది.
ఇరువురి మధ్య మాటామాటా పెరిగి ధూషించుకునే వరకు వచ్చింది. సర్పంచి వర్గీయులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రక్షణ కావాలని కోరారు. సర్పంచి భర్త, టీడీపీ ఎస్సీసెల్ అధ్యక్షులు కొమ్ముల నాగేశ్వరరావు పాలకేంద్రంలో 20 ఏళ్ళుగా టెస్టర్‌గా పనిచేస్తున్నారు. యథాప్రకారం శుక్రవారం రాత్రి విధులు నిర్వహించుకునేందుకు వెళ్లాడు. అప్పటికే దారికాచి ఉన్న కొందరు అగ్ర కులస్తులు నాగేశ్వరరావుపై దాడిచేస్తుండగా, కొందరు దళితులు అడ్డుకునేయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో అడ్డువచ్చిన దళితులను కూడా చితకబాదారు. క్షతగాత్రులందరూ నరసరావుపేట ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు.
కేసు నమోదు..
టీడీపీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు కొమ్ముల నాగేశ్వరరావు మీద దాడి చేసిన ఆగ్రవర్ణాలకు చెందిన 15 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సయ్యద్ సమీర్ బాషా శనివారం తెలిపారు. నాగేశ్వరరావును పరగటిచర్ల గ్రామానికి చెందిన అగ్ర కులాల వారు శుక్రవారం దాడిచేసి కులంపేరుతో ధూషించడమే కాక గాయపరిచినట్లు ఫిర్యాదు అందిందన్నారు. గ్రామంలో శాంతి భద్రత పరిరక్షణ నిమిత్తం పోలీసు పికెట్ ఏర్పాటు చేశామన్నారు.
దళితులపై అగ్రవర్ణాల దాడి
Published Sun, Feb 21 2016 2:22 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM
Advertisement