టీడీపీ కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడిన వైఎస్సార్ సీపీ కార్యకర్త చిన్నం కాశీ విశ్వనాథ్
హనుమాన్‌జంక్షన్ రూరల్(గన్నవరం): బాపులపాడు మండలం కె.సీతారామపురంలో వైఎస్సార్ సీపీ నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం విజయవంతం కావడం అధికార టీడీపీ నేతల్లో గంగవెర్రులు పుట్టించింది. ఆ అక్కసుతో అర్థరాత్రి వైఎస్సార్ సీపీ కార్యకర్తను విచక్షణారహితంగా చితకబాది తల పగలకొట్టారు. వివరాల్లోకి వెళ్లితే కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కె.సీతారామపురంలో ఆదివారం రాత్రి వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పార్టీ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు, పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు డాక్టర్ దుట్టా రామచంద్రరావు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు, జెడ్పీటీసీ సభ్యురాలు కైలే జ్ఞానమణి, ఎంపీటీసీ సభ్యురాలు మంగళపాటి కమలకుమారి పుష్పాలతో నివాళి అర్పించారు.
అయితే కొందరు టీడీపీ కార్యకర్తలు బాబు జగ్జీవన్‌రామ్‌కు పూలమాల వేయకుండా అవమానపర్చారంటూ సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టారు. రచ్చబండ ముగిసిన తర్వాత మాజీ సర్పంచి మాయర వెంకటేశ్వరరావు ఇంటి వద్ద వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు ఏర్పాటు చేసిన విందు వద్దకు కొందరు టీడీపీ కార్యకర్తలు బైక్‌పై వచ్చి ఘర్షణకు దిగారు. కారులో తిరిగి వెళ్లుతున్న యార్లగడ్డ వెంకట్రావును అడ్డగించేందుకు యత్నించారు. దీంతో అక్కడే ఉన్న వైఎస్సార్ సీపీ, టీడీపీ నాయకుల మధ్య వివాదం చోటుచేసుకుంది. రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు కర్రలతో బలంగా కొట్టడంతో వైఎస్సార్ సీపీ కార్యకర్త చిన్నం కాశీ విశ్వనాథ్ తల పగిలింది. దీంతో అతడిని పార్టీ నాయకులు హుటాహుటిన ఏలూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హనుమాన్‌జంక్షన్ పోలీసులు నలుగురు టీడీపీ కార్యకర్తలపై సెక్షన్ 324 కింద కేసు నమోదు చేశారు.
11 మందిపై ఎస్సీ అట్రాసిటీ కేసు
అధికార పార్టీ నేతలు ఎదురుదాడికి దిగారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు సహా మరో 11 మంది కుల దూషణకు పాల్పడారని ఫిర్యాదు చేశారు.పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
దమ్ముంటే నేరుగా రండి
వైఎస్సార్ సీపీ కార్యకర్త తల పగలుకొట్టడమే కాకుండా 11 మందిపై ఎదురు తప్పుడు కేసులు పెట్టిన ఘటనను త్రీవంగా ఖండిస్తూ హనుమాన్ జంక్షన్ పోలీస్‌స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాలో డాక్టర్ దుట్టా మాట్లాడుతూ కె.సీతారామపురంలో రచ్చబండ కార్యక్రమానికి గ్రామం యావత్తూ తరలివచ్చి బ్రహ్మారథం పట్టడంతో ఓర్వలేకపోయిన టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే దాడికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ అధికార పార్టీ కేసులకు బెదిరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
చలసానిపై ఎస్సీ అట్రాసిటీ ఫిర్యాదు..
రచ్చబండ కార్యక్రమం నేపథ్యంలో ఆదివారం రాత్రి కె.సీతారామపురంలో వైఎస్సార్ సీపీకి చెందిన ఎస్సీ కార్యకర్తలపై తెలుగురైతు నాయకుడు చలసాని ఆంజనేయులు, టీడీపీ మండల కార్యదర్శి చెన్నుబోయిన శివయ్య, టీడీపీ నాయకులు చెన్నుబోయిన సత్యనారాయణ, కంచనపల్లి రామారావుతో పాటు మరో 20 మంది టీడీపీ కార్యకర్తలు తమపై దాడికి పాల్పడ్డారని హనుమాన్ జంక్షన్ సీఐ వై.వి.ఎల్.నాయుడు, ఎస్‌ఐ వి.సతీష్‌లకు ఫిర్యాదు చేశారు. కానీ అధికార పార్టీ నేతల ఒత్తిడి మేరకు ఈ ఫిర్యాదుపై హనుమాన్‌జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment